ETV Bharat / city

ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Sep 19, 2020, 1:20 PM IST

ఈఎస్ఐ కేసులో నిందితుడు (ఏ 14) ఇచ్చిన బెంజ్ కారు... మంత్రి జయరామ్ ఇంట్లోనే ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఇప్పటికైనా మంత్రి వాస్తవాలను అంగీకరించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.

ex minister ayyanna patrudu
ex minister ayyanna patrudu

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

మంత్రి జయరామ్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. ఈఎస్‌ఐ కేసులో నిందితుడి నుంచి కారు తీసుకుని పుట్టినరోజు కానుకగా చెబుతున్నారని అన్నారు. మంత్రి కుమారుడు బెంజ్‌ కారును లంచంగా తీసుకున్నారని ఆరోపించారు. వాస్తవాలు ఒప్పుకుని నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికీ మంత్రి జయరామ్‌ను సీఎం జగన్‌ కాపాడుకుంటూ వస్తారా..? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. అవినీతి నిరోధకశాఖకు ఫోన్‌ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారని.. కానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈశ్వర్ బెంజ్ కారు తీసుకున్నట్లు సామాజిక మాధ్యమంలో పెట్టుకున్నారన్న ఆయన.. తీసుకున్న కారు వారి ఇంట్లోనే ఉందని స్పష్టం చేశారు. సంబంధం లేదని చెబుతూనే అదే కారులో తిరుగుతున్నారని ఆరోపించారు. ఈఎస్ఐ కేసులో ఏ-14 నిందితుడు మంత్రి జయరామ్ కు బినామీ అని అయ్యన్న పునరుద్ఘాటించారు. ఈ విషయంపై సీఎం జగన్ వెంటనే స్పందించాలన్నారు.

ఆరోపణలు చేస్తే మతి భ్రమించిందంటున్నారు. కారు వారిది కాదంటూనే... అదే కారులో తిరుగుతున్నారు. ఆ బెంజ్ కారుపై ఎమ్మెల్యే స్టికర్ ఉంది. ఇంతకంటే మంత్రిగారికి ఏమైనా ఆధారాలు కావాలా...? ఈఎస్ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి కారు ఇవ్వడమేంటి..? కోటి రూపాయల విలువ చేసే కారు ఇచ్చాడంటే ఏదో ఆశించే ఉంటాడు కదా...? ఇప్పటికైనా మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అచ్చెన్నాయుడు విషయంలో ఎలాంటి ఆధారాలు చూపకుండానే అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలైనా ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే..... సామాన్యుల పరిస్థితేంటి..? మంత్రి జయరామ్... కర్నూలు జిల్లాలో భూకబ్జాలకు కూడా పాల్పడుతున్నారు. మాపై ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదు - అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి

--

ఇదీ చదవండి:

డికర్లేషన్ నిబంధనను మార్చాల్సిన అవసరమేంటో?: ఐవైఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.