ETV Bharat / city

EX-IAS PV RAMESH: ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి!

author img

By

Published : Apr 19, 2022, 8:05 AM IST

EX-IAS PV RAMESH: చరిత్రలో ఎప్పుడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. మనకీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కేవలం డబ్బులు పంచడం మాత్రమే కాకుండా అభివృద్ధి రేటు, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల మధ్య ప్రభుత్వం సమతుల్యం సాధించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వ్యాఖ్యానించారు.

EX-IAS PV RAMESH
ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి!

EX-IAS PV RAMESH: రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా ప్రజాధనానికి సంరక్షకురాలి (కస్టోడియన్‌)లా ఉండాలి. ప్రభుత్వం కేవలం డబ్బులు పంచడానికి మాత్రమే లేదు. డబ్బులు పంచితే అందరూ సంతోషిస్తారు. తీసుకున్నవాళ్లు పార్టీలు చేసుకుంటారు. ఇది చాలా తీవ్రమైన అంశం. దీని ప్రభావం దేశ ఆర్థిక రంగం, స్థిరత్వం, భవిష్యత్తుపైనా పడుతుంది. రాష్ట్రంలో పాలన జరగాలి. సంక్షేమం అమలు చేయాలి. ప్రజల జీవితాలకు భద్రత ఇవ్వడంతోపాటు వారు జీవించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచాలి. అభివృద్ధి రేటు, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల మధ్య ప్రభుత్వం సమతుల్యం సాధించాలి. శ్రీలంక జనాభా 2.20 కోట్లు. మన దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ శ్రీలంక కన్నా పెద్దవే. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల ప్రభావం దేశంపైనా పడుతుంది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని కేంద్రమూ, రాష్ట్ర ప్రభుత్వమూ, మీడియా, ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలి.

నాటి ఉచిత విద్యుత్తు ప్రభావంతోనే ఇప్పుడు విద్యుత్తు రంగం దివాలా: 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ఉచిత విద్యుత్తు అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు రంగం దివాలా తీసింది. ఇక కోలుకునే పరిస్థితీ కనిపించడం లేదు. ఒక నిర్ణయం తాలూకా వాస్తవ ప్రభావం మనకు తెలిసొచ్చేందుకు ఇన్నేళ్లు పట్టిందన్నమాట.

ఉచిత పథకాలను నియంత్రించాలి: రాజకీయ నాయకులు అనేక పనులు చేయాలనుకుంటారు. వారికి వేరేవారు సరైన సలహాలైనా ఇచ్చి ఉండకపోవచ్చు, లేక ఎవరి సలహాలనూ వారు వినకపోవడం వల్లయినా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండొచ్చు. ఉచిత పథకాలపై చర్చ జరగాలి. నేను ప్రతి ఒక్కరికీ కిలో బంగారం ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇస్తాను. అది విని ప్రజలు నాకు ఓటేస్తే.. నేను నిజంగా అలా ఇవ్వగలనా? ఇలా హామీలు ఇచ్చేసి ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారా? డబ్బులేమైనా పై నుంచి ఊడిపడుతున్నాయా? లేక మనం సొంతంగా ముద్రించుకోగలమా? రెవెన్యూ ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదు. దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయి. పైగా డబ్బులు పంచిపెట్టేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలూ ఇవ్వడం లేదు. విద్యుత్తు లేదు.. నీటి సరఫరా సరిగా లేదు. రోడ్ల నిర్వహణ అంతకంటే లేదు. ఈ తమాషా ఇంకా కొనసాగించలేం. ఈ విధానాలపై సీరియస్‌గా దృష్టి సారించకపోతే దేశమంతా ఇలాగే అయిపోతుంది.

నెదర్లాండ్స్‌ తరహా విధానం రావాలి: నెదర్లాండ్స్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చేందుకు రాజ్యాంగం అంగీకరించదు. బడ్జెట్‌కు లోబడే అక్కడ హామీలు ఇవ్వాలి. ఇక్కడా అలాంటి చట్టం తేవాలి. అమలు చేయలేని హామీలిచ్చిన రాజకీయ నాయకుడు, పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేలా చట్టం తీసుకురావాలి. -పీవీ రమేష్​, విశ్రాంత ఐఏఎస్​ అధికారి (రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించారు)

ఇదీ చదవండి: మేలుకోకుంటే... మనకూ శ్రీలంక గతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.