ETV Bharat / city

ఈటల అడుగులు.. భాజపా వైపేనా?

author img

By

Published : May 27, 2021, 12:34 PM IST

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్...​ భాజపాలో చేరటం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. కమలనాథులతో వరుసగా భేటీ అవుతున్న ఈటల... కాషాయ కండువా కప్పుకోవటంపై లోతుగా చర్చిస్తున్నారు. మరోవైపు.. తన మద్దతుదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక త్వరలోనే దిల్లీ వెళ్లటం.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావటం.. భాజపాలో చేరటం...! అన్ని కుదిరితే ఇదంతా మూడు నాలుగు రోజుల్లో జరిగిపోతుందని సమాచారం.

etala Rajender‌
ఈటల రాజేందర్‌

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భాజపా గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. గురువారమే దిల్లీకి వెళ్తారనే ప్రచారమూ ఉంది. ముందే ప్రకటించిన విలేకరుల సమావేశాన్ని అందుకే రద్దు చేసుకున్నారని అంటున్నారు. భాజపా వర్గాలు మూడునాలుగు రోజుల్లోపే చేరిక ఉంటుందని చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరనున్నారు.

కొద్దిరోజులుగా భాజపా కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. వారం రోజులుగా ఈ మంతనాలలో వివేక్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘భాజపాలో చేరితే మీ పోరాటానికి పార్టీ అండగా ఉంటుంద’ని ఛుగ్‌ చెప్పారు. రాష్ట్రానికి చెందిన ‘సంఘ్‌’ కీలక నేతతోనూ రాజేందర్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం భాజపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ పర్యటన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: కమలనాథుల వరుసమంతనాలు.. స్వతంత్ర పోటీకే ఈటల​ మొగ్గు..!

తర్జనభర్జన వీడి

రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌, భాజపాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని తొలుత భావించారు. రెండు పార్టీలకు చెందిన పలువురు నేతలతో కొద్దిరోజులుగా విడివిడిగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు. భాజపా నేతలు.. తమ పార్టీలో చేరాలని, ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాము మద్దతు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అనంతరం కాషాయం గూటికి చేరిక వ్యవహారం కొలిక్కివచ్చినట్లు భాజపా వర్గాల సమాచారం. ‘‘పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్‌ ఖరారు కాగానే ఈటల దిల్లీ వెళ్లి కలుస్తారు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా ఎప్పుడన్నది జాతీయ నాయకత్వంతో మాట్లాడాక స్పష్టత వస్తుంది’’ అని భాజపా ముఖ్యనేత ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. నడ్డాకు ఈటల బయోడేటాను రాష్ట్ర పార్టీ పంపించింది.

ఇదీ చూడండి: మాజీ మంత్రి ఈటల భాజపాలో చేరుతున్నట్లు ఊహాగానాలు

మద్దతుదారుల అభిప్రాయాల్ని తెలుసుకున్న ఈటల

భాజపాలో చేరాలా, వద్దా అనే విషయమై ఈటల తన మద్దతుదారుల అభిప్రాయాల్ని మరోమారు అడిగినట్లు తెలిసింది. బుధవారం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన మద్దతుదారులు ఈటలను శామీర్‌పేటలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి నుంచి వస్తున్న ఒత్తిడి, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను దీటుగా ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా వైపు అడుగులేస్తే బాగుంటుందనే భావనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి పలువురు నాయకులు సమ్మతించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

ఇదీ చూడండి:

జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.