ETV Bharat / city

ముందే తేల్చేశారా?.. ల్యాబ్‌కు పంపకుండానే.. మార్ఫింగ్‌ అనుమానాలా?

author img

By

Published : Aug 11, 2022, 7:24 AM IST

SP
ఎస్పీ

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించామని హోంమంత్రి తానేటి వనిత, వైకాపా ఎంపీ మార్గాని భరత్‌ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇప్పటివరకూ చెప్పిన మాటలన్నీ వట్టివేనని తేలిపోయింది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప బుధవారం ప్రెస్‌మీట్‌లో ఈ విషయం వెల్లడించడంతో అది బయటపడింది. మరోవైపు ఆయన చెప్పిన విషయాలపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్పీ: ‘ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు’ అని ఒకసారి.. ‘వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు ఫార్వర్డ్‌, రీ పోస్టు చేయటం వల్ల అది ఒరిజినల్‌ అని నిర్ధారించలేకపోతున్నాం’ అని మరోసారి ప్రెస్‌మీట్‌లో చెప్పారు.
సందేహం: అసలు నిర్ధారణే కాకుండా.. అది ఒరిజినల్‌ కాదని.. ఎడిటింగ్‌, మార్ఫింగ్‌ అనే అనుమానాలున్నాయని ఎలా చెబుతారు? ముందే ఓ అభిప్రాయానికి, నిర్ణయానికి వచ్చేసి దర్యాప్తు ప్రారంభిస్తే అది సరైన దిశలో సాగుతుందా?

ఎస్పీ: బాధితులు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదు. వారు ఫిర్యాదిచ్చి ఒరిజినల్‌ వీడియో అందిస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం
సందేహం: ఈ వీడియో వ్యవహారంపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుని, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీని ఆదేశించారు కదా! మరి దాని ఆధారంగా ఎంపీపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?

ఎస్పీ: ఒరిజినల్‌ వీడియో లభించలేదు కాబట్టే ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించలేదు.
సందేహం: ఒరిజినల్‌ వీడియో వెలికితీసే దిశగా అసలు దర్యాప్తు జరుగుతోందా?

ఎస్పీ: బాధితులు ఫిర్యాదు ఇవ్వకుండా ఎంపీ ఫోన్‌ ఎలా సీజ్‌ చేస్తాం?
సందేహం: ఫిర్యాదు రాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఫోన్‌ సీజ్‌ చేయలేదు సరే.. బాధితురాలు ఇప్పుడు ముందుకొచ్చి ఫిర్యాదిస్తే... దాని ఆధారంగా ఫోన్‌ సీజ్‌ చేసినా అందులో ఆధారాలు లభిస్తాయా? అవి ఇప్పటికే ధ్వంసం అయ్యి ఉండొచ్చు కదా! బాధితులు ధైర్యంగా ఫిర్యాదు ఇవ్వటానికి ముందుకు రండి అని ఇప్పటివరకూ ఎందుకు పిలుపునివ్వడంలేదు?

ఈ ప్రశ్నలకు బదులేది?

* ఎంపీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆయన అభిమాని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశామే తప్ప.. ఎంపీ మాధవ్‌ ఫిర్యాదు చేయలేదని ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు. కానీ ఎంపీ మాధవ్‌ మాత్రం తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ వీడియోపై విచారణ జరిపించాలని కోరానని చెప్పారు. మరి ఏది నిజం?

* ఎంపీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష మహిళా సంఘాలు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చాయి? మరి దాని ఆధారంగా ఎందుకు కేసు నమోదు చేయలేదు?

* అది మార్ఫింగ్‌ వీడియో కాదని నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయాల్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?

* ఐటీడీపీ అఫీషియల్‌ వాట్సప్‌ గ్రూపులో ఈ వీడియో పోస్టు కాకముందు.. అయిదుగురు దాన్ని ఫార్వర్డ్‌ చేసినట్లు గుర్తించామని ఎస్పీ చెప్పారు. వారిని పట్టుకుంటే అసలైన వీడియో బయటకు వచ్చే అవకాశం ఉంది కదా! ఆ దిశగా ప్రయత్నం చేయలేదా?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.