ETV Bharat / city

మాధవ్ 'వీడియో' ఫేకో, రియలో.. వారే తేలుస్తారు: లోకేశ్

author img

By

Published : Aug 10, 2022, 6:30 PM IST

Updated : Aug 11, 2022, 6:26 AM IST

Madhav Nude Video: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేకో, రియలో ప్రజలే తేలుస్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఒకవేళ అది ఫేక్ వీడియోనే అనుకున్నా.. 'నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటీ' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని లోకేశ్ ప్రశ్నించారు.

లోకేశ్
లోకేశ్

మాధవ్ 'వీడియో' ఫేకో, రియలో.. వారే తేలుస్తారు

Lokesh On MP Madhav Nude Video: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎలా చెబుతారని.. ఆయనేమన్నా ఫోరెన్సిక్‌ నిపుణుడా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. ‘వీడియో ఫేక్‌ అని ఎస్పీ ఎలా నిర్ధారిస్తారు? దానికి ఒక విధానం ఉంటుందిగా? ఫేక్‌ అని ఏ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చింది? ఆ నివేదిక బయటపెట్టండి’ అని నిలదీశారు. ‘ఫేక్‌ అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య జరిగింది.. దాంట్లో తప్పేముందని ఎందుకు అన్నారు? అలా అయితే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ రాసలీలలు ఇలాగే జరిగాయా? ఇంత జరుగుతున్నా ఎంపీ మాధవ్‌ను సీఎం జగన్‌.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదు?’ అని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎస్పీకి బాగా తెలిసినట్లుంది..
‘వీడియో ఫేక్‌ అని 5 రోజుల తర్వాత ఎస్పీకి గుర్తొచ్చినట్లుంది. ఒకరోజు వ్యవధిలో అటు హోంమంత్రి, ఇటు ఎస్పీ.. ఫేక్‌ అనే ప్రకటనలిచ్చారు. మరి ఇది ఫేక్‌ అయితే ఒరిజనల్‌ మరోటి ఉందా? మాధవ్‌ గురించి ఎస్పీకి బాగా తెలిసినట్లుంది. ఇద్దరూ పోలీసు అధికారులే కదా!’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘వైకాపా నేతలు మహిళల్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మా అమ్మను కూడా కించపరిచేలా మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శాసనసభలో అసభ్యంగా మాట్లాడినప్పుడు సీఎం ఎందుకు ఆపలేదు? శాసనసభలో ఆ పదాలు వాడతారా? తప్పుడు పనులు చేసి మళ్లీ మా పైనే వేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘నేను కూడా రకరకాలుగా నిందించవచ్చు. కానీ ఎప్పుడూ అలా చేయలేదు. 2012 నుంచి నాపై దుష్పచారం చేస్తున్నారు. నాకు మరో వివాహం జరిగిందని, ఒక కుమారుడున్నాడని తప్పుడు ప్రచారం చేశారు. ఇంట్లో బాధాకరమైన సంఘటన జరిగితే దానిపై కూడా దుష్ప్రచారం చేశారు. ఆరోపణలు చేస్తారు.. ఒక్కటైనా రుజువు చేశారా? ఇవన్నీ ప్రజలు గమనించాలి’ అని అన్నారు.

పరదాల అడ్డు ఎందుకు?
‘మూడేళ్ల మూడు నెలల కాలంలో జగన్‌ ఏం చేశారు? ఇప్పుడే గుర్తొచ్చిందా కుప్పం? రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ ముఖ్యమంత్రులుగా కుప్పానికి ఏం చేశారో చెప్పాలి. జగన్‌ వస్తానంటే చంద్రబాబు ఏం చేశారో చెప్పేందుకు నేను సిద్ధం. నిజంగా జగన్‌కు 175 సీట్లు గెలిచే ధీమా ఉంటే ఎందుకు అంతగా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు 144 సెక్షన్‌. పరదాలు కట్టుకుని వెళ్లడం. ఎక్కడ ఎవరు టమోటాలు, కోడిగుడ్లు విసురుతారోనని భయం. అదే చంద్రబాబు రాయల్‌గా వెళుతున్నారు. పోలవరానికి చంద్రబాబు రాజులా వెళ్లారు. జగన్‌ మాత్రం భయపడుతూ వెళ్లారు. పరదాల వ్యాపారాన్ని రాజధానిలో ప్రారంభించి తర్వాత గుంటూరులో అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా పరదాలే. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే భయంతో వణికిపోతున్నారు’ అని పేర్కొన్నారు.

మంగళగిరి నుంచే పోటీ..
‘వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా నేతలు రూ.500 కోట్లు ఖర్చు చేస్తారని ప్రచారం ఉంది. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. డబ్బు రాజకీయాలు నాకు తెలియవు. ప్రజలకు సేవ చేస్తా. చివరికి వారే నిర్ణయిస్తారు. మంగళగిరిలో ఏ సామాజికవర్గానికి ఎవరు బాగా చేశారనేది వారే తేలుస్తారు? మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాల్ని నేను చేస్తున్నా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి! ఒకవేళ పార్టీ అధినేత చంద్రబాబు సర్వేలో లోకేశ్‌ మంగళగిరికి ఏమీ చేయలేదని ప్రజలు చెబితే అందరినీ మార్చినట్లే నన్నూ మారుస్తారు. సంక్షేమం, అభివృద్ధే.. నా కులం, మతం, ప్రాంతం. ప్రతిపక్షంలోనే ఇన్ని కార్యక్రమాలు చేశాం. అధికారంలోకి వస్తే ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తామో ప్రజలు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.

అప్పటి వరకు తేల్చలేం..: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒరిజినల్ కానందున దానిపై స్పష్టతకు రాలేమని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు షేర్‌ చేయడం వల్ల అది ఎడిటింగ్, మార్ఫింగ్‌ అయ్యిందో లేదో చెప్పలేకపోతున్నామన్నారు. ఒరిజినల్ వీడియో దొరికేంత వరకూ అందులో ఉన్నది ఎంపీనేనా ? కాదా ? అనేది తేల్చలేమని తెగేసి చెప్పారు. వీడియో మొదటగా ఓ లండన్‌ నెంబర్ నుంచి ఫార్వర్డ్ అయ్యిందన్న ఎస్పీ నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఎంపీ మాధవ్ అభిమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. ఎంపీ నుంచి కానీ, బాధితురాలి నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదూ అందలేదని స్పష్టం చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే ఆమె నుంచి వీడియోను సేకరించి వెంటనే తేలుస్తామన్నారు.

విషయం ఏంటంటే..: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి కలకలం రేపింది. ఈనెల 4న (గురువారం) ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 11, 2022, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.