ETV Bharat / city

ఈటీవీ భారత్ ప్రత్యేకం: కరోనాను ఎలా ఎదుర్కోవాలి.. ఎలాంటి మందులు వాడాలి

author img

By

Published : Jun 26, 2020, 7:57 AM IST

అమెరికాలో కరోనా ప్రభావం ఎలా ఉంది. వైరస్​ వ్యాప్తి ప్రారంభమైన నుంచి వైద్యులకు ఏ మేరకు అవగాహన ఏర్పడింది.. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న మందులు ఎలా వినియోగించాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు మహేశ్​ బిక్కిన మాటల్లో..

DR MAHESH INTERVIEW
వైద్యుడు మహేశ్​ బిక్కిన

ప్ర. అమెరికాలో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి. వైరస్​ వ్యాప్తి ఏమైనా అందుబాటులోకి వచ్చిందా?

జ. న్యూయర్క్​, న్యూజెర్సీలో మార్చి నెలలో విపరీతంగా కొవిడ్​ వైరస్​ వ్యాప్తి చెందింది. కానీ ప్రస్తుతం ఆ స్థాయిలో వ్యాప్తి లేదు. కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ... దేశ వ్యాప్తంగా మాత్రం ఆందోళనకరమైన పరిస్థితే కనిపిస్తోంది.

ప్ర. కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఈ 6 నెలల కాలంలో వైద్యులకు వైరస్​పై ఏ మేరకు అవగాహన ఏర్పడింది.?

జ. పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా తగ్గించాలి, ఏ విధంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు అనే విషయాలపై వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్ర. మీరు పనిచేసే న్యూజెర్సీలోని ఆసుపత్రిలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్సా విధానాలేంటి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి?

జ. రోగుల్లో రక్తం గడ్డ కట్టే పరిస్థితులు చాలా వరకు గమనిస్తున్నాం. ఈ వైరస్​ ధాటికి ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి. అందువల్ల వారు వెంటిలేటర్​పై చికిత్స పొందాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారికి రక్తం పలుచబడే మాత్రలు వాడుతూ... నిరంతర పర్యవేక్షణలో ఉంచుతున్నాం. వారు డిశ్ఛార్జ్​ అయ్యి ఇంటికి వెళ్లిపోయినప్పటికీ ఈ బ్లడ్​ థిన్నింగ్​ మాత్రలు వాడేలా సూచనలు చేస్తున్నాం. ఇటివలీ కాలంలో వచ్చిన డెక్సామిథజోన్​ అనే స్టెరాయిడ్​ను వాడితే... వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను వెంటిలేటర్​కు తీసుకెళ్లే అవసరం రాకుండానే చికిత్స చెయొచ్చని తెలుస్తోంది. రెమిడెసివర్​ వల్ల వ్యాధి జీవిత కాలం తగ్గిపోతున్న విషయం గమనిస్తున్నాం. ప్లాస్మా మార్పిడి అనేది ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది.

ప్ర. మీరు చెప్పిన రెండు రకాల యాంటీ వైరల్​ డ్రగ్స్​ ఫలితాలను ఇస్తున్నాయా?

జ. ఫలితాలను ఇస్తున్నాయి, కానీ ఇది పూర్తి చికిత్స మాత్రం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించే ప్రతీ అవకాశాన్ని వాడుకుంటున్నాం. వీటివల్ల రోగులు కాస్త త్వరగా కోలుకుంటున్నారు. మరో 6 నెలలు, ఏడాదిలో పూర్తిస్థాయి ఔషధాలు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నాం.

ప్ర. ఫావిపిరాఫిర్​ అనే ఔషధం త్వరలో ఇండియాలో కూడా అందుబాటులోకి రానుంది. అమెరికాలో దీని వాడకం ఇదివరకే మెదలుపెట్టారు. దీని ఫలితాలు ఎలా ఉన్నాయి?

జ. మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ దశ పరీక్షలు పూర్తి అయిన తరువాత దీన్ని వాడొచ్చు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న రోగులకు వాడే అవకాశం ఉంటుంది. మూడో దశ పరీక్షలు పూర్తయ్యే వరకు... దీనిపై ఓ అంచనాకు రాలేం.

ప్ర. ఫావిపిరాఫిర్​, రెమిడెసివర్, యాంటీ కోయాగ్యులేషన్​లను ఏ విధంగా, ఏ మోతాదులో వినియోగిస్తారు?

జ. వైరస్​ లక్షణాలు తక్కువగా ఉన్న వారికి తొలిదశలో ఫావిపిరాఫిర్​ 15 రోజుల వరకు ఇస్తారు. మధ్యస్థాయిలో లక్షణాలు ఉన్న వారికి రెమిడెసివర్ అందిస్తారు. రోగి ఆసుపత్రిలో చేరగానే ముందుగా 200 మి.గ్రా. డోసు ఇస్తారు. తరువాత నాలుగు రోజులపాటు 100 మి.గ్రా. చొప్పున మొత్తం 5 రోజుల పాటు అందిస్తారు. యాంటీ కోయాగ్యులేషన్​ అనేది ప్రారంభ దశ నుంచి వాడుతాము. బ్లడ్​ థిన్నింగ్​ ఔషధాలలోని ఎపిక్సాపాన్, రివరాక్సాపాన్​ అనే మాత్రలను దీనిలో వాడవచ్చ. ఇండియాలో వార్​ఫిరన్​ అనేది కూడా ఈ రకానికి సంబంధించినదే.

ప్ర. యాంటీ వైరల్​ డ్రగ్స్​ అందుబాటులోకి వచ్చిన తరువాత అమెరికాలో మరణాల రేటు ఏ విధంగా ఉంది?

జ. ఈ చికిత్సలో రోగికి వెంటిలేటర్​ అవసరం రాకపోవడమే మనం సాధించే ప్రథమ విజయం. ఈ వైరస్​ ప్రధానంగా దెబ్బతీసేది శ్వాసవ్యవస్థనే. ఈ డ్రగ్స్​ అందుబాటులోకి వచ్చాక వైరస్​ మరణాల రేటు క్రమంగా తగ్గుతుంది. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో 3 నుంచి 6 నెలల్లో పూర్తి సమాచారం రావొచ్చు.

ప్ర. కరోనా సోకిన కార్డియాక్​ రోగులు ఎంతవరకు కోలుకుంటున్నారు? గుండె వైద్య నిపుణులుగా మీరు గమనించిన అంశాలేమిటి?

జ. కరోనా వైరస్​ సోకటంతో గుండె రెండు విధాలుగా ప్రభావితం అవుతుంది. ఒకటి మయోకార్డియాటిస్​​​, రెండోది రక్తం గడ్డ కట్టి గుండె నొప్పి రావటం. మయోకార్డియాటిస్​​లో వైరస్...​ గుండె కండరాలపై ప్రభావం చూపి, హృదయ కండరాలను బలహీనపరుస్తుంది. ఈ విధంగా ప్రభావితమైన రోగి... త్వరగా కోలుకోలేడు. రోగికి సాంత్వన చేకూర్చడానికి వేరే విధానాలను అవలంబిస్తాం. రెండో దశలో కార్డియాక్​ ఆథరైజ్​ గదిలో గడ్డ కట్టిన రక్తాన్ని తొలగించి, స్టంట్లు వేస్తాం. వీరు త్వరగానే కోలుకుంటారు. కార్డియో మయోపతి, మయోకార్డిటిస్​ వచ్చిన వారి పరిస్థితి ఎప్పటికైనా ఆందోళనకరమే.

ప్ర. కార్డియాక్​ రోగులకు ఈ యాంటీ వైరల్​ డ్రగ్స్​ వాడొచ్చా?

జ. వాడవచ్చు. కార్డియాక్​ రోగులకు కరోనా వైరస్​ సోకినపుడు, వారి ఆక్సిజన్​ స్థాయి పడిపోవటం, న్యూమెనియా, ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు కచ్చితంగా వాడొచ్చు.

ప్ర. ప్రపంచవ్యాప్తంగా రోజుకు లక్ష చొప్పున కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్​ మహమ్మారిని అదుపు చేయగలమా? ఎప్పటి వరకూ సాధ్యం కావొచ్చు?

జ. అదుపు చేయగలమని కచ్చితంగా అయితే చెప్పలేను. మన ప్రయత్నాలు మనం చేయాలి. ముందుగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా మనల్ని విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్ళదు. మనతోపాటే కలిసి ఉంటుంది.

ప్ర. గత మార్చి, ఏప్రిల్​ నెలల్లో అమెరికాలో ఉన్న విధంగా... ప్రస్తుతం భారత్​లో కొవిడ్​ కేసుల ఉద్ధృతి తీవ్రంగా పెరుగుతోంది. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?

జ. భారతదేశంలో జనసాంద్రత ఎక్కువ. అందుకే ఈ వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. మార్చి, ఏప్రిల్​ నెలల్లో చికిత్సా విధానాలు తెలియక అమెరికాలో కేసులు విపరీతంగా పెరిగాయి. ఇంతకు ముందు మీకు చెప్పిన చికిత్సా విధానాలేవీ అప్పుడు అందుబాటులో లేవు. ఇప్పుడు ఔషధాలు అందుబాటులోకి రావటం వల్ల వైద్యుల్లో ఎంతో కొంత ధైర్యం, నమ్మకం అనేవి ఏర్పడ్డాయి.

ప్ర. కొవిడ్​పై పోరులో భారతీయ వైద్యులకు మీ అనుభవాల నుంచి మీరు అందించే సలహాలు, సూచనలు ఏమిటి?

జ. కొవిడ్​ రోగుల చికిత్సా విధానంలో ఫావిపిరాఫిర్​, రెమిడెసివర్, యాంటీ కోయాగ్యులేషన్​, డెక్సామిథాజోన్​లను తగు పరిమాణంలో వాడటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. భారతీయ వైద్యులు కూడా ఈ పద్ధతులను మొదటి నుంచి గమనిస్తున్నారు. ఈ విధానాలు అవలంబిస్తూ, రోగులను కాపాడే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను.

ప్ర. విశ్వవ్యాప్తంగా కొవిడ్-19​కి వ్యాక్సిన్​ను కనుగొనే పనిలో ప్రపంచంలోని చాలా దేశాలు నిమగ్నమయ్యాయి. ఈ మహమ్మారికి విరుగుడు ఎప్పటిలోగా అందుబాటులోకి రావొచ్చు.?

జ. కచ్చితంగా ఈ సమయానికల్లా కొవిడ్-19​కి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పటం చాలా కష్టం. వచ్చినప్పటికీ అది ఎంతగా ప్రభావం చూపిస్తుందనే విషయం మనకు తెలియదు.

ప్ర. అమెరికాలో కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధి మూడో దశలో ఉందని ఇటీవల డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. దీని ఫలితాలు ఎలా ఉన్నాయి.. దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా?

జ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రాలేదు. రెండో దశలో ఫలితాలు చక్కగా ఉన్నాయని తెలిపారు. మూడోదశ ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని పరీక్షలు పూర్తవకముందే దీనిపై ఒక నిర్ణయానికి రావడం సరి కాదు. వ్యాక్సిన్​ అనేది ఒక సారి మాత్రమే పనికొస్తుందా, ఏ మేర ప్రభావం చూపుతుంది అనేవి కూడా చికిత్సలో పరిగణించాల్సిన అంశాలు.

ప్ర. వ్యాక్సిన్​ వచ్చేలోపు భారతీయులకు మీరందించే సలహాలు, జాగ్రత్తలు ఏంటీ?

జ. వ్యాక్సిన్​ వచ్చేలోపు ప్రజలు తమ దైనందిన జీవితంలో తగు జాగ్రత్తలు పాటించాలి. పని ప్రదేశాలలో భౌతిక దూరం పాటిస్తూ... శుభ్రతా చర్యలు తీసుకోవాలి. కచ్చితంగా మోహనికి మాస్క్​ ధరించాలి. వైరస్​ వ్యాప్తి నివారణ చర్యలను విధిగా పాటించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.