ETV Bharat / city

ధరణి: స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌బుక్‌ వరకు అంతా ఆన్​లైనే

author img

By

Published : Oct 29, 2020, 7:09 PM IST

తెలంగాణలో తొలిసారిగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర స్వరూపం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో లభ్యంకానుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం.. ధరణి పోర్టల్‌ను సర్కార్‌ అధికారికంగా ప్రజల ముంగిటకు తెచ్చింది.

స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌బుక్‌ పొందే వరకు అంతా ఆన్​లైనే
స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌బుక్‌ పొందే వరకు అంతా ఆన్​లైనే

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డుల నమోదు.. నిర్వహణలో సరికొత్త విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్లాట్‌ బుకింగ్‌ నుంచి పాస్‌బుక్‌ పొందే వరకు అన్నీ ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ధరణి పోర్టల్‌తో అందుబాటులోకి తెచ్చింది. క్రయవిక్రయాలతో పాటు వివిధ సేవలకు ఈ పోర్టల్‌నే వేదికగా మార్చింది. రెండు నెలలుగా ఆగిన రిజిస్ట్రేషన్లు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ 570 తహసీల్దార్‌ కార్యాలయాల్లో, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 141సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసేలా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే 1.61కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించిన ఆస్తులను ధరణిలో నిక్షిప్తం చేశారు. 1.001కోట్ల వ్యవసాయేతర ఆస్తులు, 1.42 కోట్లఎకరాల సాగు భూములు ఇందులో ఉన్నాయి. మొత్తంగా సుమారు 2.6 కోట్లకు పైగా ఆస్తుల వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

క్రయవిక్రయాలకు అనుగుణంగా..

ధరణి పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఒకేచోట లభించనున్నాయి. రికార్డులను స్వయంగా పరిశీలించుకోవడంతో పాటు.. కావాల్సిన వారికి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఏ వివరాలకూ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా.. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే కొన్నవారి పేరుతో రికార్డులో పేరు మార్పు- మ్యుటేషన్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. క్రయవిక్రయాలకు అనుగుణంగా రికార్డుల్లో వెంటనే మార్పులు చేసుకునే ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తుల పరిరక్షణతోపాటు.. అవినీతికి ఆస్కారంలేని విధంగా చర్యలు చేపట్టారు.

జాప్యానికి ముగింపు..

పాస్‌పుస్తకాల జారీలో జాప్యానికి ధరణితో ముగింపు పడింది. పట్టాదారు పాసుపుస్తకం నంబరు లేదా జిల్లా, మండలం, గ్రామం ఖాతా సంఖ్య లేదా సర్వే నంబరు/సబ్‌డివిజన్‌ సంఖ్య నమోదు చేస్తే భూములు వివరాలు వస్తాయి. ఇందులో పట్టాదారు పాసుపుస్తకం, 1-బి నమూనా-ఆర్​వోఆర్​ , పహాణి/అడంగళ్‌లు అందుబాటులో ఉన్నాయి. ధరణితో ప్రభుత్వ భూముల గుర్తింపు కూడా సులభతరం కానుంది. జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేస్తే.. గ్రామ పరిధిలో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్‌ భూములు, లావుణిపట్టా, కెనాల్‌, శ్మశానం, రోడ్డు, సీలింగ్‌ పట్టా భూమి స్వభావం, వర్గీకరణ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్‌ విలువ ఎంతనే సమాచారం..

ధరణి పోర్టల్‌తో మార్కెట్‌ విలువ కూడా తెలిసిపోనుంది. జిల్లా, మండలం, గ్రామం, సర్వే/సబ్‌డివిజన్‌ నంబరు వంటి వివరాలను నమోదు చేస్తే మార్కెట్‌ విలువ ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుంది. పోర్టల్‌లో ఈసీ కూడా ఆన్‌లైన్‌లో ఉండటంతో నిర్దేశించిన భూమిపై రుణం, తనఖా వంటివి స్పష్టంగా తెలుస్తాయి. పంట రుణం, తనఖా, లోన్‌ అకౌంట్‌ నంబరు, రుణం తీసుకున్న తేదీ, రుణం కాలపరిమితి, రుణ మొత్తం, ఏ బ్యాంకు అనే వివరాలతో పాటు లోన్‌ స్టేటస్‌ కూడా అందుబాటులో ఉంచారు. రుణాలు పొందేటపుడు, క్రయవిక్రయాల సమయంలో సమాచారం దాచడానికి వీలుపడదు.

సేవలు సులభంగా పొందేలా..

ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య లేదా ఇంటి నంబరు నమోదు చేస్తే జిల్లా, మండలం, యజమాని పేరు, భవనం వంటి వివరాలు తెలుస్తాయి. జిల్లా, మండలం, గ్రామం వంటి వివరాల నమోదుతో నిషేధిత ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. సేవలు సులభంగా పొందేలా ధరణి పోర్టల్‌ను రూపొందించారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో వెబ్‌సైట్‌ ఉంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులు అనే రెండు ప్రత్యేక కేటగిరీల్లో ఉన్నాయి. వ్యవసాయ సేవలకు ఆకుపచ్చ రంగు, వ్యవసాయేతర ఆస్తులకు ఎరుపు రంగును కేటాయించారు.

ఇదీ చదవండి

జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.