ETV Bharat / city

జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం.. రాష్ట్రంలో 60.13% ఇళ్లకే కుళాయిలు

author img

By

Published : Jul 28, 2022, 5:53 AM IST

గ్రామాల్లో ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) ప్రాజెక్టు రాష్ట్రంలో నీరుగారుతోంది. జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం వల్ల రాష్ట్రంలో కేవలం 60.13% ఇళ్లకే కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఈ విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచింది.

జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం
జలజీవన్‌ మిషన్‌ పనుల్లో జాప్యం

తాగునీరు ప్రాణాధారం. గ్రామాల్లో ప్రజలందరికీ రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) ప్రాజెక్టు రాష్ట్రంలో నీరుగారుతోంది తప్ప.. మంచినీళ్లు ఇవ్వలేకపోతోంది. ఈ పథకానికి కేంద్రం ప్రతియేటా కేటాయించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఇవ్వాలి. గత రెండేళ్లు చేసిన పనులకు మొన్నటివరకూ బిల్లులు ఇవ్వలేదు. కొత్త పనులకు చాలా జిల్లాల్లో గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటివరకు 60.13% ఇళ్లకే తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఈ విషయంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 17వ స్థానంలో నిలిచింది. జేజేఎం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభ ఏడాది 2019-20లో కేంద్రం రూ.372.64 కోట్లు కేటాయిస్తే... రాష్ట్ర ప్రభుత్వం రూ.54.80 కోట్లే ఖర్చు చేసింది. 2021-22లో రాష్ట్ర వాటా రూ.791.06 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ (బీఆర్‌) జారీచేసినా.. ఇప్పటికీ రూపాయి కూడా విడుదల కాలేదు. 2022-23లో కేంద్రం రూ.3,458.20 కోట్లు కేటాయించింది. రాష్ట్రప్రభుత్వ వాటా నిధులు ఇంకా విడుదల చేయలేదు.

ఏడు జిల్లాల్లో మందకొడిగా పనులు

రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, కర్నూలు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జేజేఎం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని 5,39,302 గ్రామీణ ఇళ్లలో ఇప్పటివరకు 1,10,346 గృహాలకే (25.33%) కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఆరు జిల్లాల్లో 25-47% లోపే ఇళ్లకు కనెక్షన్లు జారీచేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.