ETV Bharat / city

దుర్గ గుడిలో నిలిచిన ప్రసాదం తయారీ.. ఎండిపోయిన లడ్డూలు విక్రయించటంపై విమర్శలు

author img

By

Published : Jan 18, 2021, 3:41 PM IST

విజయవాడ దుర్గ గుడిలో గట్టిగా ఎండిపోయిన లడ్డూలు విక్రయించటంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా తయారు చేసిన ప్రసాదాలు ఇవ్వాలని నిలదీశారు. భవానీదీక్షల కోసం తయారుచేసిన లడ్డూ ప్రసాదం భారీగా మిగిలిపోవటంతో.. పది రోజుల నుంచి ప్రసాదం తయారీ నిలిపివేశారు. మిగిలిపోయిన లడ్డూలు పాడవకుండా చూసి, భక్తులకు విక్రయిస్తున్నారు.

Durga temple at vijayawada
దుర్గ గుడిలో ఎండిపోయిన లడ్డూలు విక్రయించటంపై విమర్శలు

విజయవాడ దుర్గగుడిలో భవానీదీక్షల కోసం తయారు చేసిన లడ్డూ ప్రసాదం భారీగా మిగిలిపోయింది. వాటిని విక్రయించిన తర్వాతే మళ్లీ ప్రసాదాల తయారీ చేపట్టాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఉత్సవాలు ముగిసి ఇప్పటికి తొమ్మిది రోజులు గడుస్తున్నా.. లడ్డూ ప్రసాదం అమ్మకాలు పూర్తికాలేదు. ఆదివారం నాటికి ఇంకా 50 వేలకు పైగా లడ్డూ ప్రసాదం మిగిలి ఉంది. వాటిని విక్రయించే లోగా ప్రసాదం పాడైపోకుండా ఉండేలా చూసేందుకు సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు.

5 రోజుల్లో ఏడు లక్షల లడ్డూలు తయారీ..

భవానీ దీక్షల విరమణ వేడుకలు జరిగిన 5 రోజుల్లో ఏడు లక్షల లడ్డూలు తయారు చేసిన ఆలయ అధికారులు.. ఐదు లక్షలు మాత్రమే విక్రయించగలిగారు. మిగిలిన ప్రసాదాలను ఇప్పటివరకూ విక్రయిస్తూనే ఉన్నారు. భవానీ దీక్షల విరమణ అనంతరం ఆలయానికి భక్తుల తాకిడి తక్కువగా ఉండటంతో.. ప్రసాదాల విక్రయాలు నెమ్మదించాయి. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది.. ప్రసాదం పాడవకుండా ట్రేలలో ఉంచేశారు. దీంతో లడ్డూలు గట్టిగా మారినప్పటికీ పాడవ్వలేదు.

ఎండిపోయిన లడ్డూలు విక్రయించటంపై విమర్శలు..

సాధారణంగా రెండు రోజులకు ఒకసారి దుర్గ గుడిలో లడ్డూ ప్రసాదం తయారీ చేస్తారు. ప్రస్తుతం ఈనెల 8 నుంచి ప్రసాదాల తయారీని ఆపేశారు. పులిహోర ప్రసాదం కూడా తయారు చేయకుండా.. ఆలయానికి వచ్చే భక్తులకు లడ్డూలను మాత్రమే విక్రయిస్తున్నారు. తడి ఆరిపోవటంతో లడ్డూల బరువు కూడా తగ్గిపోయింది. గత రెండు రోజుల్లో ఎక్కువ సంఖ్యలో గుడికి వచ్చిన భక్తులకు.. గట్టిగా ఎండిపోయిన లడ్డూలు విక్రయించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా తయారు చేసిన ప్రసాదాలు ఇవ్వాలని పలువురు భక్తులు నిలదీశారు.

ఇవీ చూడండి...: పామర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్​ ఇంతియాజ్​

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.