ETV Bharat / city

డిసెంబర్ 30 నాటికి పంట నష్టం జమ చేయాలి: సీఎం జగన్

author img

By

Published : Nov 28, 2020, 5:50 PM IST

నివర్ తుపాను సృష్టించిన విలయంలో మృతి చెందిన బాధితులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తుపాను ధాటికి కకావికలమైన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. డిసెంబర్ 15 నాటి కల్లా పంటనష్టం పూర్తిగా అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం.. డిసెంబర్ 30 నాటికి రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేసేలా ప్రణాళికలు రచించాలని ఆదేశించారు.

cyclone affected areas
cyclone affected areas

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి స్వాగతం పలికారు. అనంతరం హోంమంత్రి సుచరిత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం హెలికాఫ్టర్ ద్వారా మూడు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను దాటికి తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టాన్ని, ముంపునకు గురైన ప్రాంతాలను సీఎం విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అధికారులు సీఎంకు వివరాలను అందజేశారు.

  • నివర్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. pic.twitter.com/CyjWfAIi4l

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు...

రేణిగుంట విమానాశ్రయానికి తిరిగి చేరుకున్న సీఎం జగన్...తుఫాన్ ప్రభావం, దాని తీవ్రత ను వివరించేలా అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తుపాను ప్రభావానికి తెగిపోయిన రహదారులు, పడిపోయిన వంతెనలు, నీట మునిగిన పంటల ఫొటోలను సీఎం పరిశీలించారు. అనంతరం మంత్రులు, మూడు జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను ఏర్పరచిన నష్టాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎంకు నివేదికల రూపంలో సమర్పించారు. వాటిన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి... రాష్ట్రంలో తుపాను కారణంగా చనిపోయిన మృతులకు ఒక్కొక్కరికి 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో వీలైనంత త్వరగా అంచనా వేయాలని అధికారులకు సూచించారు. నష్టంపై డిసెంబర్ 15 నాటికి వివరాలతో కూడిన తుది జాబితాను రూపొందించాలన్నారు.

సీఎం జగన్ ఏరియల్ సర్వే

సీఎంతో సమీక్ష సమావేశం అనంతరం వివరాలను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మీడియాకు వెల్లడించారు. డిసెంబర్15 నాటికి పంట నష్టం జాబితాను రూపొందించి డిసెంబర్ 30 నాటికి తుపానుతో నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని సూచించారన్నారు. రైతుల నష్టపరిహారం జాబితా తయారీ విషయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం చెప్పినట్టు అంజాద్ బాషా తెలిపారు. తుపాను కారణంగా మూడు జిల్లాల్లో చాలా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తాయన్న డిప్యూటీ సీఎం.. వాటి సామర్థ్యాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రచించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఇందులో భాగంగానే కడప జిల్లా బుగ్గవంక ప్రాజెక్ట్ లో మిగులు పనులను తక్షణం చేపట్టేలా 39కోట్ల రూపాయల నిధుల మంజూరుకు సీఎం ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఫించా, అన్నమయ్య ప్రాజెక్టుల సామర్థ్యం పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ముంచుకొస్తున్న ముప్పు.. 48 గంటల్లో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.