Ap new cabinet: కొత్త మంత్రిమండలి కూర్పుపై మంతనాలు షురూ

author img

By

Published : Sep 26, 2021, 6:51 AM IST

cm-jagans-exercise-on-the-composition-of-the-state-cabinet

రాష్ట్ర మంత్రిమండలి కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపాలోని కొందరు ముఖ్యనేతలు, సీనియర్లతో ఈ విషయంపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి కొత్త మంత్రిమండలి కొలువుదీరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్త మంత్రిమండలి కూర్పుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. జిల్లాల వారీగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? వారి ప్రాధాన్యాలేంటి? సామాజిక సమీకరణాలు వంటి అంశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి. వైకాపాలోని కొందరు ముఖ్యనేతలు, సీనియర్లతో దీనిపై ముఖ్యమంత్రి చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. సంక్రాంతికి కొత్త మంత్రిమండలి కొలువుదీరే అవకాశం ఉందంటున్నారు. ఆ తర్వాత సీఎం జగన్‌ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. మంత్రిమండలిలో వందశాతం మార్పులు ఉంటాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. వాస్తవానికి వైకాపా ప్రభుత్వం కొలువుదీరినప్పుడు రెండున్నరేళ్ల తర్వాత ఇందులో 80-90 శాతం మందిని మారుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే, ప్రస్తుతం ఉన్నవారిలో నలుగురైదుగురు సీనియర్‌ మంత్రులను కొనసాగించి, మిగిలిన వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారని వైకాపాలో చర్చలు జరిగాయి. ఇప్పుడు బాలినేని వ్యాఖ్యలతో సీనియర్లనూ పక్కన పెట్టేస్తారా? లేదా వారిని కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది. మంత్రిమండలిలో మార్పులపై ఇప్పుడే కసరత్తు ప్రారంభమైందని, చర్చల సమయంలో మిగిలిన అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నాయి.

కొవిడ్‌ వెసులుబాటు ఉంటుందా?

దాదాపు ఏడాదిన్నరకు పైగా కొవిడ్‌ సంక్షోభం కొనసాగుతోంది. అందువల్ల ప్రస్తుత మంత్రులు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు కాబట్టి రెండున్నరేళ్లు కాకుండా ఇంకొంత సమయం ఇద్దాం అని ముఖ్యమంత్రి అన్నట్లు వైకాపాలో కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అలా వెసులుబాటు కల్పిస్తే 2022 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల వరకూ ఈ మంత్రులు కొనసాగే అవకాశమూ లేకపోలేదని నేతలు చెబుతున్నారు.

జూనియర్లకే ప్రాధాన్యం?

కొత్త మంత్రిమండలిలో సీనియర్ల కంటే జూనియర్‌ ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో విస్తృతంగా ఉంది. 2024 ఎన్నికల బృందంగా కొత్త మంత్రిమండలి ఉంటుందనేది ఆ చర్చ సారాంశం. ఇలాంటి ఎమ్మెల్యేల పనితీరుపై పలు కోణాల్లో సీఎం నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలిసింది.

కొత్త మంత్రులపై మొదలైన లెక్కలు

కొత్త మంత్రిమండలి కూర్పుపై కసరత్తు ప్రారంభమవడంతో.. ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం దృష్టిలో పడేందుకూ ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో ఈ మంత్రిని తప్పిస్తే కొత్తగా ఫలానా ఎమ్మెల్యేకు అవకాశం దక్కుతుందంటూ జిల్లాల వారీగా కూడికలు, తీసివేతలు మొదలయ్యాయి.

ఇదీ చూడండి:

Minister Balineni: మంత్రివర్గ విస్తరణలో వందశాతం కొత్తవారే.. పార్టీ ముఖ్యమన్న బాలినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.