ETV Bharat / city

"చలో దావోస్".. ఫ్లైట్ ఎక్కిన సీఎం జగన్ బృందం

author img

By

Published : May 20, 2022, 5:22 AM IST

Updated : May 20, 2022, 10:53 AM IST

దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు.. సీఎం జగన్ బృందం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకూ ఐదు రోజుల పాటుసాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి టీమ్ పాల్గొంటుంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నరాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాల్ని వివరించి.. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించనుంది.

"చలో దావోస్".. ఫ్లైట్ ఎక్కిన సీఎం జగన్ బృందం
"చలో దావోస్".. ఫ్లైట్ ఎక్కిన సీఎం జగన్ బృందం

స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ పయనమయ్యారు. సీఎం జగన్ తోపాటు ఆయన సతీమణి భారతి, కుమార్తె వైఎస్.వర్షారెడ్డి, ఓఎస్డీలు పి.కృష్ణ మోహన్ రెడ్డి, ఏ.జోషి ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 31న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సీఎం జగన్ కు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఎస్. సమీర్ శర్మ, కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.

దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటన

కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు.. ఈ నెల 22 నుంచి 26వరకూ జరగనుంది. రాష్ట్రం నుంచి సీఎం జగన్‌ తోపాటు, మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం కీలక చర్చలు జరపనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రస్తావించనున్నారు. కొవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ అంశాల్నివివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల్ని వివరించేందుకు దావోస్‌లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్‌ ఏర్పాటుచేశారు.

ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన మార్పులు, నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేయనున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి అంశాలపైనా ఈ సదస్సులో దృష్టిసారించనున్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం జగన్‌ వివరించనున్నారు.

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌ అంశాల వివరణకు అధికారులు దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. "పీపుల్‌ –ప్రోగ్రెస్‌ –పాజిబిలిటీస్‌" నినాదంతో ఈ పెవిలియన్‌ జరుగుతోంది. ఇండిస్ట్రియలైజేషన్‌ 4.0కు వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలు, మౌలిక సదుపాయాలను వివరించనున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్, పోర్టుల నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో సవివరంగా తెలియజేయనున్నారు. బెంగళూరు –హైదరాబాద్, చెన్నై –బెంగుళూరు, విశాఖపట్నం –చెన్నై కారిడార్లలో ఉన్న అవకాశాల్ని ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. మానవవనరుల నైపుణ్యాల అభివృద్ధి సహా పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపైనా దృష్టిసారించనున్నారు.

ఇదీ చదవండి:

Last Updated :May 20, 2022, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.