ETV Bharat / city

ప్రచారానికి కాదేదీ అనర్హం.. పట్టాదారు పాసుపుస్తకాలపైనా సీఎం ఫొటో

author img

By

Published : Oct 15, 2022, 10:19 AM IST

ప్రచారానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది.. వైకాపా ప్రభుత్వం వైఖరి. చివరకు.. రైతులకు వారి సొంత భూమిపై హక్కులను ధ్రువీకరణ చేస్తూ ఇచ్చే పట్టాదారు పాసుపుస్తకంపైనా, సీఎం జగన్‌ పెద్ద ఫొటో.. పెద్ద అక్షరాలతో ఆయన పేరు ఉండటం విమర్శలకు తావిస్తోంది. భూమి అసలు హక్కుదారు రైతా లేక జగనా అన్న అనుమానం రాకమానదు. ముందు, వెనకా లోపలా.. అంతటా జగన్‌ ఫొటో ఉండటం చూస్తే.. అది పట్టాదారు పాసుపుస్తకమా లేక వైకాపా ప్రచార కరపత్రమా అన్న అనుమానం కలగక మానదు.

Land pass books
పట్టా పుస్తకాలపై సీఎం జగన్​ ఫొటోలు

అన్నదాత తన ఊపిరిగా భావించే పట్టాదారు పాసుపుస్తకం.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కరపత్రంగా మారింది. తన సొంత భూమికి భూహక్కు పత్రాన్ని ఇస్తున్నట్లు... సీఎం జగన్‌ పాసు పుస్తకాన్ని రూపొందించారు. వ్యక్తిగత ఆస్తుల వివరాలను పొందుపరిచే ఈ పుస్తకాల్లో ఇలాంటి ప్రభుత్వ ప్రచార ఆర్భాటం గతంలో ఎన్నడూ లేదు. చట్ట ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాన్ని.. రైతుల పేరుతో నిర్దుష్ట నియమావళికి అనుగణంగా ముద్రించి అందజేయాలి. దీనికి భిన్నంగా ప్రభుత్వ ప్రచారానికి అనుకూలంగా మార్చేశారు. పుస్తకం అట్టపై ముఖ్యమంత్రి పెద్ద చిత్రంతోపాటు... 'జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్షణ పథకం' అంటూ... పెద్ద అక్షరాలతో ముద్రించారు. కింది భాగంలో.. 'భూ యజమాన్యపు హక్కుపత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకం' అని చిన్న అక్షరాలతో రాశారు. పంట పొలం కనిపించడంతో పాటు డ్రోన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ముద్రించారు. రెండో పేజీలో ప్రభుత్వ అధికారిక చిహ్నం ఉంది. మూడో పేజీ నుంచి ఈ చిహ్నంతోపాటు... ముఖ్యమంత్రి జగన్‌ చిత్రమున్న నవరత్నాల లోగో ఉంది. లోపలి 3 పేజీల్లోనూ రెండువైపులా ఈ చిహ్నాలున్నాయి. చివరి అట్టపై ముఖ్యమంత్రి జగన్‌ చిత్రాన్ని మళ్లీ ప్రముఖంగా చూపుతూ... 'మన దేశం.. మన రాష్ట్రం.. మన గౌరవం' అని రాశారు. శాశ్వతంగా భద్రపర్చుకునే ఈ పుస్తకంలో రైతు ఫొటో నామమాత్రంగా మారింది.

పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణకు ముందు.. అధికారులు నాలుగు నమూనాలు రూపొందించి.. సీఎం జగన్‌కు పంపారు. ఆయన అంగీకారానికి అనుగుణంగానే.. ఈ పుస్తకాలను రాష్ట్రంలో ముద్రిస్తున్నారు. ప్రతి పేజీలో.. సీఎం ఫొటో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని సుమారు 20 లక్షల మంది రైతులకు.. త్వరలో భూహక్కు పత్రం పేరుతో వీటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకం ప్రచార కరపత్రంగా రూపొందడంపై.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న పట్టాదారు పాసుపుస్తకంలో ఎక్కడా ముఖ్యమంత్రి ఫొటో లేదు. పుస్తకం ముందు పైభాగంలో.. 'రైతులు, రైతుకూలీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమ'ని ముద్రించారు. రాష్ట్ర చిహ్నం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పట్టాదారు పాసుపుస్తకం, అనుసూచిక, యజమాని సాగు చేసే భూ వివరాలు, భూమి శిస్తు, రుణ వివరాలను ముద్రించారు.

కొత్త పాసుపుస్తకం రెండో పేజీలో.. ప్రభుత్వ చిహ్నం కింద... 'జగనన్న భూయాజమాన్యపు హక్కు పత్రం మరియు పట్టాదారు పాసుపుస్తకం' అని పేర్కొన్నారు. ఆ తర్వాత భూ యజమాని ఫోటో ముద్రించిన పేజీల్లో.. జిల్లా, డివిజన్‌, మండలం, గ్రామం, ఖాతా నంబర్లు, పాసుపుస్తకం ఇచ్చిన తేదీ, పట్టాదారు పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగము, కులం, ఆధార్‌, మొబైల్‌ నంబర్ వివరాలున్నాయి. మూడో పేజీలో భూవిస్తీర్ణం, భూమి రకం సహా ఇతర వివరాలుంటాయి. వాటి పక్కనే లబ్ధిదారుడి వివరాలు ఆంగ్లంలో ఉన్నాయి. భూకమత పటాన్నీ ముద్రించారు. పుస్తకంలో పేర్కొన్న వివరాలు కాకుండా ఇతర లావాదేవీలు జరిగితే... కొత్త భూయాజమాన్యపు హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం తీసుకోవడం ఐచ్ఛికం చేశారు. ఈ వివరాలతో 1-బి నమూనాను మీసేవా కేంద్రాల్లో పొందవచ్చు. మీ భూమి వెబ్‌సైట్‌ నుంచీ తీసుకోవచ్చు.

ఇప్పటికీ రీసర్వే రాళ్లలో జగనన్న పేరును విస్తృతంగా వాడుతున్నారు. ప్రతి సర్వే రాయిపై వైఎస్సార్‌ జగనన్న భూరక్ష-2020 అని రాసి ఉంది. ఉచిత ఇంటి స్థలాల పట్టాల్లోనూ జగన్‌ అట్టహాస ప్రచారమే కనిపించింది. సర్కారు డబ్బుతో ఈ సొంత డబ్బా ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

పట్టా పుస్తకాలపై సీఎం జగన్​ ఫొటోలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.