ETV Bharat / city

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది..వీడియో కాన్ఫరెన్స్​లో సీఎం జగన్‌

author img

By

Published : May 24, 2021, 1:12 PM IST

Updated : May 25, 2021, 5:07 AM IST

CM Jagan
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌

తుపాన్‌ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్రమంత్రి అమిత్‌షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల గురించి హోంమంత్రికి వివరించారు. అనంతరం అధికారలతో సీఎం సమావేశమయ్యారు.

యస్‌ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై దీని ప్రభావం స్పల్పంగానే ఉండే అవకాశముందని, పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగుతామన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సోమవారం తుపాను ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో జగన్‌ మాట్లాడారు. ఈనెల 22న కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి నిర్వహించిన సమావేశానికి అధికారులు హాజరయ్యారని చెప్పారు. అనంతరం తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘విద్యుత్తు, ఆక్సిజన్‌లపై అప్రమత్తత అవసరం. తుపానుతో కొవిడ్‌ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. పరిణామాలను ముందే అంచనా వేసుకుని విద్యుత్తు సరఫరా, ఆక్సిజన్‌ ప్లాంట్లు తదితర విషయాలపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్సిజన్‌ ఉత్పత్తి, రీఫిల్లింగ్‌ ప్లాంట్లకు విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలి. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో అవాంతరం కలగకుండా డీజిల్‌ జనరేటర్లు ఏర్పాటు చేయాలి. సిబ్బందిని ప్రత్యేకంగా ఆయా ఆస్పత్రులకు కేటాయించాలి. ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బందులు వస్తే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. 15వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు రప్పిస్తున్నందున వాటి నిర్వహణపై దృష్టి సారించాలి. అవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలి. యస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల నుంచి కోవిడ్‌ రోగులను తరలించాలి. ఎక్కడ నుంచి ఎక్కడికి తరలించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని తుపాను ప్రభావం ప్రారంభ కాకముందే చర్యలు తీసుకోవాలి. తుపాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసే సహాయక శిబిరాల్లో నిత్యావసర వస్తువుల మొదలు అన్నీ ఉండేలా చూడాలి’’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను తక్షణమే విశాఖ వెళ్లి.. అక్కడి నుంచే సహాయ చర్యలు సమీక్షించాలని సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రే సీఎస్‌ విశాఖ చేరుకున్నారు. మంగళవారం ఆయన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో తుపాను పరిస్థితిపై సమీక్షించనున్నారు.

అధికారులు సిద్ధంగా ఉండాలి..

యస్‌ తుపాను నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ సూచించారు. విజయవాడలోని జలవనరులశాఖ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన వీడియో సమావేశం ద్వారా... ప్రాజెక్టుల పురోగతి, తుపాను జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా అధికారులు మరింత జాగ్రత్త తీసుకోవాలని, చెరువులు తెగకుండా చూడాలని సూచించారు. తీర ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలని చెప్పారు. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టు పనుల పురోగతిపైనా మంత్రి సమీక్షించారు. పునరావాస కార్యక్రమాల సందర్భంగా నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

వాకీ టాకీలనూ అందించాలి

ట్రాన్స్‌కో సీఎండీ

క్షేత్రస్థాయిలో పనిచేసే ఇంజినీర్లకు ఫోన్లతో పాటు వాకీ టాకీలనూ అందించాలని ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ ఆదేశించారు. ఈ మేరకు డిస్కంల సీఎండీలతో చర్చించారు. తీర ప్రాంతాల్లో పనిచేసే అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ఇవీ చూడండి...

'తెదేపా నేతల గృహ నిర్బంధం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం'

Last Updated :May 25, 2021, 5:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.