ETV Bharat / city

'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్​పై సీఎం జగన్

author img

By

Published : Jul 17, 2021, 8:03 AM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లలో రాష్ట్రం కొన్ని మార్పులు కోరుకుంటోంది. రాష్ట్రంలోని అనేక అంతర్గత ప్రాజెక్టులు, కాలువలనూ బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారని, అవి అవసరం లేదని అభిప్రాయపడుతోంది. కేంద్రం వెలువరించిన గెజిట్‌పై అధికారుల వద్ద ముఖ్యమంత్రి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

cm jagan on central water  board gazit
cm jagan on central water board gazit

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గురువారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ కొన్ని మార్పులు కోరుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రంలోని అనేక అంతర్గత ప్రాజెక్టులను, కాలువలనూ బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారని, అవన్నీ బోర్డు పరిధిలో అవసరం లేదని అభిప్రాయపడుతోంది. తాజా నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం జలవనరులశాఖ, సీఎంవో అధికారులతో చర్చించారు. అధికారుల అభిప్రాయాలూ తెలుసుకున్నారు.

బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో రాష్ట్రానికి దక్కే 512 టీఎంసీల వాటా హక్కులు కాపాడేలా బోర్డు జోక్యం ఉండాలనే అభిప్రాయాన్ని సీఎం జగన్‌ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ నీటిని మనం ఎక్కడ ఎలా మన అవసరాల మేరకు వినియోగించుకున్నా బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాని రీతిలో పరిధి ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో దిగువ రాష్ట్రంగా వరద జలాలపై ఏపీకే హక్కు ఉండాలనీ ఆయన అభిప్రాయపడ్డారు. ఆ హక్కును ప్రశ్నించేలా బోర్డుల పరిధి ఉండకూడదన్నారు.

కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆరు నెలల లోపు అనుమతులు తెచ్చుకోవాలని కూడా నోటిఫికేషన్‌ తేల్చింది. దిగువ రాష్ట్రంగా వరద అంతా మనకు వదిలేస్తారని, దానివల్ల వాటిల్లే నష్టాలు మనం భరిస్తున్నామని- ఆ నీటిని ఎలా వినియోగించుకున్నా ప్రశ్నించకూడని విధంగా హక్కు ఉండాలన్నారు. కొత్త ప్రాజెక్టులు మన నిధులతో నిర్మించుకుంటామని, వరద వస్తే ఆ నీళ్లు వినియోగించుకుంటామని, లేకుంటే అవి ఖాళీగా ఉంటాయని కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.

గోదావరిపై కాటన్‌ బ్యారేజి, కృష్ణాపై ప్రకాశం బ్యారేజి, వాటి కాలువలు, అవుట్‌ లెట్‌లు కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని కూడా అధికారులు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి జలాశయాల వరకు బోర్డు పరిధిలో ఉంచితే సరిపోయేదని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

'మార్పులు కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తాం'

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి దిగువ ప్రాజెక్టులను చేర్చవలసిన అవసరం లేదని, కొన్ని మార్పులు కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టును పొరపాటున చేర్చి ఉండకపోవచ్చని, అది కూడా చేర్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంకా ఏ మార్పులు అవసరమో చర్చించి కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. విజయవాడలో శుక్రవారం వారు విలేకర్లతో మాట్లాడారు.

అపెక్స్‌ కౌన్సిల్‌లో కేంద్రం వ్యక్తం చేసిన అభిప్రాయం మేరకు బోర్డుల పరిధిని ఖరారు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటి నుంచో కోరుతోందన్నారు. ఈ రెండు బోర్డుల పరిధిలోకి చేర్చిన అన్ని ప్రాజెక్టులూ వాటి పరిధిలోకి అక్కర్లేదని, ఏ మార్పులు అవసరం అన్నదానిపై చర్చిస్తున్నామని శ్యామలరావు వివరించారు. తెలంగాణ రాష్ట్రం తాజాగా శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వకు అవకాశం లేకుండా విద్యుత్తు ఉత్పత్తి చేయడం, సాగర్‌, పులిచింతల్లోనూ ఇలాగే వ్యవహరించిన అంశాలను ప్రస్తావించారు.

ఇంతవరకూ శ్రీశైలం జలాశయంలో 30.28 టీఎంసీల నీరు వస్తే 29.82 టీఎంసీలు జలవిద్యుత్తుకే తెలంగాణ వినియోగించిందని ఆయన చెప్పారు. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా వారు విద్యుత్తు ఉత్పత్తి చేయడం వల్ల సముద్రంలోకి 8 టీఎంసీలు వృథాగా వదిలేయాల్సి వచ్చిందన్నారు. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ సాగునీటి హక్కులను కాపాడుకోగలమని నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరీ దిగువన ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకసారి నీరు విడుదల చేసిన తర్వాత ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలన్నది మన హక్కు అన్నారు. దిగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, కాల్వలు బోర్డుల పరిధిలో ఉంటే పంటలు దెబ్బతినే అవకాశం ఉందని, అలాంటి ప్రాజెక్టులు మినహాయించేలా మార్పులు కోరతామని చెప్పారు.

ఇదీ చదవండి:

Ministry of Jal Shakti: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా: జల్‌శక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.