ETV Bharat / city

CM Jagan On PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్‌

author img

By

Published : Jan 6, 2022, 3:13 PM IST

Updated : Jan 7, 2022, 4:41 AM IST

పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం
పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం

15:09 January 06

ఉద్యో గ సంఘాలతో సీఎం జగన్ సమావేశం

ఉద్యో గ సంఘాలతో సీఎం జగన్ సమావేశం

‘ఉద్యోగ సంఘాలు ఆచరణాత్మకంగా ఆలోచించాలి. ఫిట్‌మెంట్‌ విషయంలో కొంత తగ్గాలి. అధికారులు కొంత పెరగాలి. మీరు చెప్పినవన్నీ రాసుకున్నా. పీఆర్సీ విషయంలో ఎంత చేయగలిగితే అంత చేస్తా. దీనిపై 2,3 రోజుల్లో ప్రకటన ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. 11వ వేతన సవరణ సంఘం నివేదిక అమలు, ఇతర 71 డిమాండ్ల నేపథ్యంలో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..‘‘కొన్ని వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం తర్వాత అన్ని సంవత్సరాలపైనా పడుతుంది. మనం అధికారంలోకి వచ్చాక అనుకోని పరిస్థితులొచ్చాయి. ఏటా కనీసం 15శాతం ఆదాయం పెరుగుతూ ఉండాలి. అలాంటిది ఆదాయాలు తగ్గాయి. మరోవైపు ఒమిక్రాన్‌.. దేశంలో ఈ రోజు 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారంనాటికి 2లక్షల కేసులవుతాయని అంటున్నారు. ఇది ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి. నవంబరుతో పోలిస్తే డిసెంబరులో ఆదాయాలు తగ్గాయి. ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ రెండూ తగ్గాయి. ఈ పరిస్థితుల మధ్య పీఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కలిసి ముందుకు సాగాలి.

* 2018-19లో రాష్ట్ర సొంత ఆదాయాలు రూ.62,503 కోట్లు, 2019-20నాటికి రూ.60,934 కోట్లకు, 2020-21లో రూ.60,688 కోట్లకు తగ్గాయి. మామూలు పరిస్థితులో ఏటా 15శాతం పెరగాలి. అలా జరిగి ఉంటే 2020-21నాటికి రూ.84 వేల కోట్లు కావాలి. అలా జరగకపోగా తగ్గాయి. మరోవైపు మొత్తం పింఛన్లు, జీతాలు 2018-19లో రూ.52,513 కోట్లు కాగా, 2020-21నాటికి రూ.67,340 కోట్లకు చేరాయి. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27శాతం మధ్యంతర భృతినిచ్చాం. ఈరోజు వరకు ఐఆర్‌ రూపంలో రూ.18వేల కోట్లు చెల్లించాం. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలతో సహా వివిధ కేటగిరీల ఉద్యోగుల జీతాలు పెంచాం. కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బంది జీతాలు పెంచడం వల్ల ఏడాదికి ఈ ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు చేరింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేలు సహా ఇతర ప్రయోజనాలు కల్పించాం. వీటివల్ల ఏడాదికి అదనంగా రూ.360 కోట్ల భారం పడుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరినుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడంతో 2021 అక్టోబరు వరకు రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

* గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకంతో ఏడాదికి రూ.2,300 కోట్లు, వైద్యశాఖలో 14వేల మంది నియామకం వల్ల రూ.820 కోట్ల భారం పడింది. మధ్యవర్తులు లేకుండా పొరుగుసేవల సిబ్బందికి వేతనాలిస్తున్నాం. ఆప్కాస్‌ ఏర్పాటుచేశాం. ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ప్రయోజనాలు కల్పించాం. వీటి వల్ల రూ.2,040 కోట్ల భారం పడుతోంది. ఎంపీడీవోల పదోన్నతుల అంశాన్ని పరిష్కరించాం. గ్రేడ్‌-1 వీఆర్వోలకు ప్రమోషన్‌ ఛానల్‌ కల్పించాం. 3,795 వీఆర్వో, వీఏవో పోస్టులు భర్తీ చేశాం. మహిళా ఉద్యోగులకు ఏటా 5రోజుల అదనపు సెలవులిచ్చాం. హైదరాబాద్‌నుంచి వచ్చిన వారికి 30శాతం అద్దెభత్యం ఇస్తున్నాం. ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమిది. మొత్తం జీతాలు, పింఛన్ల ఖర్చు రూ.67 వేల కోట్లకు పెరిగింది.

తెలంగాణతో పోలికా?

తెలంగాణతో చాలాసార్లు పోలిక వస్తోంది. ఇలా చేస్తే వాదనకు బలం చేకూరుతుందని అనిపించవచ్చు. వారి తలసరి ఆదాయం రూ.2,37,632. మనది రూ.1,70,215 మాత్రమే. తెలంగాణలో పింఛన్లు, జీతాలపై ఖర్చు చేసింది తొలి 7నెలలకు రూ.22,608 కోట్లు. అదే సమయంలో ఏపీలో రూ.36వేల కోట్లు వెచ్చించాం. గుజరాత్‌ రూ.16,053 కోట్లు, బిహార్‌ రూ.25,567.50 కోట్లు మాత్రమే వెచ్చించాయి. ప్రస్తుతం జీతాల ప్రకారం కమిటీ చెప్పిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలుచేస్తే ప్రభుత్వంపై రూ.7,137 కోట్ల భారం పడుతుంది. ఫిట్‌మెంట్‌ ఇచ్చే సమయానికి డీఏలూ ఇవ్వాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

విభజనతో నష్టపోయాం

‘రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికంగా ఇబ్బందులొచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మనదే తక్కువ ఆదాయం. షెడ్యూలు9లో పేర్కొన్న 1.06 లక్షల కోట్ల ఆస్తులను వదులుకొని వచ్చాం. షెడ్యూలు10 ఆస్తులు వదులుకోవడం వల్ల రూ.39,191 కోట్లు కోల్పోయాం. రెవెన్యూ లోటు బకాయి రూ.18,969 కోట్లు అలాగే ఉంది. హైదరాబాద్‌ను కోల్పోయాం. కేంద్రంనుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గింది’ అని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థికశాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు.

తెలంగాణతో పోల్చుకోకుండా ఉండలేం

- ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

‘గతంలో ఇచ్చిన పీఆర్సీల ప్రకారం తెలంగాణతో పోల్చుకోకుండా ఉండలేమని సీఎంకు చెప్పాం. తెలంగాణలో ఇచ్చిన 30శాతం ఫిట్‌మెంట్‌ ప్రస్తావించినప్పుడు ఆ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందని సీఎం చెప్పారు. వారితో పోల్చుకోవద్దన్నారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 55శాతం ఇవ్వాలని కోరాం. అధికారులు చెబుతున్న 14.29శాతం ఫిట్‌మెంట్‌ సరైనది కాదని, ఉద్యోగ సంఘాలు సైతం కొంత తగ్గాలని సీఎం అన్నారు. 2రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.’

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ ఎప్పుడూ తగ్గలేదు..
- ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు
‘గతంలో ఎప్పుడూ ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తగ్గలేదు. 9న ఐకాసల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం. ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం’.

ఆర్థిక శాఖ లెక్కలు అసంబద్ధం
- ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి హృదయరాజు

‘ఉద్యోగుల వేతనాలపై ఆర్థిక శాఖ లెక్కలు అసంబద్ధం. సీపీఎస్‌ను రద్దు చేయాలని సీఎంను కోరాం’.

శాస్త్రీయతను తెలిపాం..
- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

‘2010లో పీఆర్సీ కమిషన్‌ 27శాతం ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేస్తే 39శాతం ఇచ్చారు. 11ఏళ్ల తర్వాత ఎంత శాతం ఫిట్‌మెంట్‌ శాస్త్రీయమవుతుందో ఆలోచించాలని సీఎంకు చెప్పాం’.

ఫిట్‌మెంట్‌ 34శాతం ఇవ్వాలని కోరాం
- సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

‘ఫిట్‌మెంట్‌ 34శాతం ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్‌ సమ్మతంగా లేకపోతే ఉద్యోగులందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటాం’.

ఇదీ చదవండి :
bopparaju: ఇక్కడికన్నా.. తెలంగాణలోనే ఎక్కువ : బొప్పరాజు

Last Updated :Jan 7, 2022, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.