ETV Bharat / city

CBN on fight for local issues: స్థానిక సమస్యలపై పోరు ఉద్ధృతం చేయండి -చంద్రబాబు

author img

By

Published : Feb 1, 2022, 7:41 AM IST

CBN on fight for local issues: స్థానిక సమస్యలపై ఫిబ్రవరి నుంచి పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్ధృతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకుల అక్రమాలపై గట్టిగా పోరాడాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు.

CBN on fight for local issues
స్థానిక సమస్యలపై పోరు ఉద్ధృతం చేయండి -చంద్రబాబు

CBN on fight for local issues: స్థానిక సమస్యలపై ఫిబ్రవరి నుంచి పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉద్ధృతం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు, నాయకుల అక్రమాలపై గట్టిగా పోరాడాలని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ.. రైతులకు లీటరు పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించేదని, దానిపై తెదేపా నిలదీయడం వల్లే ఫిబ్రవరి నుంచి ధర పెంచిందని చంద్రబాబు పేర్కొన్నారు.

‘వైకాపా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇంతవరకు ఒక్క సమస్యనూ పరిష్కరించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గ స్థాయి, స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడే పోరాడాలి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడంలో పార్టీ నేతలు బాగా పనిచేశారు’ అని వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నేతలతో ఆయన సోమవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. కొత్తగా ఇన్‌ఛార్జులను నియమించిన మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లోని క్యాడర్‌లో ఆత్మస్థైర్యం పెంచేలా అక్కడి నాయకత్వం పనిచేస్తోందని చంద్రబాబు అభినందించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో వైకాపా నేతల వసూళ్లు, భూకబ్జాలపై పెద్దఎత్తున ఫిర్యాదులున్నాయని కొందరు నేతలు సమావేశంలో వివరించగా.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియాపైనా పోరాడాలని సూచించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచేందుకు, రకరకాల పన్నులతో ప్రజల్ని పీల్చుకు తినేందుకు సిద్ధమయ్యారని, దీనిపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లయినా, జూనియర్లయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గెలిచే వారిని, సమర్థుల్ని వదులుకోబోమని, అదే సమయంలో ప్రజల కోసం పనిచేయని నేతల్ని ఇక మోసేది లేదని తెలిపారు. కొందరు నాయకుల వల్ల కార్యకర్తల్ని ఇబ్బందుల్లోకి నెట్టలేమన్నారు.

ఇదీ చదవండి : AP CS: 'ఉద్యోగులు సమ్మె వరకు వెళ్లకుండా చూడండి'.. అధికారులకు సీఎస్​ ఆదేశాలు

ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటుచేయాలి: జిల్లాల పునర్విభజన ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరిగిందని, సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, నిర్ణయాలతో రాష్ట్రంలో తీవ్ర గందరగోళం నెలకొందని పార్టీ నాయకులు ప్రస్తావించారు. కొత్త జిల్లాలకు సంబంధించిన తమ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందుల్ని నేతలు వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది.

ఎన్టీఆర్‌ పేరుతో ఉన్న పథకాలు తీసేసి గొప్పలు : తెదేపా హయాంలో ఎన్టీఆర్‌ పేరుతో అమలుచేసిన 14 పథకాల్ని.. వైకాపా అధికారంలోకి వచ్చాక కొన్నింటిని రద్దు చేసిందని, కొన్నింటికి పేర్లు మార్చేసిందని, ఇప్పుడు ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని గొప్పలు చెబుతోందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. పార్టీ ఆవిర్భవించి ఈ మార్చికి 40 ఏళ్లవుతున్న సందర్భంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. మహానాడుతోపాటు ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా భారీగా కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.

ఇదీ చదవండి : New Districts in AP: జిల్లాల ఏర్పాటుపై ఆగని ఆందోళనలు... పలు ప్రాంతాల్లో కొనసాగిన దీక్షలు


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.