ETV Bharat / city

'రాష్ట్రాభివృద్ధికి ఇంధనం అమరావతి... కాపాడుకోవడం అందరి కర్తవ్యం'

author img

By

Published : Aug 7, 2020, 6:23 PM IST

Updated : Aug 7, 2020, 7:19 PM IST

అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజల కర్తవ్యమని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే అమరావతి చేపట్టామని స్పష్టం చేశారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని... అన్నీ అనుకూలంగా ఉన్నాయనే అమరావతి ఎంపిక చేశామని చెప్పారు. అమరావతిలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు వచ్చేలా చేశామన్న చంద్రబాబు... ఉద్యోగ అవకాశాలు పెరగాలనే హైటెక్ సిటీ నిర్మించామన్నారు. హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయని వివరించారు. వాటివల్లే ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి అధిక ఆదాయం వస్తోందన్న చంద్రబాబు... ఆరోజు కులం చూసి హైదరాబాద్‌ అభివృద్ధి చేశానా..? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ రాష్ట్రాభివృద్ధికి అమరావతి ఇంధనంలా పని చేస్తుందని అభిప్రాయపడ్డారు.

Chandrababu comments Amaravati and Jagan
చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధి రథచక్రానికి ఇంధనంగా అమరావతి ఉండాలన్నదే తన ఆలోచనని... ఆ దిశగానే అమరావతి రాజధాని ప్రాంతానికి రూపకల్పన చేశామని... ఇదే సమయంలో అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రణాళికలుు అమలు చేసేందుకు ప్రయత్నించామని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. దేవతల రాజధానిగా అమరావతికి పేరు ఉందని... ఆ పేరు గొప్పతనం.. స్థలం మహత్యం కారణంగా ప్రపంచం అంతా మొచ్చుకుని సహకరించేందుకు ముందుకొస్తే... ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డికి ఎందుకు కోపమని ప్రశ్నించారు. అమరావతి పేరును ఉచ్చరించడానికి ఎందుకు మనసు రావడం లేదని నిలదీశారు. ఇటీవల హిందూ మహాసభ- అమరావతిని దక్షిణ అయోధ్యగా అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చిందని... కానీ అమరావతి విధ్వంసానికి ఈ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు.

ఎన్నికలకు ముందు ఒక మాట... అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాటతో ప్రజలను మోసం చేశారని- నమ్మించి వెన్నుపోటు పొడిచారని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి అని... ఆంధ్రప్రదేశ్‌ కోసమే అమరావతి అని... అమరావతి కోసమే ఆంధ్రప్రదేశ్‌ అనే వాదన సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి విషయంలో ఇప్పటివరకు రెండుసార్లు మీడియా సమావేశాలు నిర్వహించి- రాజీనామాలు చేసి ప్రజాతీర్పుకు రావాలని అధికారపక్షానికి సవాల్‌ చేసినా వారి నుంచి స్పందన లేకపోవడంతో- మూడోసారి మీడియా సమావేశం నిర్వహించి- తన బాధ్యతలకు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అమరావతిని కాపాడుకోవడానికి- ప్రభుత్వం చేస్తోన్న విధ్వంసాన్ని ఎదుర్కోవడం అందరిపైనా ఉందని అన్నారు. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాలకు

సమదూరం.. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రదేశంగా అమరావతిని రాజధానిగా ప్రకటించామని... రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అన్ని జిల్లాల పరిధిలో 160 ప్రాజెక్టులు ప్రకటించామన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15 జాతీయ సంస్థల్లో పన్నెండింటిని రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను వేసిన విత్తనం హైటెక్‌ సిటీ అని పునరుద్ఘాటించిన చంద్రబాబు- అదే తరహాలో దూరదృష్టితో అమరావతిని హరిత నగరంగా- స్వయం సమృద్ధితో అభివృద్ధి చెందే ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని సంకల్పించానని- కానీ ఈ ప్రభుత్వం మూడు రాజదానుల పేరిట మూడు ముక్కల పేకాట అడుతోందన్నారు.

ప్రపంచం అంతా తిరిగి రాష్ట్రానికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని.. రాయలసీమలో 13 వేల ఐదు వందల కోట్ల రూపాయలతో కియా మోటారు పరిశ్రమ వచ్చిందని- తిరుపతిలో 90 వేల కోట్ల పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ఉపాధి వచ్చే పరిస్థితి నెలకొందని... సౌర, పవన విద్యుత్తు అభివృద్ధి ద్వారా తక్కువ ఖర్చుకు విద్యుత్తు అందుబాటులో ఉంచాలని ఆలోచించామని... భవిష్యత్తులో విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని ముందుగానే ప్రకటించామని అన్నారు. నదుల అనుసంధానం... మౌలిక వసతుల మెరుగు...పోర్టులు, ఎయిర్‌పోర్టులపై శ్రద్ధ వంటి చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేకు తాము శ్రీకారం చుట్టామని.. .ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఏమైందని... మూడు రాజధానులు పెడితే కర్నూలు నుంచి శ్రీకాకుళం ఎలా వెళ్తారని? చంద్రబాబు ప్రశ్నించారు.

ఒక్క అమరావతిలో 139 ప్రాజెక్టులు తెచ్చామని... అవన్నీ పూర్తయితే ఈ ప్రాంతంలో చాలా ఊపు వచ్చేదన్నారు. తాను విమర్శలకు బయడడంలేదు. రాబోయే రోజుల్లో తన ఆలోచనలు- ముందు చూపును ప్రజలే గుర్తిస్తారనే నమ్మం తనకు ఉందన్నారు. విశాఖ ప్రజల్లో చాలా క్రమశిక్షణ ఉందని... నీతి, నిజాయితీతో ఉంటారని...కష్టపడే మనస్తత్వం కలిగిన వారని వారంటే తనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. అమరావతి రాజధాని కోసం 29 వేల మంది రైతులు... 33 వేల ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారని.. ఆ రైతులు పొట్టకొట్టి రాజధానిని తమ ప్రాంతానికి తీసుకురావాలని ఆలోచన ఏ విశాఖ వాసిలోనే ఉండదనే నమ్మకం తనకుందని చంద్రబాబు అన్నారు. తమ ఐదేళ్ల పాలనలో విశాఖలోనే పెట్టుబడుదారుల సమావేశాలు నిర్వహించామని- ఆర్ధిక రాజధానిగా విశాఖ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

ఈ ప్రభుత్వానికి దూరదృష్టి లేదని... స్వార్ధంతో అనేక ప్రాజెక్టులను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వైకాపా మంత్రులు, నేతలు 2013, 2014, 2019లో ఎన్నికలకు ముందు తర్వాత ఏ ఎండకి ఆ గొడుగు పేరిట ఎలా మాట్లాడుతున్నారో ప్రజలంతా గమనించాలంటూ ఓ వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. ఈ నేతలకు వ్యక్తిత్వం లేదని- వారంతా కట్టుబానిసలు.. అద్దె మైకులని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని... మాట్లాడితే ఎదురుదాడి తప్ప వేరొకటి ఉండదని... తనకు స్వార్ధప్రయోజనాలున్నట్లు మాట్లాడుతున్నారని...కులం అంటగడుతున్నారని... అవినీతి ముద్ర వేయాలనుకున్నారని అన్నారు. హైటెక్ సిటీ తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయని వివరించారు. వాటివల్లే ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి అధిక ఆదాయం వస్తోందన్న చంద్రబాబు... ఆరోజు కులం చూసి హైదరాబాద్‌ అభివృద్ధి చేశానా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని... అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు కోరారు.

భావితరాల భవిష్యత్తు అంధకారం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని... యువత...మేథావులు, వివిధ రంగాల ప్రముఖులు అంతా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని... తాను రాష్ట్రాభివృద్ధి...అమరావతి ప్రాంత అభివృద్ధి అంశాలపై ఎప్పటికప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తానని అన్నారు. అంతా కలిసి కట్టుగా పోరాడుదామని... పోరాడకపోతే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. తనపైనా.. తెలుగుదేశం పార్టీ నేతలపైనా ఎదురుదాడి చేస్తే రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావని అన్నారు. రాష్ట్రాలు తప్పు చేస్తున్నప్పుడు ప్రజా ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిదిద్దాలని... ఇక్కడ రైతులకు అన్యాయం జరిగితే దేశంలో మరెక్కడా ఏ రాష్ట్రంలోనూ రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ముందుకు రారని అన్నారు. నమ్మకంతో రైతులు- ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందమని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకునే అధికారం ఎవరికీ లేదని.... న్యాయం... ధర్మం... చట్టం... రైతులకు అండగా నిలుస్తాయనే ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... 'ప్రజలకు వైద్యం అందనప్పుడు- ప్రభుత్వం ఉండి ఏం లాభం'

Last Updated :Aug 7, 2020, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.