ETV Bharat / city

రైతులకు బేడీలా? దీని కోసమేనా ఒక్కఛాన్స్​ అడిగింది: చంద్రబాబు

author img

By

Published : Oct 28, 2020, 1:41 PM IST

అమరావతి రైతులకు సంకెళ్ల వేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లా వేళ్లా పడి అడిగి తీసుకుంది దీనికేనా అంటూ ప్రశ్నించారు. ఈ చర్య తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు.

Chandrababu commented on the shackles on the farmers of Amravati
తెదేపా అధినేత చంద్రబాబు

ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు సంకెళ్ల వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైకాపాకి కూడా పడుతుందన్నారు. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టి... ఇలాంటి దుర్మార్గాలు పునరావృతం కాకుండా చూడాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్​కు మరో అప్రతిష్ట మూటగట్టారని మండిపడ్డారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెర దీశారని విమర్శించారు. గత 17నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవన్న చంద్రబాబు... అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారని నిలదీశారు. మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు.

తాను అమ్మని ధాన్యానికి డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీనీ వేదిస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా అని చంద్రబాబు నిలదీశారు. దళిత రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా అని నిలదీశారు. అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లా వేళ్లా పడి అడిగి తీసుకుందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతులకు సంకెళ్లు... ఆరుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.