ETV Bharat / city

ఇష్టారీతిన అప్పులకు కేంద్రం అడ్డుకట్ట

author img

By

Published : Apr 7, 2021, 6:46 AM IST

రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడానికి వీలు లేదని.. ఎడాపెడా రుణాలు తీసుకుని ఖర్చు చేయడానికీ కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితి ఎంతో కేంద్రం నిర్దేశిస్తోందని.. దాన్ని దాటకూటదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది.

letter to state govt over debts
అప్పులకు కేంద్రం అడ్డుకట్ట

రాష్ట్రం చేస్తున్న అప్పులపై కేంద్రం స్పందించింది. ఇష్టారీతిగా రుణాలు తీసుకొని ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి స్థూల జాతీయోత్పత్తి ఎంత ఉండొచ్చని అంచనా వేశారో అందులో కేవలం 4శాతం మేర మాత్రమే నికర రుణంగా ఉండాలని తేల్చింది. అంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం రుణంలో.. తిరిగి చెల్లించిన అప్పును మినహాయిస్తే నికర రుణ పరిమితి ఎంతన్నది తేటతెల్లమవుతుంది. ఇందులో భాగంగానే పదిహేనో ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి 10 లక్షల 61 వేల 802 కోట్ల రూపాయలను స్థూల జాతీయోత్పత్తిగా అంచనా వేసింది. ఆ లెక్కన రాష్ట్రానికి నికర రుణ పరిమితిని 42 వేల 472 కోట్ల రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఈ నికర రుణ పరిమితిని దాటకూడదని స్పష్టం చేసింది.

నాలుగు పేజీల సమగ్ర లేఖ..

బహిరంగ మార్కెట్‌, ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి, చిన్న తరహా పొదుపు మొత్తాలు, విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం, ప్రావిడెంట్‌ ఫండ్‌, చిన్న మొత్తాల పొదుపు, రిజర్వు నిధులు, డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం.. ఇవన్నీ దీనిలోకి వస్తాయని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది.

నికర రుణ పరిమితిలో కోత!

స్థూల జాతీయోత్పత్తిలో నిర్దిష్టంగా కొంత మొత్తం మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సిందేనని పేర్కొంది. అలా ఖర్చు చేయని పక్షంలో నికర రుణ పరిమితిలో 0.50శాతం మేర కోత విధిస్తామని తెలియజేసింది. రాష్ట్రాలు కచ్చితంగా ఇంత మొత్తాన్ని పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేయాలని కేంద్రం పరిమితి విధిస్తోంది. 2021-22లో రాష్ట్రం 27 వేల 589 కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా ఖర్చు చేయాలని నిర్దేశించింది. ఆ ప్రకారం ఖర్చు చేయకపోతే జీడీపీలో 0.50 శాతం అంటే...5 వేల కోట్ల రూపాయలకపైగా నికర రుణ పరిమితిలో కోత పెట్టనుంది.

అప్పు వివరాలు తెలియజేయాలి..

కేంద్ర ఆర్థిక శాఖ లేఖతో పాటు రెండు ఫార్మాట్లు పంపి అందులో గణాంకాలు నింపి తక్షణమే కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగానికి తెలియజేయాలని సూచించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం వాస్తవ లెక్కల నుంచి 2021-22 అంచనాల వరకు.. ఆ ఫార్మాట్‌లో వివరాలు నింపాలి. అందులో ప్రతి ఏడాది వారీగా... అన్ని విభాగాల్లో ఆ ఏడాది చేసిన అప్పు, తీర్చిన రుణం, నికర రుణం వివరాలు తెలియజేయాలని కోరింది. అన్ని రకాల అప్పుల వివరాలు నమోదు చేయాలని.. విద్యుత్తు డిస్కంల నష్టాల వివరాలు, అందులో రాష్ట్రం వాటా పేర్కొనాలని సూచించింది. పెట్టుబడి వ్యయంగా ఎంత ఖర్చు చేశారో తేల్చి చెప్పాలని స్పష్టం చేసింది.

పబ్లిక్‌ రంగ సంస్థలు నిధుల గూర్చి తెలపాలి..

మరో ఫార్మాట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రుణ గ్యారంటీలు ఎంత మేర ఇచ్చిందో వివరాలు కోరింది. 2020-21లో డిసెంబరు వరకు ఏ మేర గ్యారంటీలు ఇచ్చారు, ఆ తర్వాత మూడు నెలల్లో ఎన్ని ఇచ్చారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎంత మేర రుణ గ్యారంటీ ఇవ్వబోతుందో అంచనాల వివరాలు తెలియజేయాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర పబ్లిక్‌ రంగ సంస్థలు ఏ మేరకు నిధులు రాబట్టుకున్నాయన్న వివరాలూ పంపాలని పేర్కొంది. ఈ వివరాలన్నీ ఏప్రిల్‌ మొదటి వారానికల్లా పంపాలని గడువు విధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల బహిరంగ మార్కెట్‌ రుణ క్యాలెండర్‌ ఖరారు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మాట్‌ ప్రకారం వివరాలు పంపితేనే సాధ్యమవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీ సవాల్​పై ఉదయం హైకోర్టు విచారించే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.