ETV Bharat / city

'ఏపీలో రెవెన్యూ లోటు.. బడ్జెట్‌ అంచనాలకంటే అధికం'

author img

By

Published : Feb 8, 2022, 9:52 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.26,441 కోట్ల మేర ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పేర్కొన్నారు. ఇది బడ్జెట్‌ అంచనాలకంటే అధికమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దివాళా, ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడేందుకు కేంద్రం సత్వరం జోక్యం చేసుకోవాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు.

rammohan
rammohan

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.26,441 కోట్ల మేర ఉందని, ఇది బడ్జెట్‌ అంచనాలకంటే అధికమని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి పేర్కొన్నారు. ‘ఏపీలో ఆర్థిక ఉల్లంఘనలు’ అంశంపై తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు గతేడాది డిసెంబరు 14న లోక్‌సభలో 377వ నిబంధన కింద మాట్లాడిన అంశాలపై కేంద్ర మంత్రి వివరణ ఇస్తూ తాజాగా లేఖ రాశారు. ‘మార్చి 2020తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం రెవెన్యూ లోటు రూ.26,441 కోట్లు ఉంది. ఆ ఏడాది అమ్మఒడి (రూ.6,349.47 కోట్లు), తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా (రూ.4,919.84 కోట్లు) పథకం కారణంగా ఇది తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ.1,511 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 30నుంచి అమల్లోకి వచ్చేలా ఆ ఏడాది డిసెంబరులో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సవరించింది. సవరించిన చట్టంలో పేర్కొన్న లక్ష్యాలు 14వ ఆర్థిక సంఘం సూచించిన ఆర్థిక సమతౌల్య అంశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కాగ్‌ గుర్తించింది.’ అని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక సంక్షోభంపై జోక్యం చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ను దివాళా, ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడేందుకు కేంద్రం సత్వరం జోక్యం చేసుకోవాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల మళ్లింపు అంశాన్ని 377 నిబంధన కింద లోక్‌సభలో సోమవారం ఆయన ప్రస్తావించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. తప్పుడు లెక్కలు చూపుతున్నారు. 2021 డిసెంబరు నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.45,907 కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్‌ అంచనాలకన్నా 918 శాతం అధికం. 2019-20లో రెవెన్యూ అంశాలను క్యాపిటల్‌ అంశాలుగా తప్పుగా చూపారని కాగ్‌ నివేదిక పేర్కొంది. రూ.26,096.98 కోట్ల రుణాలను బయటపెట్టలేదు. రూ.1,100 కోట్ల రాష్ట్ర విపత్తు ఉపశమన నిధిని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను మళ్లించారు. కొత్త పన్నులు విధించడమే కాకుండా మిగతా పన్నులను భారీగా పెంచారు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : రాయ్‌బరేలీ.. కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.