ETV Bharat / city

రూ.21,500 కోట్ల రుణంపై మరింతగా ఆరా!

author img

By

Published : Sep 20, 2021, 7:13 AM IST

central letter to state govt on debt
central letter to state govt on debt

ఏపీడీసీఎల్ ఏర్పాటు చేసి తీసుకున్న రుణంపై వివరాలు కోరుతూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వివాదాస్పద కార్పొరేషన్​ ఏర్పాటుపై కేంద్రం ఆ లేఖలో పలు ప్రశ్నలు సంధించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటుచేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ.21,500 కోట్ల రుణంపై కేంద్ర ఆర్థికశాఖ లోతుగా ఆరాతీస్తోందని తెలిసింది. దీనిపై సమగ్ర సమాచారం పంపాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ నియంత్రణ విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కార్పొరేషన్‌ ఏర్పాటుచేసిన తీరు, గ్యారంటీలు, పొందిన రుణాల సమాచారం, ఆ ఏడాది రుణపరిమితిలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నదీ లేనిదీ తెలియజేయాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఏపీఎస్‌డీసీ ఏర్పాటు, దానిద్వారా తీసుకున్న రుణాలపై కొద్ది నెలలుగా రాష్ట్రంలో దుమారం రేగుతోంది. అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసి, విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి ప్రభుత్వం ఈ రుణం తీసుకోగా అది వివాదాస్పదమయింది. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎలా రుణాలు తీసుకుంటారంటూ విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు, ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తారు. కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే ఏపీఎస్‌డీసీ ఏర్పాటు అంశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3)లోని నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ నియంత్రణ విభాగం తప్పుపట్టింది. ఈ కార్పొరేషన్‌ ఏర్పాటు, రుణాల స్వీకరణ, భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టడంపై ప్రభుత్వ వివరణ తెలియజేయాలని జులై 30న రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పుడు తదనంతర పరిణామాల్లో భాగంగా కార్పొరేషన్‌పై మరింత లోతుగా దృష్టి సారించింది. సమగ్ర వివరాలను తెలియజేయాలంటూ మరో లేఖ సంధించింది.

  • ఏపీఎస్‌డీసీ ఏర్పాటైన తర్వాత ఇంతవరకు ఏయే సంవత్సరాల్లో, ఏ ఆర్థిక సంస్థ నుంచి ఎంతెంత రుణం తీసుకున్నారో తెలియజేయాలని కోరింది.
  • కార్పొరేషన్లు కంపెనీ చట్టం కింద ఏర్పాటవుతాయి. అవి తమ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి చెల్లించే ప్రాతిపదికన రుణాలను తీసుకుంటాయి. రాష్ట్రంలో చాలా కార్పొరేషన్ల రుణాలకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి, తన బడ్జెట్‌ నుంచి తిరిగి చెల్లిస్తోంది. ప్రస్తుతం ఏపీఎస్‌డీసీ ద్వారా పొందిన రుణాలతో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని ప్రభుత్వమే చెబుతోంది. ఇప్పుడు కేంద్ర ఆర్థికశాఖ అసలు ఆ కార్పొరేషన్‌ ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ చేశారా అని ప్రశ్నించింది. చేస్తే ఆ వివరాలను పంపాలని కోరింది. దీంతో ఈ కార్పొరేషన్‌ మౌలిక అవసరాలు లోతుగా పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది.
  • ఈ కార్పొరేషన్‌ ఏర్పాటుకు శాసనసభ ఆమోదం ఉందా, భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టేందుకు ఎప్పుడు అనుమతులు తీసుకున్నారో ఆ వివరాలనూ తెలియజేయాలని కోరింది.

ఇదీ చదవండి: CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.