ETV Bharat / city

amaravathi:రాజధాని ప్రాంతంలో రెండేళ్లుగా 144 సెక్షన్‌ ఎందుకు?

author img

By

Published : Oct 18, 2021, 7:17 AM IST

రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30, సెక్షన్‌ 144, ఎందుకు అమలు చేస్తున్నారని విపక్ష నేతగా ప్రశ్నించిన జగన్‌.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ సెక్షన్లను ఎందుకు ప్రయోగిస్తున్నారని అమరావతి రైతులు ప్రశ్నించారు. సుమారు 2 వేల మంది రైతులపై అక్రమ కేసులు, వందల మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని ప్రాంతంలో రెండేళ్లుగా 144 సెక్షన్‌ ఎందుకు?
రాజధాని ప్రాంతంలో రెండేళ్లుగా 144 సెక్షన్‌ ఎందుకు?

రాజధాని ప్రాంతంలో సెక్షన్‌ 30, సెక్షన్‌ 144, ఎందుకు అమలు చేస్తున్నారని విపక్ష నేతగా ప్రశ్నించిన జగన్‌.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ సెక్షన్లను ఎందుకు ప్రయోగిస్తున్నారని అమరావతి రైతులు ప్రశ్నించారు. సుమారు 2 వేల మంది రైతులపై అక్రమ కేసులు, వందల మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు నమోదు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని ప్రకటించి, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ 2015 అక్టోబరు 15న అప్పటి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలోని వివిధ అంశాల్ని ప్రస్తావిస్తూ రాజధాని రైతులు ఓ లేఖ రూపొందించారు. అప్పట్లో జగన్‌ ప్రస్తావించిన విషయాలపై అంశాల వారీగా ప్రశ్నలు సంధించారు. ‘ఆంధ్రుల రాజధాని కోసం భూములిచ్చి... జగన్‌ వాగ్దానాలు, లేఖలు, కపట ప్రేమతో మోసపోయిన పేద రైతు ప్రశ్నలు’’ అనే పేరు ఉన్న రైతుల లేఖను పీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ ఆదివారం విడుదల చేశారు.

2015లో ప్రతిపక్ష నేతగా జగన్‌ లేఖలో పేర్కొన్న అంశాలు.. వాటిపై ప్రస్తుతం రైతులు సంధించిన ప్రశ్నలు...

జగన్‌ ప్రస్తావించిన అంశం 1: ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా రైతుల భూములు లాక్కొని రాజధాని నిర్మిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ పలు సందర్భాల్లో దీక్షలు, ధర్నాలు చేసినా మీ తీరు మారలేదు.

ప్రస్తుతం రైతుల ప్రశ్న: 95 శాతం భూమిని రాజధానికి ఇచ్చిన రైతులపై అక్రమ కేసులు పెట్టి ఎందుకు వేధిస్తున్నారు..?

అంశం 2: రాజధానిలో ఏడాదిగా సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 ఎందుకు అమల్జేస్తున్నారు. ప్రజలు ఆనందంతో ఉంటే ఈ సెక్షన్లు ఎందుకు..?

రైతులు: మీరు అధికారంలోకొచ్చాక దాదాపు రెండేళ్లుగా రాజధానిలో సెక్షన్‌ 144 ఎందుకు అమలు చేస్తున్నారు ?

అంశం 3: హరిత ట్రైబ్యునల్‌ తీర్పును బేఖాతరు చేస్తున్నారు. న్యాయస్థానం, ప్రజల మనోభావాల్ని లెక్క చేయడం లేదు.

రైతులు: జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అమరావతి నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చిన వేల మంది 670 రోజులుగా ధర్నా చేస్తున్నారు. హరిత ట్రైబ్యునల్‌, ప్రజల ఆకాంక్షను వైకాపా నాయకులు ఎందుకు అవమానిస్తున్నారు..?

అంశం 4: అసైన్డు, పేదల భూములంటే చులకనతో ఇష్టారీతిన స్వాధీనం చేసుకునే తీరును నిరసిస్తున్నాం.

రైతులు: అసైన్డు రైతులకు ఇతరులతో సమాన ప్యాకేజీ ఇస్తామని నమ్మించి.. ఇప్పుడు 3 రాజధానులతో ఎందుకు ముడిపెట్టారు..? అసైన్డు భూముల క్రయ, విక్రయాలకు వీల్లేకుండా జీవో ఎందుకిచ్చారు..?

అంశం 5: కమీషన్ల కోసం ప్రైవేటు, సింగపూర్‌ కంపెనీలకు ఇష్టారీతిన భూములిచ్చే మీ కుంభకోణాలకు మద్దతు ఇవ్వకూడదనుకున్నాం.

రైతులు: రైతులకు సకాలంలో కౌలు చెల్లించకుండా పెయిడ్‌ ఆర్టిస్టులు, రియల్‌ ఎస్టేట్‌ అంటూ ముద్ర వేసి ఆర్థికంగా, మానసికంగా ఎందుకు క్షోభ పెడుతున్నారు?

అంశం 6: రాజధాని నిర్మాణానికి సింగపూర్‌, ప్రైవేటు కంపెనీలతో అవసరమేంటి..? హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూముల్లో నిర్మించాలి. రహదారులు నిర్మించి జోనింగ్‌ చేయాలి. ప్రజలు రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటారో లేక భూములు ఉంచుకుంటారో వారిష్టానికి వదిలేయకుండా బలవంతంగా పేదల భూమి లాక్కోవడాన్ని నిరసిస్తున్నాం.

రైతులు: గతంలో చెప్పినట్లు అమరావతిలోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ నిర్మించకుండా ఎందుకు మాట తప్పుతున్నారు. ప్రజలకు ఇష్టమైతే రియల్‌ ఎస్టేట్‌ చేసుకుంటారని గతంలో చెప్పి ఇప్పుడు రైతులపై బురద జల్లడంలో ఆంతర్యమేంటి..?

అంశం 7: బినామీలతో రాజధానిలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి.. ఇష్టం లేకపోయినా పేదల భూములు లాక్కున్నారు.

రైతులు: ఈ వ్యవహారంలో అప్పటి అధికారులు తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి. అంతే తప్ప అవినీతి పేరిట ఆంధ్రుల రాజధానిని పాడు చేయడం న్యాయమా..?

అంశం 8: ప్రజల డబ్బును దుబారా చేస్తూ ఒక్క రోజు తతంగాన్ని (రాజధాని శంకుస్థాపన కార్యక్రమం) జరిపేందుకు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసిస్తున్నాం.

రైతులు: రూ.400 కోట్లు వృథా అవుతున్నాయని మొసలి కన్నీరు కార్చిన మీరు.. అమరావతిలో రూ.5,600 కోట్ల ప్రభుత్వ, రూ.వేల కోట్ల ప్రైవేటు, 34 వేల ఎకరాల రైతుల భూమి, అన్నింటికీ మించి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు..?

ఇదీ చదవండి: murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.