ETV Bharat / city

CAG on AP Budget: రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగోలేదు.. కాగ్‌ ఆక్షేపణ

author img

By

Published : Nov 27, 2021, 5:50 AM IST

Updated : Nov 27, 2021, 7:10 AM IST

రాష్ట్రప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక(CAG Report).. తూర్పారబట్టింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని ఆగ్రహించింది. బడ్జెట్‌లో చూపకుండా...అప్పులు చేసి ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది. వచ్చేఏడేళ్లలో లక్షా 10 వేల 10 కోట్ల రూపాయల అప్పు చెల్లించాలన్న కాగ్‌.. వడ్డీలు చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేయడమేంటని విస్మయం వ్యక్తంచేసింది. రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగోలేదని కాగ్‌ ఆక్షేపించింది.

CAG on AP Budget
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక

CAG on AP Budget: రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగోలేదని కాగ్‌ ఆక్షేపించింది. 2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్‌ పూర్తయిన పద్దులను కాగ్‌ విశ్లేషించింది. ఒకవైపు రాష్ట్రస్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోందని.. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికమని తెలిపింది. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65 నుంచి 81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోందని స్పష్టం చేసింది. రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండవని, ప్రభుత్వానికి కాగ్‌ తేల్చిచెప్పింది. ఒకవైపు సగటున... 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు కార్పొరేషన్ల ద్వారా కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందడంలేదని ప్రస్తావించింది. 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం.. రాబోయే ఏడేళ్లలోనే లక్షా 10 వేల 10 కోట్ల ర రూపాయల అప్పులను... ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని కాగ్‌ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 32 వేల 373 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రితం ఏడాదితో పోలిస్తే ఇవి 17.20 శాతం ఎక్కువని... కాగ్‌ తెలిపింది. బడ్జెట్‌ పద్దుకు సంబంధం లేకుండా 26 వేల 968 కోట్ల అప్పులున్నాయని, వీటిని బడ్జెట్‌లో చూపకపోవడం శాసనసభ పర్యవేక్షణను నీరుగార్చడమేని కాగ్ దుయ్యబట్టింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపుల వాటా 15.90 శాతమని ఇది 11.30 శాతం దాటరాదని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించినట్లు కాగ్‌ గుర్తుచేసింది. ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే వడ్డీ చెల్లింపులు, పరిపాలనా ఖర్చులు, పింఛన్లు ఎక్కువగా ఉన్నాయని కాగ్‌ విశ్లేషించింది. వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు 2019-20 సంవత్సరంలో పెద్ద ఎత్తున నిధులు బదిలీచేసినట్లు చూపారని, వాస్తవంలో సంబంధిత ప్రభుత్వ శాఖల సిబ్బంది ఆ నిధులు ఖర్చు చేసుకునేలా అవి అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. పీడీ ఖాతాలకు నిధులు బదిలీ చేసినా, వాటిని ఖర్చు చేయడంలేదని స్పష్టంచేసింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో పీడీ ఖాతాలకు రూ.93,122 కోట్లు బదిలీ చేసినట్లు ప్రభుత్వ ఆదేశాలుంటే అందుబాటులో ఉన్న నిధులు 38 వేల 599 కోట్లు మాత్రమేనని కాగ్‌ ఎత్తిచూపింది. ఆర్థిక పద్దులు చూస్తే ఈ విషయాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని తెలిపింది. పద్దుల ప్రకారం నిధుల బదిలీలకు సంబంధించి 54 వేల 522 కోట్లు, చెల్లింపులకు సంబంధించి 36 వేల 202 కోట్లు వ్యత్యాసం కనిపిస్తోందన్న కాగ్‌. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినా 2021 ఫిబ్రవరి వరకు సమాధానం అందలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వరంగ సంస్థలు, అథారిటీలు, అభివృద్ధి సంస్థలు వాటి పద్దులను సమర్పించడం లేదని, నిర్దేశిత ఆర్థిక నియమాలకు ఇది విరుద్ధమని తేల్చిచెప్పింది.

కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లను వేరే ఇతర ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని కాగ్‌ కడిగిపారేసింది. దీంతో కేంద్ర పథకాల అమలు లక్ష్యాలు నెరవేరట్లేదని, కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత అందించాల్సిన గ్రాంట్లపైనా ఇది ప్రభావం చూపుతోందని పేర్కొంది. 2018-19లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.16,608 కోట్లురాగా..రాష్ట్ర ప్రభుత్వం 4,514 కోట్లే ఖర్చు చేసిందని, ఇక 2019-20లో 11 వేల 781 కోట్ల నిధులు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 5 వేల 961 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు కాగ్‌ వివరించింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో.. 221 రోజులు.. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకులో కనీస నిల్వలు నిర్వహించలేకపోయింది. రోజువారీ కనీస((cag comments on ap budget) నగదు నిల్వ కోటి 94 లక్షలు ఉండాల్సి ఉంటే.. 145 రోజులే ఆ నగదు నిల్వ ఉంచగలిగిందని కాగ్‌ స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో 221 సందర్భాల్లో 60 వేల 371 కోట్లు చేబదుళ్లో ప్రత్యేక సదుపాయం రూపంలోనో, ఓవర్‌ డ్రాఫ్టు రూపంలోనో వినియోగించుకుందని.. 66 కోట్ల 17 లక్షల రూపాయలు వడ్డీ చెల్లించిందని కాగ్‌ తెలిపింది. ఈ పరిస్థితి రాకుండా నగదు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని గీతోపదేశం చేసింది. ఆర్థిక నిర్వహణ తీరుతెన్నులు సరిగా లేవని, వనరులు, చేబదుళ్ల అంచనాలు తప్పుతున్నాయని కాగ్‌ ప్రస్తావించింది. అప్పులు తెచ్చి.. రెవెన్యూ ఖర్చులకే సింహభాగం వినియోగించడమేంటని నిలదీసింది.

రాష్ట్ర బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగోలేదని.. కాగ్‌ ఆక్షేపణ
Last Updated :Nov 27, 2021, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.