ETV Bharat / city

భాజపాలో చేరిన వైకాపా మాజీ నేత గట్టు శ్రీకాంత్

author img

By

Published : Jul 1, 2021, 10:35 PM IST

Former ysrcp leader Gattu Srikanth
వైకాపా మాజీ నేత గట్టు శ్రీకాంత్​

వైకాపా మాజీ నేత గట్టు శ్రీకాంత్​... తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​.. గట్టు శ్రీకాంత్​కు భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెరాస పాలనపై విసుగు చెందిన ఎందరో నాయకులు భాజపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్న బండి సంజయ్​... ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు.

వైకాపా మాజీ నేత గట్టు శ్రీకాంత్​

రాష్ట్రంలో తెరాసను ఎదుర్కొగలిగే ఏకైక పార్టీ భాజపానే అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వ్యాఖ్యానించారు. బండి సంజయ్​ ఆధ్వర్యంలో వైకాపా మాజీ నేత గట్టు శ్రీకాంత్​ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి గట్టు శ్రీకాంత్​... భాజపాలో చేరటాన్ని బండి సంజయ్​ స్వాగతించారు. తెరాస అరాచకత్వపు పాలనపై విసుగు చెందిన ఎంతో మంది నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి తెలిపారు.

నిరంకుశ పాలన అడ్డుకునేందుకు..

రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగుతోందని బండి సంజయ్​ ఆరోపించారు. నిజాం పాలనలో ఏ విధంగా అరాచకాలు జరిగేవో... ప్రస్తుతం కేసీఆర్​ పాలనలోనూ అవే పునరావృతమవుతున్నాయన్నారు. అమరవీరుల ఆత్మబలిదానాలకు విలువ లేకుండా... రాష్ట్రంలో మఖ్యమంత్రి కేసీఆర్​ గడీల పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ నిరంకుశ పాలనను అడ్డుకునేందుకు.. ప్రజల పక్షాన పోరాడేందుకు భాజపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

డిపాజిట్లు గల్లంతే...

"ఎన్నికలు వస్తేనే.. ప్రభుత్వానికి హామీలు, అభివృద్ధి గుర్తొస్తాయి. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారు. ఎన్నికలు అయ్యాక పత్తా లేకుండా పోతారు. సీఎం కేసీఆర్​కు భాజపా భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రగతిభవన్​ దాటి బయటకు వస్తున్నారంటే దానికి కారణం భాజపానే. హుజురాబాద్​ ఎన్నికల్లో తెరాస ఓడిపోవటం ఖాయం. డిపాజిట్లు గల్లంతు అవుతాయని ఇంటెలిజెన్స్​ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు హుజురాబాద్​లో తెరాస అభ్యర్థి ఎవరో తెలువదు. హుజురాబాద్​ ప్రజలందరూ ఈటల రాజేందర్​ లాంటి నాయకున్ని కష్టపడి ఎన్నుకున్నారు. ఇప్పుడు అలాంటి నాయకున్ని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోరు. సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అరెస్టులు, బెదిరింపులతో... హుజురాబాద్​లో ఓటమిని ముఖ్యమంత్రే ఒప్పుకుంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. తెరాసకు డిపాజిట్లు గల్లంతు కావటం ఖాయం." -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

దేశంలో ఏకైక సీఎం..

కరోనా సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా... సీఎం కేసీఆర్​ ఫామ్​హౌస్​ దాటి బయటకు రాలేదని బండి సంజయ్​ మండిపడ్డారు. ఎంతో మంది మహమ్మారికి బలైనా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కనీసం... రాష్ట్ర ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ప్రజలంతా టీకాలు తీసుకొని సురక్షింతంగా ఉండాలని పిలుపునివ్వని ఏకైక సీఎం.. కేసీఆరే మాత్రమే ఎద్దేవా చేశారు. కొవిడ్​ వేళ రాష్ట్రాన్ని అన్నివిధాల కేంద్రమే ఆదుకుందని బండి సంజయ్​ తెలిపారు.

"రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ ఎందుకు నెరవేర్చటం లేదు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు. నోటిఫికేషన్ల మాట ఏమైంది. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం ఈరోజుకు ఎందుకు ఇవ్వట్లేదు. కాలువల్లో ఇసుకను అమ్ముకుంటూ తెరాస నేతలు మాఫియా చేస్తున్నారు. ఆ ఇసుకపై వచ్చిన పైసలు ఇచ్చినా వాళ్లకు పరిహారం అందుతుంది. ఇప్పటికైనా... బూటకపు మాటలు కట్టిపెట్టి... ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి." -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి: CM Letter To PM: 'ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.