ETV Bharat / city

'అధికారంలోకి రాగానే వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేస్తాం'

author img

By

Published : Sep 23, 2022, 11:18 AM IST

BJP PUBLIC MEETING
BJP PUBLIC MEETING

BJP PUBLIC MEETING : తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రజలను దోచుకుంటున్న వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేస్తామని కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యానించారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్‌, తెరాస, మజ్లిస్‌ పార్టీలపై విమర్శలు ఎక్కు పెట్టారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను కేసీఆర్‌ విస్మరించారని.. అలాంటి వారు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.

'అధికారంలోకి రాగానే వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేస్తాం'

BJP PUBLIC MEETING AT PEDAAMBERPET : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్‌పేట వద్ద నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి కేసీఆర్‌ సర్కార్‌పై విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఎస్సీ, గిరిజన, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి అని సాధ్వీ నిరంజన్‌ జ్యోతి ధ్వజమెత్తారు.

తెలంగాణలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి: ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కనీసం మద్దతు ఇవ్వలేదని సాధ్వీ నిరంజన్‌ జ్యోతి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని.. త్వరలోనే భాజపా సర్కారు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో చాలాపెద్ద మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. భాజపా అధికారంలోకి రాబోతుందని తెలిపారు. నేను ఎలాంటి రాష్ట్రం నుంచి వచ్చానంటే.. అక్కడ ప్రజల పైసలను దోచుకుంటున్న వారి ఇళ్లపై యోగి బుల్డోజర్లు పంపిస్తున్నారని సాధ్వీ నిరంజన్‌ జ్యోతి అన్నారు.

ఇక్కడ అలాంటి సర్కారు కావాలా వద్దా ? రాష్ట్రాన్ని నడిపించే ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న నేతలైనా వేరే ఎవరైనా.. భాజపా ప్రభుత్వం వచ్చాక వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని తెలిపారు. అలాంటి వారి లెక్కలు తేల్చాలా వద్దా చెప్పండని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులను తెరాస నేతలు కాజేస్తున్నారని సాధ్వీ నిరంజన్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.190 కోట్లకు పైగా మంజూరు చేస్తే ఒక్క ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు.

చివరకు శౌచాలయాల కోసం ఇచ్చిన నిధులను తినేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులను గద్దె దించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో భాజపాకు గతంలో 77 సీట్లు ఉంటే.. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు 3 స్థానాలే ఉన్న తెలంగాణలో సర్కారు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ వెంట నిలవాలని సాధ్వీ నిరంజన్‌ జ్యోతి విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ ఇంటి నుంచి 15 మంది ప్రభుత్వంలో ఉన్నారు: "గ్రామాల్లో అభివృద్ధి జరగాలి. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీలకు నిధులను మంజూరు చేయడం లేదు. మనకి ఇలాంటి ప్రభుత్వం కావాలా ? ఐదు లక్షలు ఖర్చు చేసి పేదలకు ఇళ్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. మరి ఇచ్చాడా అని నేను అడుగుతున్నాను. వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయని వారిని మోసగాడు అని పిలుస్తారు. మరి ఇలాంటి మోసగాళ్లు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా ? కేసీఆర్‌ ఇంటి నుంచి 15 మంది ప్రభుత్వంలో ఉన్నారని తెలిసింది. వారి కుటుంబం కోసం ప్రభుత్వం కావాలా లేదా ప్రజల కోసమా ? అందులో ప్రతి ఒక్కరూ మీ సొమ్ము లూటీ చేస్తున్నారు. వాళ్లకు అధికారం అవసరమా? మీరందరూ కృష్ణుడిలా సంకల్పించండి. పోరాటానికి శంఖారావం పూరించండి. అనుకున్నది జరగకపోతే మీరు చక్రాన్ని ప్రయోగించండి".. అని సాధ్వీ నిరంజన్‌ జ్యోతి అన్నారు.

దళితుడిని సీఎం చేయాలి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే నూతన సచివాలయంలో ఎస్సీని ముఖ్యమంత్రిగా ప్రకటించి కుర్చీలో కూర్చోబెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఆకర్షించేందుకే సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని ఆరోపించారు. త్వరలో కేసీఆర్‌ సర్కారు కూలిపోతుందని.. ఎన్ని కుట్రలు పన్నినా మునుగోడులో భాజపానే గెలుస్తుందని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.