ETV Bharat / city

ఎలాంటి షరతులు లేకుండా రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

author img

By

Published : Aug 23, 2022, 7:24 PM IST

Updated : Aug 23, 2022, 8:29 PM IST

raja singh
raja singh

19:23 August 23

సీఆర్‌పీసీ 41-ఎ కింద బెయిల్‌ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

Bail to MLA Rajasingh: Bail granted to BJP MLA Rajasingh వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైంది. హైదరాబాద్​లోని మంగళ్‌హాట్‌లో ఖాదీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సీఆర్పీసీ 41ఏ పాటించకుండా ఎలా రిమాండ్‌ చేస్తారని రాజాసింగ్‌ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌కు కోర్టులోనే సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ స్వీకరించిన నాంపల్లి కోర్టు రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత రాజాసింగ్‌ తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు అంగీకరించింది. బెయిల్ పిటిషన్‌పై దాదాపు 45 నిమిషాలు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో రాజాసింగ్‌ పాత కేసులు కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌ను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పర్సనల్‌ బాండ్‌ ఇచ్చిన రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరైందని రాజాసింగ్ తరఫు న్యాయవాది తెలిపారు.

7 సంవత్సరాల శిక్ష ఉన్న ఏ నిందితుడికైనా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలి. ఆ నిబంధనలను బేఖాతరు చేస్తూ.. రిమాండ్‌కు తీసుకువచ్చారు. దీనితో సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలు పాటించలేదన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. బెయిల్‌ పిటిషన్‌పై దాదాపు 45 నిమిషాలు వాదనలు జరిగాయి. అనంతరం రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పర్సనల్‌ బాండ్‌ ఇచ్చిన రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. - రాజాసింగ్ తరఫు న్యాయవాది

ఇదీ జరిగింది... భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ సోమవారం రాత్రి ఓ వీడియోను చిత్రీకరించి, తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. మంగళ్‌హాట్ పోలీసుస్టేషన్‌లో ఖదీర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు... ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 153-ఎ, 295-ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్ నుంచి నాంపల్లి కోర్టుకి తరలించారు. అక్కడికి రాజాసింగ్‌ వ్యతిరేక, అనుకూల వర్గాలు తరలిరావడంతో... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నినాదాలతో కోర్టు పరిసరాలు మారుమోగాయి. ఇరువర్గాలనూ చెదరగొట్టిన పోలీసులు.... పరిస్థితి చేయిదాటకుండా లాఠీఛార్జీ చేశారు. అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

రాజాసింగ్‌పై అధిష్ఠానం చర్యలు.. అటుపెద్దఎత్తున విమర్శలు రావడంతో... ఎమ్మెల్యే రాజాసింగ్‌పై భాజపా అధిష్ఠానం చర్యలు తీసుకుంది. రాజాసింగ్ పై ఆగ్రహం వ్యక్తంచేసిన అధిష్ఠానం.... సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ ను తక్షణమే పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించింది. వ్యాఖ్యలపై వచ్చే నెల 2లోగా వివరణ ఇవ్వాలని కోరింది. సస్పెన్షన్ ఉత్తర్వును కేంద్ర పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యకార్యదర్శి పేరిట విడుదల చేసింది.

ఇవీ చూడండి

Last Updated : Aug 23, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.