ETV Bharat / city

ఉద్యోగ నియామకాల్లో ప్రిలిమ్స్ తొలగించే యోచనలో ఏపీపీఎస్సీ..?

author img

By

Published : Jan 25, 2021, 4:12 AM IST

ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్‌ను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాలోచనలు చేస్తోంది. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితంగా చేపట్టాలన్న ఉద్దేశంతో.. పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలనే అంశంపై కమిషన్‌లో చర్చ జరుగుతోంది.

APPSC Thinking on Prelims Cancellation
APPSC Thinking on Prelims Cancellation

ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో ప్రిలిమ్స్‌ (ప్రాథమిక పరీక్ష) తొలగింపుపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సమాలోచనలు చేస్తోంది. అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించి నియామకాలను త్వరితంగా చేపట్టాలన్న ఉద్దేశంతో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించడంపై కమిషన్‌లో చర్చ జరుగుతోంది. ఏపీపీఎస్సీ గ్రూపు-1 ఉద్యోగాలను యథావిధిగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల ద్వారానే భర్తీ చేస్తారు. ఒకే పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టినప్పుడు అభ్యర్థుల్లో పట్టుదల కనిపించడం లేదని, దరఖాస్తు చేసి పరీక్షలు రాయడం లేదని ఏపీపీఎస్సీ గుర్తించింది. గ్రూపు-2, 3, ఇతర ఉద్యోగాల నియామకాలకు 2016 నుంచి ఏపీపీఎస్సీ తొలుత ప్రిలిమ్స్‌ నిర్వహిస్తోంది. రెండంచెల పరీక్షలవల్ల ప్రతిభావంతులకే ఉద్యోగాలు వస్తాయని తలపోస్తోంది. కానీ ఈ విధానంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి పోస్టుల భర్తీకి ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతోంది. కోర్టుల్లో కేసులు దాఖలైతే ఈ గడువు మరింత పెరుగుతోంది.

సమయం ఆదా..

ప్రిలిమ్స్‌ తీసేయడం వల్ల అభ్యర్థులకు సన్నద్ధతపరంగా సమయం కలిసొస్తుంది. సకాలంలో నియామకాలను పూర్తి చేసేందుకు వీలవుతుంది. గ్రూపు-2, 3 వంటి ఉద్యోగాలకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో ప్రిలిమ్స్‌ నిర్వహించి అర్హత సాధించిన వారిని నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్యననుసరించి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులకు మెయిన్‌ నిర్వహిస్తున్నారు. నిర్దేశిత ఉద్యోగాలకు మౌఖిక పరీక్షలను చేపట్టి ఫలితాలు ప్రకటిస్తున్నారు. ఒకే ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలను 2, 3 రోజులపాటు నిర్వహించాల్సి వస్తే అభ్యర్థుల ప్రావీణ్యాన్ని గుర్తించడంలో అసమానతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇతర నియామక సంస్థల ద్వారా జరిగే ఉద్యోగాలకు రాత పరీక్షలను 2, 3 రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో జరిగే ప్రవేశాలకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘నార్మలైజేషన్‌’ ద్వారా ఉద్యోగాల సంఖ్యకు తగ్గట్టు అభ్యర్థులను ఎంపిక చేయవచ్చని చెబుతున్నారు.

విజ్ఞప్తులు వస్తున్నందునే.. ‘ప్రిలిమ్స్‌ను తొలగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి విన్నపాలు వచ్చాయి. రెండంచెల వ్యవస్థ వల్ల శిక్షణకు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నామని, సమయాన్ని కేటాయించలేకపోతున్నామని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులొచ్చాయి. వీటిని పరిశీలిస్తున్నాం. కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటనలిచ్చేనాటికి దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది’ అని కమిషన్‌ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి.

ఇదీ చదవండీ... సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్​ మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.