ETV Bharat / city

ఏపీపీఎస్సీని చుట్టుముట్టిన రాష్ట్ర ఆర్థిక సంక్షోభం !

author img

By

Published : May 19, 2022, 4:08 AM IST

Financial Crisis to APPSC: రాష్ట్ర ఆర్థిక సంక్షోభ ప్రభావం ఏపీపీఎస్సీ(APPSC)పైనా పడింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఏపీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్లకు సుమారు 8 లక్షల మంది ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా రాత పరీక్షల నిర్వహణపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. గతేడాది చివరిలో విడుదలైన నోటిఫికేషన్లకు ఇప్పటివరకు పరీక్షల తేదీలు ప్రకటించకపోవడంతో పలువురు నిలదీస్తున్నారు.

Financial Crisis to APPSC
ఏపీపీఎస్సీకి నిధుల కోరత

APPSC: రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరాలకు తగ్గట్లు నిధుల మంజూరుకాకపోవడంతో ఉద్యోగ నియామక రాత పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏపీపీఎస్సీ ఉన్నట్లు సమాచారం. వివిధ నోటిఫికేషన్లు అనుసరించి సుమారు ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఫీజులు చెల్లించి, దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి నెలలు గడిచిపోతున్నా రాత పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ చడీచప్పుడు లేకుండా వ్యవహరిస్తుంది. దీంతో నిరుద్యోగులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా నోటిఫికేషన్లలోనే రాత పరీక్షల తేదీలు ప్రకటిస్తారు. ఒకవేళ ఆ సమయానికి స్పష్టత లేకుంటే, నోటిఫికేషన్ల జారీ అనంతరం స్వల్ప వ్యవధిలోనే తేదీలు ప్రకటిస్తారు. ఇందుకు విరుద్ధంగా గత ఏడాది చివరి నుంచి వెలువడిన ప్రకటనలకు ఇప్పటివరకు రాత పరీక్షలకు తేదీలు ఏపీపీఎస్సీ ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

రూ.90 కోట్లు అవసరం! : సచివాలయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..కమిషన్‌ సభ్యులు, ఉద్యోగుల వేతనాలు, పరీక్షల నిర్వహణకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సుమారు 90 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారని సమాచారం.. కానీ..సగం నిధుల కేటాయింపునకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక శాఖ సుముఖత వ్యక్తంచేసింది. ఇవి కేవలం ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రమే సరిపోతాయని తెలిసింది. ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల తయారీ, ఇతర పనులు ఓ సాంకేతిక సంస్థ ద్వారా జరుగుతున్నాయి. ఈ సంస్థకు కోట్లాది రూపాయల వరకు బకాయిలు ఉన్నాయి.

అభ్యర్థుల నుంచి ఫీజుల వసూళ్లు : పరీక్షల నిర్వహణకు తగ్గట్లు నిధులు లేనందున తేదీలు ప్రకటించేందుకు ఏపీపీఎస్సీ సాహసించలేకపోతోందని తెలిసింది. కొన్ని ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో జనరల్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ప్రాసెస్‌ కోసం రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, మాజీ సైనికోద్యోగుల కేటగిరికి చెందిన వారికి రూ.125 ఫీజు నుంచి మాత్రమే మినహాయింపు ఉంది. కొన్నింటికీ ముఖ్యంగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తు ప్రాసెస్‌ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 వసూలుచేశారు. వీటికి అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయిస్తే...రాత పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఉండవు.

గత సెప్టెంబరు నుంచి వెలువడిన నోటిఫికేషన్లకు ఇప్పటివరకు పరీక్షల తేదీలు వెలువడకపోవడం వెనుక నిధుల సంక్షోభమే ప్రధాన కారణమని ఉద్యోగ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కొందరు మాత్రం ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల నిర్వహణపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నందున జాప్యం జరుగుతుందని చెబుతున్నారు.

అభ్యర్థుల భవిష్యత్‌ ప్రణాళికలపై ప్రభావం : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కిందటేడాది సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు సుమారు 15 ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. చివరిగా అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ గత నెల ఏప్రిల్‌ 24న వెలువడింది. వీటి ప్రకారం నిరుద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9వ తేదీ వరకు జరిగింది. రాత పరీక్షల తేదీలు తదుపరి ప్రకటిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 15 నోటిఫికేషన్లలో చాలా వాటికి పరీక్షల తేదీలు వెలువడలేదు. సకాలంలో నియామకాలు జరగకుంటే..అభ్యర్థులు సీనియార్టీపరంగా నష్టపోతారు. వారి భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటాయి. దీనిపై ఏపీపీఎస్సీ ఇన్‌ఛార్జి కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇదీ చదవండి: 'అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పండి'..ఎమ్మెల్యేను నిలదీసిన సామాన్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.