ETV Bharat / city

ఖరీదైన సలహా ఖజానా స్వాహా, వైకాపా ప్రభుత్వంలో ఎడాపెడా సలహాదారుల నియామకం

author img

By

Published : Aug 25, 2022, 7:10 AM IST

సీఎంకి ముఖ్య సలహాదారు ఒకరు, ఆయన కార్యక్రమాల సమన్వయానికి మరొకరు, ఆర్థిక వనరుల సమీకరణపై సలహాలకు ఇంకొకరు, వీరితో పాటు ప్రజావ్యవహారాల సలహాదారు, ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు, రాష్ట్రంలో మీడియా వ్యవహారాలకు ఒకరు, జాతీయ మీడియా సలహాదారు మరొకరు. ఈ విధంగా సీఎంకి, ప్రభుత్వానికే రాష్ట్రంలో అరడజను మందికి పైగా సలహాదారులున్నారు. వారు చాలరన్నట్టు మైనార్టీల సంక్షేమానికి, ఎన్జీవోల వ్యవహారాలకు, సామాజిక న్యాయానికి, సహకార శాఖకు ఇలా పలు శాఖల్లో ఎడాపెడా సలహాదారుల్ని ప్రభుత్వం నియమిస్తోంది. వారికి ఏటా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో చెల్లిస్తోంది. తాజాగా సలహాదారుల నియామకాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన వేళ ప్రభుత్వ తీరు చర్చనీయాంశంగా మారింది.

appointments of advisors
appointments of advisors

ADVISORS ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారు ఒకరు.. సీఎం కార్యక్రమాల్ని సమన్వయం చేసేందుకు మరొకరు.. ఆర్థిక వనరుల సమీకరణపై సలహాలకు ఇంకొకరు.. ప్రజావ్యవహారాల సలహాదారు మరొకరు.. ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు ఇంకొకరు.. రాష్ట్రంలో మీడియా వ్యవహారాలు చూసేందుకు ఒకరు.. జాతీయ స్థాయిలో మీడియా సలహాదారు మరొకరు.. ఇలా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికే అరడజను మందికి పైగా సలహాదారులున్నారు. వారు చాలరన్నట్టు మైనార్టీల సంక్షేమానికి ఒకరు, ఎన్జీవోల వ్యవహారాలకు ఇంకొకరు, సామాజిక న్యాయానికి మరొకరు, సహకార శాఖకు ఇంకొకరు.. ఇలా పలు శాఖల్లో ఎడాపెడా సలహాదారుల్ని నియమిస్తున్న ప్రభుత్వం వారికి ఏటా రూ.కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో చెల్లిస్తోంది. ఇప్పటికే నియమించినవారు చాలరన్నట్టు సలహాదారుల నియామక పరంపర కొనసాగిస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, కీలకమైన శాఖలకు 47 మందికిపైగా సలహాదారులుండగా, వారిలో 15 మందికి పైగా క్యాబినెట్‌ హోదాలో కొనసాగుతున్నారు. కొందరైతే దిల్లీ నుంచే పనిచేస్తున్నారు. వారిలో ముగ్గురు, నలుగురు నిపుణులు మాత్రం జీతభత్యాలు తీసుకోకుండా గౌరవ సలహాదారులుగా ఉన్నారు. అస్మదీయుల్ని, ఆంతరంగికుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెట్టేందుకు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి, సొంత పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించేందుకు, సర్వీసులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి, వైకాపా ప్రభుత్వానికి అత్యంత విధేయులుగా మెలిగిన విశ్రాంత అధికారులకు, ముఖ్యమంత్రి సొంత పత్రికలో పనిచేసినవారికి మళ్లీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వారిని సలహాదారు పోస్టుల్లో కూర్చోబెడుతోంది. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి సలహాదారులు మంత్రులకు మించి అపరిమితమైన అధికారాలు అనుభవిస్తున్నారు.

మరికొందరు సలహాదారులు సరైన కార్యాలయం కూడా లేకుండానే పొద్దు పుచ్చుతున్నారు. సలహాదారుల్లో అత్యధికులు ఆ హోదాను అనుభవించడం, జీతభత్యాలు తీసుకోవడమే తప్ప.. వారు సలహా ఇచ్చేదీ లేదు. వారిని సలహా అడిగేవారూ లేరు. సలహాదారుల్లో చాలామంది ఆయా శాఖలు, విభాగాలపై అపారమైన అనుభవమో, పరిజ్ఞానమో ఉన్నవారూ కాదు. ఇంత అసాధారణ సంఖ్యలో సలహాదారుల్ని నియమించిన దాఖలాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు.

కొందరు ఎక్కడున్నారో తెలీదు..!
రాష్ట్ర ప్రభుత్వంలోని సలహాదారుల్లో కొందరు అసలు ఎక్కడున్నారో తెలీదు. ఏ సమావేశాల్లోనూ వారు కనిపించరు. వారు సలహాదారులుగా కొనసాగుతున్నారో లేదో ఆయా శాఖల్లో పనిచేసేవారికే చాలా మందికి తెలియదు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సలహాల కోసం వారిని సంప్రదించిన దాఖలాలూ లేవు. వారే కల్పించుకుని సలహాలిచ్చిన సందర్భాలూ లేవు. సలహాదారుల్లో కూడా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనవారికే అపరిమితమైన అధికారాలు దక్కుతున్నాయి. వారిలో సజ్జల రామకృష్ణారెడ్డిది అగ్రస్థానం. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. అజేయ కల్లంతో పాటు, ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులైన మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌కు సలహాదారు పదవితో పాటు, నవరత్నాల అమలు కమిటీ వైస్‌ఛైర్మన్‌ పోస్టునూ కట్టబెట్టారు.

ముఖ్యమంత్రికి కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌ ఉన్నారు. జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా దేవులపల్లి అమర్‌ను నియమించారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ ఆయన కార్యక్రమాల్ని పర్యవేక్షించే తలశిల రఘురామ్‌కు క్యాబినెట్‌ హోదాలో ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేషన్‌ సలహాదారు పదవి కట్టబెట్టారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ఎంపికైనా, సలహాదారు పదవిలోనూ కొనసాగిస్తున్నారు. జూపూడి ప్రభాకరరావు, షేక్‌ మహ్మద్‌ జియావుద్దీన్‌ వంటి పార్టీ నాయకులను... రాజకీయ పునరావాసం కల్పించేందుకు సలహాదారులుగా నియమించారు.

ప్రస్తుత సలహాదారుల్లో అజేయకల్లం, శామ్యూల్‌లతో పాటు పలువురు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం ముగియగానే ఆయనను క్యాబినెట్‌ హోదాలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించి దిల్లీ పంపించారు. ప్రభుత్వం వివిధ శాఖలకు నియమించిన సలహాదారులే కాకుండా, ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలోనూ, సీఐడీ, ఏసీబీ వంటి విభాగాల్లోనూ పలువురు న్యాయ సలహాదారులుగా పనిచేస్తున్నారు.

సలహాదారులకు రాజభోగం
పదవీకాలం మొత్తంలో ఒక్క సలహా అయినా ఇస్తున్నారో లేదో తెలియదు గానీ.. సలహాదారులకు ప్రతి నెలా రూ.లక్షల్లో జీతభత్యాల్ని ప్రభుత్వం ఠంచనుగా చెల్లిస్తోంది. సలహాదారుల హోదా, వారి నేపథ్యాలకు అనుగుణంగా జీతభత్యాలు ఉన్నాయి.

* క్యాబినెట్‌ హోదా ఉన్నవారికి నెల వేతనం రూ.14 వేలే. కానీ ఇంటి అద్దె భత్యం మాత్రం నెలకు రూ.లక్ష. వాహనం, ఇతర అలవెన్సులు కూడా కలిపితే వీరికి ఒక్కొక్కరికి నెలకు జీతభత్యాల రూపంలో రూ.1.80 లక్షల వరకు అందుతుంది.

* పదవీకాలంలో ఒకసారి కారు కొనుక్కోవడానికి అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇస్తారు.

* ల్యాప్‌టాప్‌ కొనుగోలుకు రూ.50 వేలు (దీనిలో రూ.25 వేలు గ్రాంట్‌, రూ.25 వేలు రుణం)

* ఫర్నీచర్‌కు రూ.3 లక్షలు, వంట, భోజనపాత్రల కొనుగోలుకు రూ.1.50 లక్షలు చెల్లిస్తారు. ఫర్నీచర్‌, వంటపాత్రల కోసం ఇచ్చే రూ.4.50 లక్షలు, ల్యాప్‌టాప్‌ కొనుక్కోవడానికి ఇచ్చే మొత్తంలో రూ.25 వేలు ప్రభుత్వానికి తిరిగి చెల్లించనక్కర్లేదు.

* క్యాబినెట్‌ హోదా ఉన్నవారిలో.. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులకు మాత్రం ప్రభుత్వం అదనపు వేతనం నిర్ణయించింది. అజేయ కల్లం, శామ్యూల్‌ వంటి వారికి నెలకు రూ.2.5 లక్షలు, సుభాష్‌చంద్రగర్గ్‌కు రూ.1.25 లక్షలు నెల వేతనంగా నిర్ణయించింది. అలవెన్సులు మిగతావారికి మాదిరిగానే ఉంటాయి. ప్రభుత్వ మీడియా కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌కు మొదట క్యాబినెట్‌ హోదా నిబంధనల ప్రకారం చెల్లించే వేతనమే ఇచ్చేది. తర్వాత ఆయన నెల వేతనాన్ని రూ.2 లక్షలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

* క్యాబినెట్‌ హోదా ఉన్న సలహాదారులు 9 మంది వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవచ్చు. వారిలో ఒక వ్యక్తిగత కార్యదర్శి, ఒక అదనపు వ్యక్తిగత కార్యదర్శి, ఒక పీఏ, ముగ్గురు ఆఫీసు సబార్డినేట్లు, ఒక జమేదార్‌, ఒక డ్రైవర్‌, మరో అదనపు డ్రైవర్‌ ఉంటారు. వారి వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీరు మూడు ఫోన్‌ కనెక్షన్లు (వాటిలో ఒక ఎస్టీడీ) తీసుకునే వెసులుబాటు ఉంది. మంత్రులు, అఖిల భారత సర్వీసుల అధికారులకు ఇచ్చినట్టే వీరికీ వైద్యఖర్చుల్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.

మిగతా సలహాదారులకు ఇలా..
క్యాబినెట్‌ హోదా లేని మిగతా సలహాదారుల్లో ఎక్కువ మందికి 2018 జూన్‌ 1న విడుదల చేసిన జీవో 80లోని నిబంధనల ప్రకారం ప్రభుత్వం జీతభత్యాలు నిర్ణయించింది. ఆ జీవో ప్రకారం ప్రభుత్వ సలహాదారులు, నిపుణుల్ని పి, క్యూ, ఆర్‌ అని మూడు కేటగిరీలుగా చేసి జీతభత్యాలు నిర్ణయించారు. ఆర్‌- కేటగిరీలో ఉన్నవారికి జీతభత్యాలు ఎక్కువ. క్యాబినెట్‌ హోదా లేని సలహాదారుల్లో దాదాపు అందరికీ ప్రభుత్వం ఆర్‌-కేటగిరీ వర్తింపజేస్తోంది. వారికి ప్రతి నెలా రూ.2 లక్షల వేతనం చెల్లిస్తారు. ఫర్నీచర్‌, వంటపాత్రల కోసం ఎలాంటి గ్రాంట్‌ ఇవ్వరు. ఒక పీఎస్‌, ఒక పీఏ, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌, ఒక డ్రైవర్‌ను నియమించుకునే వెసులుబాటు ఉంది. వారందరికీ నెలకు జీతభత్యాల కింద ప్రభుత్వం రూ.70 వేలు చెల్లిస్తుంది. వాహనం వారే సమకూర్చుకుంటే... అలవెన్సుగా రూ.60 వేలు ఇస్తుంది. మొబైల్‌ ఫోన్‌కు రూ.2 వేలు, ఇంటి అద్దె భత్యంగా రూ.50 వేలు చెల్లిస్తుంది. మొత్తం మీద అన్నీ కలిపి ఆర్‌-కేటగిరీలోని సలహాదారులకు నెలకు రూ.3.82 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏపీఐఎంఏ నిబంధనల ప్రకారం వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లిస్తుంది.

ఇమడ లేకే నిష్క్రమణ?

సీనియర్‌ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తిని ప్రభుత్వం 2019 సెప్టెంబరులో పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా నియమించింది. సుమారు 11 నెలలపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన 2020 సెప్టెంబరులో రాజీనామా చేశారు. ఆ పదవి కేవలం నామమాత్రం కావడం, తనను సలహా అడిగేవాళ్లెవరూ లేకపోవడంతో ఈ వ్యవస్థలో ఇమడలేకే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపించింది.

అలాంటివారితో ఉపయోగమే!

ప్రభుత్వం నియమించిన సలహాదారుల్లో డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు వంటి ప్రఖ్యాత వైద్యులు, ఆయా రంగాల్లో నిపుణులు కొద్ది మంది ఉన్నారు. వారు ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండానే సేవలందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.