ETV Bharat / city

నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు

author img

By

Published : Aug 10, 2020, 6:25 PM IST

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉండనుంది. పారిశ్రామిక అనుమతులను వేగంగా మంజూరు చేసేందుకు వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా నూతన పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు.

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు
రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం...సింగిల్ విండో ద్వారా అనుమతులు

ఆంధ్రప్రదేశ్ లో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 2023 వరకూ నూతన విధానం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చే పరిశ్రమలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేగంగా అనుమతుల మంజూరుకు వైఎస్ఆర్ ఏపీ వన్ పేరిట సింగిల్ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్ ఆర్కే రోజా నూతన పారిశ్రామిక విధానాన్ని విడుదల చేశారు.

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం
రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం

మూడేళ్ల స్వల్పకాలిక విధానం

నాణ్యత కలిగిన ఉపాధి కల్పనతో పాటు జాతీయ స్థాయిలో తలసరి జీవీఏను అందుకునేలా పారిశ్రామిక పురోగతి, అన్ని ప్రాంతాల్లోనూ పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరంగా సుస్థిర ప్రగతి సాధన లక్ష్యాలుగా ఈ నూతన పారిశ్రామిక విధానం పని చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి 23 వరకూ ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, ఇతర మౌలిక సదుపాయల విస్తృత వినియోగంతో పాటు భారీ నుంచి సూక్ష్మస్థాయి పరిశ్రమలకు సమాన అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక విధానం రూపొందించామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం
రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం

45 వేల ఎకరాల భూమి బ్యాంకు

పారిశ్రామిక జోనింగ్​తో పాటు లీజు కమ్ బై అవుట్ ప్రాతిపదికన భూముల కేటాయింపు ఉంటుందని పరిశ్రమల శాఖ నూతన విధానంలో పొందుపరిచింది. రెడీ బిల్డ్, ప్రీక్లియర్డ్ మౌలిక సదుపాయాల కల్పన, ప్రమాద రహిత పారిశ్రామిక వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాల ఆధారంగా నూతన విధానం అమలు అవుతుందని స్పష్టం చేసింది. మరోవైపు రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం అమలు కోసం 45 వేల ఎకరాల భూమి బ్యాంకును కూడా సిద్ధం చేసినట్టు ఏపీఐఐసీ తెలిపింది.

పెట్టుబడులే లక్ష్యంగా

ప్రత్యేకించి పది కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ విధానం రూపొందించినట్టు పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. ఫార్మా, వస్త్ర, పెట్రో కెమికల్స్, రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా కొత్త విధానానికి రూపకల్పన చేశారు. ప్రాజెక్టుల వారీగా వచ్చే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : నూతన పారిశ్రామిక విధానం.. ఉపాధి కల్పనే లక్ష్యం: రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.