ETV Bharat / city

'న్యాయమూర్తులను చులకన చేయడం కాలక్షేపంగా మారింది'

author img

By

Published : Nov 3, 2021, 7:31 AM IST

కొంత మంది వ్యక్తులకు న్యాయమూర్తులను చులకన చేయడం కాలక్షేపంగా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తరహా వ్యాఖ్యలు మంచివి కావని.. అవి న్యాయప్రతిష్ఠను దిగజార్చుతాయని పేర్కొంది.

ap high court on social media comments
ap high court on social media comments

న్యాయమూర్తులను చులకన చేయడంతో పాటు వారిపై నిందాపూర్వక వ్యాఖ్యలు, దూషణలు చేయడం కొంతమందికి కాలక్షేపంగా మారిందని హైకోర్టు ఆక్షేపించింది. ఆ తరహా వ్యాఖ్యలు న్యాయస్థానాల ప్రతిష్ఠను దిగజారుస్తాయని పేర్కొంది. దేశంలో సీబీఐ ఉత్తమ దర్యాప్తు సంస్థగా పేరుగాంచిందని, న్యాయస్థానాలకు సీబీఐపై గౌరవం ఉందని పేర్కొంది. అయితే, ప్రస్తుత కేసులో న్యాయస్థానం పలుమార్లు ఆదేశాలు జారీచేసినా సీబీఐ దర్యాప్తులో పురోగతి లేదని ఆక్షేపించింది. దర్యాప్తు పురోగతి, తదుపరి తీసుకోనున్న చర్యలపై అఫిడవిట్‌ వేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల విషయంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణలను ప్రభావితం చేసే యత్నం

‘భావవ్యక్తీకరణ, వాక్‌ స్వాతంత్య్రాలను భారత రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించింది. కానీ న్యాయవ్యవస్థ అందరికీ సులువైన లక్ష్యంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు న్యాయ విచారణలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. తీర్పులపై అభ్యంతరం ఉన్నవారు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. సామాన్యుడి హింస కంటే న్యాయకోవిదుడి మౌనం మరింత హాని చేస్తుంది. సమాజంలో అశాంతిని సృష్టించేందుకు విమర్శ అనేది రెండువైపులా పదునున్న ఖడ్గంగా మారకూడదు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

HC: గంగవరం పోర్టు వాటాల విక్రయంపై హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.