ETV Bharat / city

hc on On 3capitals : కీలక దశకు చేరుకున్న మూడు రాజధానుల అంశం

author img

By

Published : Jan 29, 2022, 3:49 AM IST

hc on On 3capitals : మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ కీలకదశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే C.R.D.A. రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు వెనక్కు తీసుకున్నందున... విచారణ కొనసాగించాలా... వద్దా అనే అంశంపై వాదనలు జరిగాయి. విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకుంటే.. ప్రభుత్వం మరో రూపంలో మూడు రాజధానుల బిల్లు తెచ్చే అవకాశముందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేశారు.

AP HIGH COURT
AP HIGH COURT

hc on On 3capitals : న్యాయస్థానం నుంచి విచారణను తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. సదుద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేయలేదన్నారు. బహుళ రాజధానుల చట్టాన్ని మళ్లీ తీసుకొస్తామని బహిరంగంగానే చెబుతోందన్నారు. పట్టుకోండి చూద్దాం అన్నట్లు కోర్టుతో ప్రభుత్వం దోబూచులాడుతోందని ఆరోపించారు. మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్న నేపథ్యంలో... రాజధాని అమరావతి నిర్మాణాన్ని బృహత్‌ ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు. తాము దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లో రాజధానిలో నిలిచిపోయిన పనులను కొనసాగించాలని, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరామన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ, శాసనసభ కార్యదర్శి తరఫు వాదనల కోసం విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా పడింది. అమరావతి అభివృద్ధికి గతంలో ఇచ్చిన ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను ‘రద్దు’ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చిన తర్వాత దాఖలైన వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థనలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

అడ్డుకోవడం మొదటిసారి కాదు

న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... ‘రాజధాని వ్యాజ్యాలపై విచారణను ప్రభుత్వం అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదు. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులపై సవతితల్లి ప్రేమ చూపుతోంది. రాజధాని కోసం ఇప్పటివరకు రూ.16,500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేశారు. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల సొమ్ముకు ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి. అందుకు భిన్నంగా వృధా చేస్తున్నారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ నివేదిక పెయిడ్‌ రిపోర్టు. దాని కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చుచేసింది’ అన్నారు.

రాజకీయ ఎజెండాతో రాజధాని మార్పు సరికాదు

పిటిషనర్ల తరఫు మరికొందరు సీనియర్‌ న్యాయవాదులు ఎ.సత్యప్రసాద్‌, జంధ్యాల రవిశంకర్‌, ఎంఎస్‌ ప్రసాద్‌, న్యాయవాదులు కేఎస్‌ మూర్తి, వాసిరెడ్డి ప్రభునాథ్‌, అంబటి సుధాకరరావు, వై.సూర్యప్రసాద్‌, పీఏకే కిశోర్‌, డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, నర్రా శ్రీనివాసరావు, కారుమంచి ఇంద్రనీల్‌బాబు, జీవీఆర్‌ చౌదరి, వీవీ లక్ష్మీనారాయణ, తదితరులు వాదనలు వినిపించారు. ‘పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగాకే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ప్రజల కోణం నుంచి చూసినా అమరావతి ఆమోదయోగ్యమైంది. మూడు రాజధానుల చట్టాన్ని చేసే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దాన్ని రద్దు చేస్తూ మళ్లీ చట్టం చేసే అధికారం అసలే లేదు. రాజధాని వ్యవహారం పార్లమెంట్‌ పరిధిలోనిది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరిట ప్రాంతాల వారీగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు. అమరావతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సమ్మతితో జరిగింది. కాబట్టే అభివృద్ధి కోసం రూ.1500 కోట్ల ఆర్థికసాయం చేసింది. రాజకీయ ఎజెండాతో రాజధాని మార్పు నిర్ణయించడం సరికాదు. నిర్దిష్ట సమయంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇస్తామన్నారు. ఆ సమయం దాటిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. రాజధానిలో 25% పూర్తయిన పనులను కొనసాగిస్తున్నామని సీఆర్‌డీఏ చెబుతోంది. ఒక్క రూపాయి ఖర్చుచేయలేదు. అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు అబద్ధాలు చెబుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పనులు జరిగేలా ఆదేశించండి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 11 ప్రకారం జిల్లా పేరు, సరిహద్దులను మార్చే వెసులుబాటు మాత్రమే రాష్ట్రానికి ఉంది. అంతేతప్ప... రాజధాని ప్రాంతంపై రాష్ట్రానికి అధికారం కల్పించలేదు. అమరావతిలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ఇచ్చాక... ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలు అమరావతిలోనే కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’ అన్నారు.

అలాంటి ఆదేశాలివ్వలేం: ధర్మాసనం

మరో న్యాయవాది పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ... ‘మూడు రాజధానుల చట్టం, దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన తాజా చట్టం చెల్లుబాటు కానివిగా ప్రకటించండి. అధ్యయనం చేసి మరోసారి మూడు రాజధానుల చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి శాసనం చేయకుండా నిలువరించండి’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మీ వాదన వింటుంటే... చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లుందని వ్యాఖ్యానించింది. చట్టాలు చేయకుండా నిలువరించలేమని, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమంది.

ఏజీ అభ్యంతరం

న్యాయస్థానం విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోందని న్యాయవాది చేసిన వాదనలపై ఏజీ శ్రీరామ్‌ అభ్యంతరం తెలిపారు. శుక్రవారం విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదనల కోసం విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి

HC Advocate Narra Srinivas On 3capitals : మూడు రాజధానుల వ్యతిరేక పిటిషన్​పై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.