ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సమర్పించిన ఏపీ

author img

By

Published : Dec 17, 2020, 10:54 AM IST

rayalaseema-uplift-scheme-dpr-submitted-in-ap
రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సమర్పించిన ఏపీ

సీమ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపుల మేర నీటిని తీసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరముందని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. మరోవైపు.... కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే.... పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోందని పునరుద్ఘాటించింది.

రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ను సమర్పించిన ఏపీ

రోజూ 3 టీఎంసీలు ఎత్తిపోసేలా 3వేల 248 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిన ఆంధ్రప్రదేశ్.... సంబంధిత డీపీఆర్​ను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమర్పించింది. శ్రీశైలం డ్యాంలో 800 మీటర్ల నీటిమట్టం నుంచి రోజూ 7 టీఎంసీలు మళ్లించడానికి తెలంగాణకు అవకాశముందని.... నీటిమట్టం 841 అడుగులకు దిగువన ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా ఏపీకి నీటిని తీసుకోలేమని వివరించింది. ఈ నేపథ్యంలో.... చెన్నై తాగునీటి సరఫరా, సీమ ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపుల మేర నీటిని తీసుకోవడానికి... రాయలసీమ ఎత్తిపోతల అవసరముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేస్తున్న బోర్డు అధికారులు.... నాలుగైదు రోజుల్లోనే తమ అభిప్రాయాలతో కేంద్ర జలసంఘానికి పంపనున్నారని సమాచారం. జలసంఘం పరిశీలన తర్వాత అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్తుంది.

రాయలసీమ ఎత్తిపోతల్లో భాగంగా.... సంగమేశ్వర వద్ద 787.40 అడుగుల మట్టం నుంచి 17.59 కిలోమీటర్ల దూరం అప్రోచ్‌ కాలువ తవ్వి.... పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలుపుతారని ఆంధ్రప్రదేశ్.... తన డీపీఆర్​లో ప్రతిపాదించింది. ఈ అప్రోచ్ కాలువ నాలుగు రీచ్‌లుగా ఉండగా.... అందులో 8.89 కిలోమీటర్ల దూరం లైనింగ్ చేపట్టాలని పేర్కొంది. శ్రీశైలం 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకునే అవకాశం తెలంగాణకు ఉందని.... 213 టీఎంసీలతో 23.37 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేయనుందని ఏపీ వివరించింది. విద్యుత్ బ్లాక్‌తో కలిపి రోజుకు 7 టీఎంసీలు మళ్లించొచ్చని.... 2020-21లో విద్యుత్ బ్లాక్‌ నుంచే అగ్నిప్రమాదం జరిగే సమయానికే రోజుకు 4 టీఎంసీల చొప్పున 110 టీఎంసీలు దిగువకు వదిలారని వెల్లడించింది. ఆ సమయంలో నాగార్జునసాగర్ కింద సాగు అవసరాలూ లేవని.... పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల అవసరాలకు వీలుగా శ్రీశైలంలో 854 అడుగుల మట్టం నిర్వహించాలని కోరినా పట్టించుకోలేదని పేర్కొంది.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా..... 875 అడుగులపైన ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించబోమని ఏపీ స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు నుంచి కాలువ ద్వారా తీసుకుంటామని వివరించింది. నీటిమట్టం 841 అడుగులపైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకోవడం వీలవుతుందని..... దిగువకు ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మళ్లిస్తామని పేర్కొంది. 841 నుంచి 874 అడుగుల మధ్య అవసరమైనప్పుడు లిఫ్ట్ వినియోగిస్తామని స్పష్టం చేసింది.


ఇదీ చదవండి:

అమరావతికి ఏమైందీ? పాట విడుదల చేసిన లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.