ETV Bharat / city

New Districts in AP: రాష్ట్రంలో ఇకపై 26 జిల్లాలు.. నోటిఫికేషన్‌ జారీ

author img

By

Published : Jan 25, 2022, 9:01 PM IST

Updated : Jan 26, 2022, 3:38 AM IST

New Districts in AP
New Districts in AP

20:58 January 25

కేబినెట్ ఆమోదం తీసుకున్న ప్రభుత్వం

New Districts in AP:రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త జిల్లాలపై మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందుంచారు. దానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు.

కసరత్తు జరిగిందిలా..

కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

* జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటయ్యాయి.

* ప్రణాళికా విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక అందజేసింది.

కొన్నింటికి పాత పేర్లే

* జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా... ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాతపేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నిటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా, కొన్నిటికి బాలాజీ, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్‌, సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

* విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం జిల్లా’ని ఏర్పాటు చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకి ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లాగా నామకరణం చేయనున్నారు. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లాని, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లాని, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాని, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాని ఏర్పాటు చేయనున్నారు.

* అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాల వ్యావహారిక నామాలతో ఏర్పాటు చేయనున్నారు.

* కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

* ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శానససభ స్థానాలూ కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఒక లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడే పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకొచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడుని కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకుని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని నంద్యాల నుంచి మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.

* చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆనుకుని ఉంటుంది. దాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పాటైన బాలాజీ జిల్లాలోకి తెచ్చారు. తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చారు.

* మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్‌ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.

* ఈ మార్పులు, చేర్పుల వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి 8 శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే, కొన్ని జిల్లాలు ఆరు శాసనసభ స్థానాలతోనే ఏర్పాటవుతున్నాయి.

8 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు

  • ఒంగోలు (బాపట్ల పరిధిలోని సంతనూతలపాడును ఒంగోలులో కలిపారు)
  • కర్నూలు (నంద్యాల పరిధిలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోకి తెచ్చారు)
  • శ్రీకాకుళం (విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపారు)
  • అనంతపురం జిల్లాలో ఆ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు, రాప్తాడు చేర్చారు.

6 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు

  • నంద్యాల (దీని పరిధిలోని పాణ్యంను కర్నూలులో కలిపారు.)
  • విశాఖపట్నం (దీని పరిధిలోని ఎస్‌.కోటను విజయనగరంలో కలిపారు.)
  • భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం, పూర్తి గిరిజన జనాభాతో కూడిన అరకు లోక్‌సభ స్థానాన్ని రెండుగా విభజించి, రెండు జిల్లాలు చేశారు. అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు. అరకుని జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు.
  • వాటిలో అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
  • పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటవుతున్న మన్యం జిల్లాలో నాలుగే అసెంబ్లీ స్థానాలున్నాయి.
  • రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిగా ఏర్పాటవుతున్న జిల్లాకి... జిల్లా పేరుగానీ, జిల్లా కేంద్రంగానీ రాజంపేట కాదు. జిల్లా పేరు అన్నమయ్యగా పెట్టారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయనున్నారు.
  • కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీనితో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కి చేరుతుంది.
  • బాపట్లలో రెండు రెవెన్యూ డివిజన్లు కొత్తవే.
  • జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు.
  • జనాభా పరంగా (2011 జనాభా లెక్కలు) 23.66 లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54 లక్షల అతి తక్కువ జనాభా ఉంది.
కొత్త జిల్లాలు

ఇదీ చూడండి

Padma Awards: ఏపీ నుంచి ముగ్గురికి పద్మ శ్రీ పురస్కారాలు

Last Updated :Jan 26, 2022, 3:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.