ETV Bharat / city

ఇళ్ల స్థలాల పంపిణీ డిసెంబరు 25న.. కోర్టు స్టే లేని చోటల్లా పట్టాలు: సీఎం జగన్

author img

By

Published : Nov 18, 2020, 4:10 PM IST

Updated : Nov 19, 2020, 6:01 AM IST

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. వరుసగా 5 సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమానికి... ఆరోసారి ముహూర్తం నిర్ణయించారు. డిసెంబర్ 25న 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా అదే రోజు ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

cm jagan
cm jagan

రాష్ట్రంలోని పేదలకు డిసెంబరు 25న డి-ఫారం ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అదే రోజున 15లక్షల ఇళ్ల నిర్మాణాన్నీ ప్రారంభిస్తామని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ డిసెంబరు 25 నాటికి లబ్ధిదారుల జియోట్యాగింగ్‌ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీ కుటిల రాజకీయాల వల్ల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు’’ అని జగన్‌ అన్నారు.
ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..

బాబు పథకమా.. జగన్‌ పథకమా?
‘300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల వద్దకు ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకూ వార్డు వాలంటీర్లను పంపిస్తాం. మీకు జగన్‌ పథకం కావాలా? బాబు పథకం కావాలా? అని అడుగుతారు. బాబు పథకంలో లబ్ధిదారులు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీ సహా రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు దక్కి, పట్టా చేతికి అందుతుంది. జగన్‌ పథకంలో ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేసి, అప్పు లేకుండా ఇప్పుడే ఇల్లు సమకూరుతుంది. తర్వాత ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తాం. డిసెంబరు 25నే ఒక్క రూపాయితో లబ్ధిదారులకు అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ చేస్తాం. పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా తీసుకోవాలని చంద్రబాబు ఎందుకు చెబుతున్నారో ప్రజలకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం టిడ్కోకు రూ.3,200 కోట్ల బకాయి పెట్టింది. వాటిని తీరుస్తూనే మా ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఇచ్చింది.

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు
రాష్ట్రంలోని 167 నియోజకవర్గాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షలతో ఒకే తరహాలో నిర్మిస్తాం. ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు. ఇది ప్రభుత్వానికి ట్రేడ్‌ మార్క్‌. కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు. ఇళ్ల నిర్మాణానికి 67.50 లక్షల టన్నుల సిమెంట్‌, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరమవుతాయి. వీటితో 21 కోట్ల పనిదినాలు లభిస్తాయి. తొలిదశ ఇళ్లను 2022 జూన్‌ నాటికి పూర్తిచేస్తాం. రెండోదశలో 13 లక్షల ఇళ్లను 2021 డిసెంబరులో ప్రారంభించి.. 2023 జూన్‌ నాటికి పూర్తిచేస్తాం.

కరోనా విషయంలో జాగ్రత్తలు అవసరం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినా, రెండో వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. దిల్లీ మరో లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కొవిడ్‌ రెండో వేవ్‌ వేస్తోంది. కాబట్టి మనమూ జాగ్రత్తగా ఉండాలి. విద్యాసంస్థలు తెరుస్తున్నాం కనుక కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్రంలో రోజుకు సగటున 75 వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ బాగా తగ్గింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలు బాగా అమలు చేసినందుకు కలెక్టర్లను అభినందిస్తున్నాను. డిసెంబరు 10 నాటికి అన్ని ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో హెల్ప్‌డెస్కులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’ అని సీఎం జగన్‌ చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

విద్యాకానుకలో సమస్యలకు పరిష్కారం చూపాలి
జగనన్న విద్యాకానుకలో ఇచ్చిన బూట్లు చిన్నవైనా.. పెద్దవైనా విద్యార్థుల నుంచి వివరాలు సేకరించాలి. వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. బ్యాగ్‌లు చిరిగిపోతే వాటి నాణ్యత పెంచాలి.
* ఈనెల 25న జగనన్న తోడు పథకం ప్రారంభిస్తాం. వీధుల్లో చిరువ్యాపారులకు ఐడీ కార్డులు ఇచ్చి, వడ్డీలేని రూ.10 వేల రుణమిస్తాం.
* గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు భవనాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తికావాలి.

15 రోజుల్లోనే ధాన్యం కొనాలి

రైతుభరోసా కేంద్రాల్లో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలుఏర్పాటుచేశాం. అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న 15 రోజుల్లోగా ధాన్యం కొనాలి. సేకరించిన 15 రోజుల్లోగా వారికి డబ్బులు చెల్లించాలి.
* రబీ సాగుకు ఎంతమేర విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అవసరమో చూసి లోటు లేకుండా చేయాలి. వ్యవసాయ సలహా మండళ్లు క్షేత్రస్థాయిలో అందిస్తున్న నివేదికలను జేసీలు పర్యవేక్షించాలి.
* ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుర్రపుడెక్కతో కాలువలు పూడుకుపోయాయి. వాటిని తొలగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ పనులు జరుగుతాయి కనుక ఉభయగోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది. అందువల్ల డిసెంబరు 31లోగా రబీ వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. కలెక్టర్లు దీనిపై రైతులతో మాట్లాడాలి. ఆ జిల్లాల మంత్రులూ చొరవ చూపాలి.

ఇదీ చదవండి:
సీఎస్ అభ్యంతరంతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు

Last Updated : Nov 19, 2020, 6:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.