ETV Bharat / city

కరోనా పరీక్షలకు తెలంగాణపైనే ఏపీ ఆధారం

author img

By

Published : Mar 5, 2020, 6:29 AM IST

ap depends on telangana for carona tests
ap depends on telangana for carona tests

చైనాలో పురుడుపోసుకున్న కరోనా(కొవిడ్-19) వైరస్... భారతీయులను కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకి ఈ వైరస్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ వ్యాధి నిర్ధారణకు అవసరమైన వైరాలజీ ల్యాబ్​ను తీర్చిదిద్దడంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించలేదు. కరోనా అనుమానితులకు పరీక్షలు చేయడానికి సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి నమూనాలను పంపాల్సి వస్తోంది.

కోరోనా వైరస్ అనుమానిత రోగుల నుంచి సేకరించిన నమూనాల పరీక్షలకు తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి వైరాలజీ ల్యాబ్​ను తీర్చిదిద్దడంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శ్రద్ధ పెట్టకపోవడం, అనుసరించాల్సిన విధివిధానాలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పరీక్షలు జరగడం లేదు. కరోనా(కొవిడ్-19) వైరస్ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాత్రమే రోగ నిర్ధారణ పరీక్షలు జరిపేది. ప్రస్తుతం అనుమానిత కేసులు ఎక్కువైపోతున్నందున పరీక్షా కేంద్రాల సంఖ్యను కేంద్రం పెంచుతూ వస్తోంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా 18 కేంద్రాలున్నా ఏపీలో ఒక్కటి లేదు. ఆంధ్రప్రదేశ్​లో అనుమానిత కేసులు కనిపిస్తే నమూనాలను సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ పాజిటివ్ అని వస్తే పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపి అక్కడ కూడా నిర్ధారణ అయితేనే అధికారికంగా ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్​లోనూ వైరాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సమయం ఆదా అవుతుంది.

మూడేళ్ల కిందట గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో రాష్ట్రస్థాయి వైరాలజీ ల్యాబ్​ను కేంద్రం మంజూరు చేసింది. అయితే దాని నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్రం నుంచి సకాలంలో పంపలేదు. ప్రస్తుతం ఈ ప్రయోగశాలలో కరోనా నిర్ధారణకు అవసరమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది లేకపోవటంతో రాష్ట్రంలోని బోధనాసుపత్రుల నుంచి నమూనాలు సేకరించి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపాల్సి వస్తోంది. అనుమానితుల నుంచి రక్తంతోపాటు గొంతులో నుంచి ద్రవాన్ని దూది ద్వారా తీస్తారు. ఈ నమూనాలను ఎండ, గాలి తగలకుండా ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా గాంధీ ఆసుపత్రికి చేరుస్తున్నారు. దేశం మొత్తం మీద ఏ రోజుకారోజు తీసిన నమూనాలు ప్రయోగశాలకు చేర్చటానికి పుణె అధికారులు అంతర్జాతీయంగా పేరున్న కొరియర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. నమూనా అందాక ల్యాబ్ నుంచి గరిష్ఠంగా 48 గంటల్లో నివేదికను ఇస్తున్నారు.

ఇదీ చదవండి: పుణెకు.. 8 మంది అనుమానితుల నమూనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.