'ప్రజాప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరిస్తే కోర్టు ధిక్కరణే'

author img

By

Published : Jun 23, 2022, 5:30 AM IST

AP High court

ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది హైకోర్టు. అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించడానికి వీల్లేదని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కోర్టు ధిక్కరణ అవుతుందని స్పష్టం చేసింది.

హైకోర్టు అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఉపసంహరించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తే... కోర్టు ధిక్కరణ అవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది. సుప్రీం ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే... రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది. ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇవ్వాలని కోరుతూ భాజపా నాయకుడు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... హైకోర్టుల అనుమతి లేకుండా ప్రస్తుత, పూర్వ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదని ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబరు 16 నుంచి 2021 ఆగస్టు 25లోపు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసుల ఉపసంహరణకు జీవోలు ఇచ్చారనే వివరాలను పరిశీలించేందుకు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైకాపా ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన తొమ్మిది జీవోలను ఈ వ్యాజ్యంలో ప్రస్తావించింది. మరోవైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై మొత్తం పది కేసుల ఉపసంహరణకు ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్‌ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలు బుధవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ... ఉదయభానుపై నేర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను సైతం ఉపసంహరించుకునేందుకు డీజీపీ సూచనతో ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. తప్పనిసరిగా ఉపసంహరించాలని సంబంధిత పీపీలను ఆజ్ఞాపించే ధోరణిలో జీవో ఉందన్నారు. దాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... కేసుల ఉపసంహరణకు ప్రక్రియ ప్రారంభించామే కానీ, తుది దశకు చేరలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు అనుమతి తీసుకున్నాకే ఉపసంహరణ సాధ్యమన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని గుర్తుచేసింది. ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు వీరే
వైకాపా తరఫున గెలిచిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని (చిలకలూరిపేట), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్‌), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి (ఆళ్లగడ్డ), జక్కంపూడి రాజా (రాజానగరం), ఎంవీ ప్రతాప్‌ అప్పారావు (నూజివీడు), తితిదే ఛైర్మన్‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైకాపా నాయకులు సీహెచ్‌ ద్వారకరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.

ఇదీ చూడండి: కూల్చేసిన గోడ కట్టుకునేందుకు.. అయ్యన్నకు హైకోర్టు అనుమతి

హిందూపురం వైకాపాలో మరోసారి భగ్గుమన్న వర్గ పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.