ETV Bharat / city

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడ

author img

By

Published : Mar 1, 2022, 8:18 AM IST

AP students at Ukraine: ఉక్రెయిన్‌పై.. రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న వేళ..అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. భయానక పరిస్థితుల మధ్య బంకర్లలో తలదాచుకుంటున్న తమను.. స్వదేశానికి రప్పించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల్ని క్షేమంగా స్వస్థలాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

1
1

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని కేంద్రం స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన 537 మంది విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ గుర్తించగా... అందులో 32 మంది స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే ఇంకా అనేక మంది ఏపీ విద్యార్థులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన షణ్ముఖ్ ఈశ్వర్‌, పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన అభిజ్ఞ సెల్ఫీ వీడియోలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని, త్వరగా ఇక్కడి నుంచి భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల్ని అమలాపురం ఎంపీ చింతా అనురాధ పరామర్శించారు. క్షేమంగా వచ్చేలా చూస్తామన్నారు.

ఉక్రెయిన్‌లో తాము నివసించే హాస్టళ్ల వద్ద బాంబు దాడులు జరుగుతున్నాయని, చాలా మంది బంకర్లలో తలదాచుకున్నామని కర్నూలు జిల్లా అదోనికు చెందిన అరుణ్ కుమార్‌ తెలిపారు. యుద్ధం వల్ల ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవటంతో... కుటుంబసభ్యులకు సమాచారం తెలిపే అవకాశం కూడా ఉండటం లేదని వాపోయారు. ప్రకాశం జిల్లా చింతపూడి గ్రామానికి చెందిన రీనా తెజోన్మయి... విన్నిట్సియా కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తోంది. అనేక ఇబ్బందుల మధ్య భారత ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించి, చర్నివెస్ట్ విమానాశ్రయానికి చేరినట్లు తల్లిదండ్రులు సమాచారం అందించారు. భారత్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన సుధీష్‌మోహన్‌ ఉక్రెయిన్‌లోని లుగాన్స్క్‌ స్టేట్‌ వైద్య విశ్వవిద్యాలయంలో చివరి ఏడాది వైద్యవిద్యను చదువుతున్నాడు. రెండ్రోజుల క్రితం సరిహద్దులోని రొమేనియా చేరుకున్న సుధీష్‌మోహన్‌... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్షేమంగా సోమవారం స్వస్థలం చేరుకున్నాడు.

537 మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించాం: ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులను భారత్‌కు రప్పించేందుకు ఏపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిరంతరాయంగా కృషి చేస్తోందని కమిటీ అధ్యక్షుడు కృష్ణబాబు తెలిపారు. విద్యార్థుల కోసం 24 గంటలు నిరంతరాయంగా పని చేసేలా 1902 హెల్ప్ లైన్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల సమాచారాన్ని కన్సల్టెన్సీల నుంచి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటివరకు 537 మంది తెలుగు విద్యార్థుల వివరాలు సేకరించినట్లు వివరించారు. వారిలో అనంతపురం నుంచి 25 మంది, చిత్తూరు నుంచి 32, తూర్పుగోదావరి నుంచి 54, గుంటూరు నుంచి 45, కృష్ణా నుంచి 80, కర్నూలు నుంచి 18, ప్రకాశం నుంచి 32, నెల్లూరు నుంచి 22, శ్రీకాకుళం నుంచి 12, కడప నుంచి 18, విశాఖ నుంచి 77, పశ్చిమ గోదావరి నుంచి 38, విజయనగరం జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి 32 మంది విద్యార్థులు ఏపీకి చేరుకున్నారని కృష్ణబాబు వెల్లడించారు.

ఉక్రెయిన్‌లోని 14 యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారని కృష్ణబాబు తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు పోలెండ్‌, రొమేనియా, హంగెరీ, స్లోవేకియాలోని తెలుగు సంఘాలను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్‌ గంగలో భాగంగా ఎల్లుండి వరకు విదేశాంగ శాఖ విమానాలు నడపనుందని కృష్ణబాబు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.