ETV Bharat / city

ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలు తీసుకోండి : హైకోర్టు

author img

By

Published : Apr 11, 2020, 6:33 AM IST

తమ కుటుంబాన్ని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందిని ఇళ్లు యజమానులు ఖాళీ చేయాలంటున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది.

andhra pradesh high court
ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలు తీసుకోండి:హైకోర్టు

కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు , సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి , జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై విచారణ జరిపి ఆదేశాలు జారీచేసింది.

కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి ( పీపీఈ), తదితర సౌకర్యాలు కల్పించాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెళ్లు ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలని సూచించింది. ఆసుపత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాలను నిర్వీర్యం చేసే విషయంలో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్ నిబంధనలను అమలు చేయాలని తేల్చిచెప్పింది. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్ల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని ఆదేశించింది. నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టంచేసింది.

ఇవీ చూడండి-ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.