ETV Bharat / city

APPSC: ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు రద్దు

author img

By

Published : Jun 26, 2021, 12:28 PM IST

Updated : Jun 27, 2021, 4:06 AM IST

no interview for appsc exams  in ap
ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత

12:23 June 26

గ్రూప్‌-1 సహా మిగిలిన పోస్టుల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఇకపై జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. పారదర్శక చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం.. వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే గ్రూప్‌-1 మినహా మిగిలిన పరీక్షలకు ప్రిలిమ్స్‌ లేకుండా ఒకే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్‌ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పుడు గ్రూప్‌-1 సహా ఇతర ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా సుమారు 20 రకాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. రాత పరీక్షల్లో సాధించిన మార్కుల ప్రతిపాదికన ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గ్రూప్‌-1, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు, సంక్షేమశాఖల ఆఫీసర్లు, గెజిటెడ్‌ ఇంజినీరింగ్‌, ఇతర పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గతంలో వీఆర్‌వో, గ్రూప్‌-3 స్థాయి పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు ఉండేవి. ఇటీవల వరకూ గ్రూప్‌-2 ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు పెట్టారు. కమిషన్‌ పని తీరుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో 2011లో అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సత్యనారాయణ గ్రూప్‌-1 సర్వీసులకు మినహా మిగిలిన వాటికి ఇంటర్వ్యూల నిర్వహణను పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించిన మేరకు పలు మార్పులు చేశారు. ప్రస్తుతం గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 75 మార్కులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆర్డీవో, డీఎస్పీ, డీఎస్పీ జైళ్లు, జిల్లా రిజిస్ట్రార్‌, ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ నిర్వహించి చివరిగా ఇంటర్వ్యూలు పెడతారు. ఇలాగే ప్రభుత్వ కళాశాలల లెక్చరర్ల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

పరీక్షల్లో ఉత్తమ మార్కులు.. ఇంటర్వ్యూల్లో వెనుకంజ: ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుంది. బోర్డులను బట్టి ఒక్కోసారి ఇంటర్వ్యూలు నెలరోజుల వరకు జరుగుతున్నాయి. రాత పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా, పలువురు ఇంటర్వ్యూల్లో వెనుకబడుతున్నారు. రెండేళ్లు రేయింబవళ్లు కష్టపడి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు.. బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తడబడితే అవకాశాలు చేజారిపోతున్నాయి. కొందరు అభ్యర్థులకు విషయ పరిజ్ఞానం బాగున్నా... జవాబు చెప్పే సమయంలో ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటివారు ఇంటర్వ్యూలో వెనుకబడి అవకాశం చేజార్చుకుంటున్నారు.

ఇంటర్వ్యూల కారణంగా పలువురు ఉత్కంఠను, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొందరు అభ్యర్థులు పలుకుబడి, ధన ప్రభావంతో ఇంటర్వ్యూల్లో ముందుకు వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో ప్రతిభను నమ్ముకున్నవారు వెనుకబడిపోతున్నారు. దీంతో ఇంటర్వ్యూలను రద్దు చేయడంవల్ల అభ్యర్థుల్లో ఉత్కంఠ తొలగిపోతుంది. రాత పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే చాలు ఉద్యోగం వచ్చినట్లేనన్న భావన పెరిగి, బాగా సన్నద్ధమయ్యేందుకు వీలుంటుంది. నియామకాలు త్వరితగతిన పూర్తవుతాయి. కోర్టుల్లో కేసులు తగ్గే అవకాశం ఉంది. నియామకాలు త్వరగా పూర్తయితే అభ్యర్థులు సీనియారిటీ పరంగా ప్రయోజనం పొందుతారు.

నాయకత్వ లక్షణాలు గుర్తించేదేలా?: ఇంటర్వ్యూ ద్వారా నేరుగా అభ్యర్థుల శక్తి సామర్థ్యాలను గుర్తించే వీలుంటుంది. ఆర్డీవో, డీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికైనవారు భవిష్యత్తులో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అవుతారు. సుమారు మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో ఉండేవారిలో విషయ పరిజ్ఞానం, చురుకుదనం, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఎంపిక చేసే ఉద్యోగానికి వారు న్యాయం చేయగలరా? ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కీలక సమయాల్లో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోగలరా? సహచర ఉద్యోగులు, చుట్టుపక్కల వారిలో స్ఫూర్తిని నింపగలరా? అన్న విషయాలను బోర్డుల్లో ఉన్న నిపుణులు అభ్యర్థులను ప్రశ్నించి తెలుసుకునే అవకాశం ఉంది. అధ్యాపక వృత్తిలో చేరేవారికి బోధన పటిమ ఉందా లేదా అనే విషయాన్నీ గుర్తిస్తారు. ఒకవేళ రాతపరీక్షల్లో మార్కులు కాస్త తగ్గినా, ఇంటర్వ్యూలో ప్రతిభ చూపగలిగితే ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు బాగా ఉపయోగపడుతున్నాయి.

విధాన నిర్ణయాలకే సభ్యులు పరిమితం: ఛైర్మన్‌ సహా కమిషన్‌లో మొత్తం పది మంది సభ్యులున్నారు. ఇంటర్వ్యూ బోర్డుల్లో కమిషన్‌ సభ్యులు తప్పకుండా ఉంటారు. వీరితోపాటు సంబంధిత శాఖ సీనియర్‌ అధికారి, విషయ నిపుణులు బోర్డుల్లో సభ్యులుగా ఉంటున్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసే అధికారం ఉండటం వల్ల సభ్యులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా నిర్ణయంతో కమిషన్‌లోని సభ్యులకు అధికారాలు పరిమితమయ్యాయి. ఇకపై వీరు విధానపరమైన నిర్ణయాలకే పరిమితం అవుతారు.

ఇదీ చదవండి:

ఆ రెండు నగరాలకు 'స్మార్ట్​ సిటీస్​' అవార్డు

Last Updated : Jun 27, 2021, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.