ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో పాల్గొనాల్సిందే: అమిత్ షా

author img

By

Published : Nov 16, 2021, 6:48 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఉద్యమాలుగా, పోరాటాలుగా మలచడంలో ఇక్కడి భాజపా నేతలు వైఫల్యం చెందుతున్నారంటూ- కేంద్ర హోంమంత్రి, ఆ పార్టీ కీలకనేత అమిత్‌షా అసహనం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చి భాజపా సభ్యత్వం పొందిన వారంతా మన కుటుంబంలోని సభ్యులేనని.. వారిని గౌరవించుకోవడం మన బాధ్యత కాదా? అని ప్రశ్నించారు.

amith shah directions state bjp leaders
amith shah directions state bjp leaders

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భాజపా నాయకులకు తేల్చి చెప్పారు. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా పార్టీ తీర్మానం చేశాక దీనిపై మరో అభిప్రాయం ఎందుకొస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులపై రాష్ట్ర నాయకులెవరూ మాట్లాడకూడదంటూ గట్టిగా హెచ్చరించారు. దీనిపై సరైన సమయంలో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం తిరుపతిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, జీవీఎల్‌ నరసింహారావు, సీనియర్‌ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్‌, సునీల్‌ థియోదర్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో రాష్ట్ర పార్టీ పనితీరును సమీక్షించారు. లోపాలను ప్రస్తావిస్తూ సరిచేసుకోవాలని గట్టిగా సూచించారు. అమరావతి ఉద్యమం గురించి సీనియర్‌ నేత ఒకరు ప్రస్తావించిన వెంటనే అమిత్‌షా మాట్లాడుతూ... పార్టీ తీర్మానం చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మరో నాయకుడు జోక్యం చేసుకుని అది ఓ పార్టీ చేయిస్తోందని చెప్పడానికి ప్రయత్నించగా... ‘రైతులు భూములిచ్చారా? లేదా? ఉద్యమిస్తోంది రైతులా? కాదా? పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకు? పాదయాత్రలో పాలుపంచుకోవాలి’ అని ఆదేశించినట్లు తెలిసింది.

‘పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరి. ఒకసారి సభ్యత్వమిచ్చాక వారంతా మన కుటుంబ సభ్యులే. వారికి సముచిత స్థానం దక్కాల్సిందే. ఏవిషయంలోనూ వారిని దూరం పెట్టరాదు. ఉత్తరప్రదేశ్‌లో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని సంస్థాగత నిర్మాణంలో భాగం చేశాం. అక్కడ పార్టీ బలంగా ఉండటానికి అదొక కారణం. అసోంలో హిమంత బిశ్వశర్మను పార్టీలో చేర్చుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశాం’ అని ప్రస్తావించారు. ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష తెదేపానే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతగా కృషి చేయాలని అమిత్‌షా ఆదేశించారు. వైకాపాతో ఎలాంటి బంధం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడే రాష్ట్రంలో సుప్రీం అని, ఇతరుల ప్రభావానికి లోనుకావద్దని సూచించినట్లు పార్టీ వర్గాల కథనం. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు జనవరిలో విశాఖ వస్తానని, మరోసారి భేటీ అవుదామన్నారు.

రాష్ట్రంపై ఎలాంటి వివక్షా లేదని, విభజన చట్టంలో ఉన్నవన్నీ చేశామని, ఏమైనా మిగిలుంటే చేస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, గిరిజన వర్సిటీ, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై నివేదికను అందజేశారు. వైకాపాపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వేగంగా ఆదరణ కోల్పోతోందని రాష్ట్ర నేతలు వివరించారు. అంతకుముందు అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సంతోష్‌లతో ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌లు విడిగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా వివరించారు. ఒక పత్రిక, ఛానల్‌ని రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా నిషేధించడం సరైంది కాదని, ఎవరితో సంప్రదించి అలాంటి నిర్ణయం తీసుకున్నారని అమిత్‌షా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, ఛానల్‌లో భేటీ సందర్భంగా ఘర్షణ జరిగిందని రాష్ట్ర నాయకుడు ప్రస్తావించగా... విమర్శలను సానుకూలంగా తీసుకోవాలని, భయపడే వారు నాయకులుగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: Municipal elections: ఉద్రిక్తతల మధ్య పురపోరు.. కుప్పంలో దొంగ ఓటర్లను అడ్డుకున్న తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.