Amaravati padayatra: కడలి తరంగంలా.. అమరావతి ఉద్యమం

author img

By

Published : Nov 8, 2021, 11:37 AM IST

Updated : Nov 8, 2021, 4:26 PM IST

వారిది ఒకటే స్వప్నం.. ఒకటే ఆశయం.. ఒకటే ఆశ, ఆకాంక్ష.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని. బాధను పంటి బిగువు భరిస్తూ.., ఆందోళన వ్యక్తపరుస్తూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు మహాపాదయాత్రగా జనాల్లోకి కదిలారు.

మొన్న మద్రాసు మీది కాదు పొమ్మన్నారు.. నిన్న హైదరాబాద్​పైనా ప్రేమను తెంచుకోమన్నారు.. తరాలుగా రాజధాని శాపం వేధిస్తున్న వేళ.. మనదైన రాజధాని కావాలని యావత్ ఆంధ్రావని బలమైన సంకల్పంతో.. అమరావతి నిర్మాణానికి పునాది రాయి పడింది. కానీ.. అదే సమాధి రాయిగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆంధ్రులు కలలోనూ ఊహించలేదు! సొంతవాళ్లే రాజధానిని కూల్చే సాహసం చేస్తారని పసిగట్టలేదు! ఈ ఊహాతీతమైన చర్యవల్ల కలిగిన బాధను పంటి బిగువు భరిస్తూ.., భయాన్ని గుండెల్లోనే దాచుకుంటూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు జనాల్లోకి కదిలారు.

600 రోజులకు పైబడి అప్రతిహతంగా సాగుతున్న దీక్ష.. కేవలం పాతిక ఊళ్లకే పరిమితమైందన్నారు. కానీ.. ఇవాళ మొదలుపెట్టిన పాదయాత్ర(Amaravati padayatra).. కడలి తరంగమై ఉవ్వెత్తున ఎగసిపడుతోందని, ఆ సజీవ సాక్ష్యాన్ని చూడమని కోరుతున్నారు రైతులు. రాజధాని అమరావతిపై జనాల్లో ఉన్న ఆశ, ఆకాంక్ష స్థాయి ఏంటన్నది రైతులు, మహిళల పాదయాత్ర బయటపెడుతోందని అంటున్నారు. దారిపొడవునా పూల స్వాగతం.. జనాల నీరాజనమే అమరావతిపై వారికున్న ప్రేమను చాటిచెబుతున్నాయి. అధికార పక్షం మినహా.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతుతో అమరావతి మహా పాదయాత్ర రణన్నినాదాన్ని తలపిస్తూ.. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ శంఖారావం చేస్తూ ముందుకు సాగుతోంది.

అవును మరి.. ముప్పై వేల ఎకరాలకు పైబడిన మూడు పంటలు పండే భూములను తమ భవిత కోసం.. కాదు కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం సమర్పించారు. కష్టం.. నష్టం.. ఎదురైనా మన రాజధాని కోసం.. మన రాష్ట్రం కోసమేనని భరించారు. కానీ.. అర్థంతరంగా రాజధాని మార్చేస్తున్నట్టు ప్రకటించడంతో కలలు కల్లలయ్యానని, తాము చేసిన త్యాగాలకు అర్థమే లేకుండా పోయిందన్నది సగటు అమరావతి రైతు వేదన. అందుకే రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతున్నా.. మొక్కవోని, పట్టుసడలని ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజు మారినప్పుడల్లా.. రాజధానిని వెంటబెట్టుకెళ్లిన తుగ్లక్ తీరును అంగీకరించేది లేదని, ఆమోదించేది లేదని పోరుబాట పట్టారు.

తమ న్యాయమైన పోరాటానికి.. రాష్ట్ర భవిష్యత్ కు.. అటు న్యాయస్థానం, ఇటు దేవస్థానం అండగా ఉంటాయని, ఉండాలని చేపట్టిన 45 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు ప్రజలు సైతం వెన్నంటి నిలుస్తున్నారు.. నడుస్తున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఇప్పటి వరకు ఏడు రోజులపాటు సాగిన పాదయాత్ర.. ఆదివారం సాయంత్రం ఇంకొల్లులో ముగిసింది. ఇవాళ కార్తీక సోమవారం సందర్భంగా యాత్రకు విరామం ఇచ్చారు. మంగళవారు తిరిగి యథావిధిగా ప్రారంభమవుతుంది. పోలీసు ఆటంకాలు ఎదురైనా, మరేవిధమైన అడ్డంకులు సృష్టించినా.. లక్ష్యం చేరే వరకూ యాత్ర ఆగబోదని రైతులు, మహిళలు తేల్చి చెబుతున్నారు.

రైతులకు మద్దతుగా మహిళా జేఏసీ నేతల పూజలు..

ప్రకాశం జిల్లాలో అమరావతి రైతులు, మహిళలు రెండు రోజులు నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నిన్న రాత్రి ఇంకొల్లు శుభమస్తు కళ్యాణమండపంలో బస చేశారు. కార్తీక సోమవారం కావడంతో మహిళలు ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి రథం ముందు రంగవల్లులు వేసి.. ధూప, దీప, నైవేధ్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని కీర్తీస్తూ, అమరావతిని సాధిద్దామంటూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి మహిళా రైతులు పాల్గొన్నారు.

'శివయ్యా.. సీఎం మనసు మారాలి, అమరావతే ఏకైక రాజధానవ్వాలి..!'

రైతులకు మద్దతుగా మహిళా జేఏసీ నేతల పూజలు..
"న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ" పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కోరుతూ... మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం తొలిసోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించేలా ముఖ్యమంత్రి జగన్​కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు.

మహాపాదయాత్రను ప్రజలు పూలతో స్వాగతం పలుకుతుంటే.. ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉందని ఆమె పేర్కొన్నారు. పోలీసులు అక్రమ కేసులు బనాయించినా, అవమానాలు ఎదురైనా రాష్ట్ర భవిష్యత్ కోసం భరించామని తెలిపారు. రైతుల త్యాగాలు వృథా కాకుండా మహా పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్ కళ్ళు తెరిపించాలని శివయ్యను కోరుకున్నట్లు చెప్పారు.

Last Updated :Nov 8, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.