ETV Bharat / city

కవ్వించినా అడుగు ముందుకే.. రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం

author img

By

Published : Oct 13, 2022, 8:54 PM IST

FARMERS PADAYATRA
FARMERS PADAYATRA

FARMERS PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు 32వ రోజు ప్రజలు.. బ్రహ్మరథం పట్టారు. ఇంటికి ఒకే ఇల్లాలు ఎంత ఉత్తమమో.. రాష్ట్రానికి ఒకే రాజధాని అంతే మంచిదంటూ.. నిడదవోలు నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా రైతులను స్వాగతించారు. మూడు రాజధానుల పేరుతో తమ గ్రామాల్లో బ్యానర్లు పెట్టింది వైకాపా నేతలేనన్న జనం.. తమ మద్దతు మాత్రం రాజధానిగా అమరావతికేనని తేల్చి చెప్పారు.

రైతుల పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు

AMARAVATI FARMERS PADAYATRA : రాజధాని రైతుల మహాపాదయాత్ర 32వరోజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం నుంచి స్థానికుల ఘన స్వాగతాల మధ్య ప్రారంభమైంది. రైతులు ట్రాక్టర్లకు ఆకుపచ్చ బెలూన్లు కట్టి భారీ ర్యాలీ చేశారు. కొన్ని ట్రాక్టర్లపై దేవతామూర్తుల ప్రతిమలు పెట్టి ఊరేగింపు నిర్వహించారు. దేవతల మద్దతూ అమరావతికే ఉందనేలా స్థానికులు ప్రదర్శన నిర్వహించారు. 3 రాజధానుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదని ఉండ్రాజవరం ప్రజలు తేల్చిచెప్పారు. రైతు బిడ్డలుగా తమ మద్దతు అమరావతికే అని మహిళలు స్పష్టం చేశారు. అన్నదాతలకు ఇంతవరకు ధాన్యం బకాయిలు చెల్లించని ప్రభుత్వం..3 రాజధానులు ఏం కడుతుందని నిలదీశారు.

బ్రిటీష్‌ వాడైన కాటన్‌దొర గోదావరి జిల్లాల్లో సాగునీటి రంగానికి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ రైతుల పాదయాత్ర ముందుకు సాగింది. 3 రాజధానులు అంటున్న సీఎం జగన్‌ ..3 ప్రాంతాలకూ ముగ్గురు ముఖ్యమంత్రులను నియమిస్తారా అని స్థానికులు ప్రశ్నించారు. 34వేల ఎకరాలు రాష్ట్రాభివృద్ధికి త్యాగం చేశామనే విషయాన్ని పాలకులు గుర్తించాలని రైతులు కోరారు.

ఉండ్రాజవరంలో పాదయాత్ర ప్రారంభ సమయంలో వైకాపా నేతలు హైడ్రామా నడిపారు. స్థానిక వైకాపా నేత బూరుగుపల్లి సుబ్బారావు నివాసం వద్ద పలువురు వైకాపా శ్రేణులు నల్లబెలూన్లు, మూడు రాజధానుల ప్లకార్డులతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రైతులు మాత్రం జై అమరావతి నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రతిపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపితే.. ముందుగానే నిర్బంధాలు చేసే పోలీసులు వైకాపా శ్రేణులను మాత్రం పాదయాత్ర సమీపం వరకు రానిచ్చి అప్పుడు అడ్డుకుంటున్నట్లుగా నాటకాలాడుతున్నారని రైతులు విమర్శించారు. ఉద్యమంలోకి అసాంఘికశక్తులు చొరబడితే ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.

రాజధాని రైతుల మహాపాదయాత్రకు తెదేపా, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, వామపక్షాలు, రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఉదయం మండుటెండ, మధ్యాహ్నం తర్వాత జోరు వర్షం ఇబ్బందిపెట్టినా.. పట్టువదలని సంకల్పంతో రైతులు ముందుకు సాగారు. ఉండ్రాజవరం నుంచి ప్రారంభమైన రైతుల మహాపాదయాత్ర మోర్త, దమ్మెన్ను, వేలివెన్ను, నడుపల్లి కోట, కానూరుల మీదుగా మునిపల్లివరకు సాగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.