ETV Bharat / city

హోరెత్తిన అమరావతి రణన్నినాదం.. ప్రతిధ్వనించిన దిక్కులు..

author img

By

Published : Dec 16, 2021, 9:16 PM IST

Updated : Dec 16, 2021, 10:43 PM IST

Amaravati Farmers Padayatra: 45 రోజులు..! ఊళ్లకు ఊళ్లు.! వందల కిలోమీటర్లు..! వేల గొంతుకలు..! అందరిదీ ఒకే మాట.! అమరావతే ఆశ..శ్వాస.! ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ తుళ్లూరు నుంచి మొదలైన రైతుల మహాపాదయాత్ర.. జైత్రయాత్రగా నిలిచింది. అమరావతి అంటే 29 గ్రామాలది కాదు... ఆంధ్రులందరిదీ అనే ఆకాంక్షను ఎలుగెత్తింది. దారిపొడవునా పూలవర్షానికి పులకించి,.. ఆప్యాయతకు శిరస్సువంచి, లాఠీదెబ్బలను ఎదురించి, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ..అన్నదాతలు వేసిన అడుగులు ఉద్యమానికి కొత్త ఊపిరిలూదాయి.

Amaravati Farmers Padayatra: వారి అడుగులు అమరావతి కలల రాజధానికి ప్రతీకలు. వారంతా... ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతినిధులు.! అమరావతీ నగర నిర్మాణంకోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులు.! ఇందులో ఏనాడూ గడపదాటని మహిళలున్నారు. బీపీ, షుగర్లతో బాధపడే.. వృద్ధులున్నారు. భవిష్యత్‌ను కాంక్షించే యువకులున్నారు. ఉపాధిని వెతుక్కునే... కూలీలూన్నారు. ఇంతమంది కలిసి అడుగేస్తోంది ఒకే దిక్కు.! వీరందరిదీ ఒకటే మొక్కు...! న్యాయం చెప్పే న్యాయస్థానం నుంచి.. ధర్మాన్ని కాపాడే తిరుమల వెంకన్న సన్నిధికి పాదయాత్ర ప్రారంభించారు. ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని అంటూ.. నవంబర్‌ 1న కదం కదిపారు.

వందల కిలో మీటర్లు.. వేల గొంతుకలు

Amaravathi Farmers Protest: అమరావతి అంటే 29 గ్రామాల ప్రజలది మాత్రమేననే.. దుష్ప్రచారం రైతుల్లో పౌరుషం రగిల్చింది. రెండేళ్లుగా శిబిరాల్లో నినదించిన ….సేవ్‌ అమరావతి ఉద్యమాన్ని పొలిమేరలు..దాటించింది. అవమానాలు, అవహేళనలకు విసిగిపోయి తాడోపేడో తేల్చుకునేందుకు ఉద్యమంలోకి.. ఇంటికొకరు అన్నట్లు కదంతొక్కారు. తుళ్లూరులో సర్వమత ప్రార్థనలు చేసి సమరశంఖం పూరించారు. అక్కడ నుంచి ప్రతీ అడుగులో నిబద్ధత, నిజాయతీ, న్యాయం కావాలనే నినాదమే...! ఆరంభమే అదిరింది. ఉద్యమాన్ని మొదట్నుంచీ... హేళన చేస్తున్న హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గాల్లోనూ అడుగడుగనా అఖండ స్వాగతం లభించింది. కాడెడ్లతో రైతుల స్వాగతాలు, ఇంజినీరింగ్ పట్టభద్రులు,.. విద్యార్థుల సంఘీభావం, ఇలా జననీరాజనం. రాజధాని గ్రామాలు దాటి గుంటూరునగరంలో అడుగుపెట్టాక రైతులపై పూలజల్లు కురిసింది. జై అమరావతి నినాదాలతో...నగరం మార్మోగింది.

Nyayasthanam To Devasthanam: పాదయాత్ర స్పందన గుంటూరు జిల్లాలో ఒకలెక్క.. మిగతా జిల్లాల్లో మరో లెక్క. రాజధానేతర జిల్లాల్లో అంత స్పందన ఉండదేమో అనుకుంటే.... అనూహ్య మద్దతు వెల్లువెత్తింది. గుంటూరు కంటే ప్రకాశం.. ప్రకాశాన్నిమించి నెల్లూరు, నెల్లూరు కన్నా చిత్తూరు ఇలా..జిల్లా జిల్లాకూ.. రెట్టింపు ఆదరణ లభించింది. అడ్డంకులు ఎదురవుతాయనుకున్నచోట ఎదురేగి.. ఆహ్వానాలు అందాయి. పొలిమేరల్లోనే... స్వాగత అక్షర తోరణాలు ఆహ్వానం పలికాయి.ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి యాత్రా ప్రవేశం.... జాతరను తలపిచింది. భాజాభజంత్రీలు, పూల వర్షం ఇలా ఒకటేంటి మహిళల్ని..... ఇంటి ఆడపడుచుల్లా స్థానికులు..ఆహ్వానించారు. పుట్టింటికి వచ్చిన తోబుట్టువుల్లా పసుపుకుంకుమపెట్టారు . హారతులుపట్టారు. అమరావతి రైతుల్ని.. ఒక్కో గ్రామం ఒక్కోలా ఆహ్వానించింది.

అమరావతి రైతులు పాదయాత్రలో ప్రకృతికి తప్ప... పోలీసు ఆంక్షలకు తలవంచలేదు. మైకులు వాడడానికి వీల్లేదని ఒకసారి,... రథాలు, బయోటాయిలెట్‌ వాహనాలకు అనుమతి లేదని మరోసారి ఇలా పోలీసులు... అనేక చోట్ల అడ్డంకులు సృష్టించినా... మొండిగానే ముండగువేశారు తప్ప నినాదం ఆపలేదు. నెల్లూరు జిల్లాలో రైతులు,... మహిళలు సవాళ్ల మధ్యే సమరంసాగించారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో రాత్రి బసకు తీవ్ర ఇబ్బందులు ఓ ఎత్తైతే... భారీ వర్షాలు మరో ఎత్తు.! వర్షం కురిసినరోజు పాదయాత్రకు విరామమిచ్చారేగానీ...యాత్ర మధ్యలో కురిసిన జడివానకు జంకలేదు. అర్థాంతరంగా... ఆపేయలేదు. గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకునే కదంతొక్కారు. చలికి వణుకుతూనే ... వాగులు, వరదలూ దాటారు. కాళ్లకు బొబ్బలెక్కినా, వర్షానికి మెత్తబడినా.. ఆ బాధను పంటి బిగువనపట్టి.. లక్ష్యంవైపు సాగారు.

పాదయాత్రలో ఉద్యమ బాణం... ఎక్కడా గురితప్పలేదు. రాజధాని 3 ముక్కలుగా చేయడం ఎంత అన్యాయమో... పల్లె,పట్టణం అన్నతేడా లేకుండా.. ముఖ్య కూడళ్లలో ఎలుగెత్తి చాటారు. భూసమీకరణ నుంచి మొదలు పెట్టి అక్కడ ప్రజాధనం ఎంతఖర్చైంది. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లోఉంది, అమరావతి రాజధానిపై జగన్‌ ప్రతిపక్షంలో... ఏం మాటిచ్చారు.? అధికారంలోకి వచ్చాక ఎలా మాటమార్చారు? ఇలాంటి అంశాలను... వివరిస్తూ వచ్చారు. కళాకారులు తమ ప్రదర్శనలతో అమరావతి అంటే 29 గ్రామాలది కాదు..ఆంధ్రుల గుండెచప్పుడు అనే సందేశాన్ని ప్రజల్లోకి.. తీసుకెళ్లారు. 3రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్లు నవంబర్ 22న.. ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల్ని కాస్త ఊరడించినా.. మళ్లీ కొత్త బిల్లు పెడతామన్న సీఎం జగన్‌ ప్రకటన..ఉద్యమ పట్టుదల.. పెంచింది. అలిపిరిశ్రీవారి పాదాల చెంతకు అలుపెరగకుండా నడిపించింది. ఊళ్లకుఊళ్లను.. కదిలించింది. అమరావతి మీది, మాదికాదు.. మనందరిదీ అనే భావన ప్రజల్లో... తట్టిలేపింది. భూములిచ్చిన రైతుల త్యాగాలకు అర్థం చెప్పింది.

ఇదీ చదవండి:

Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!

Last Updated :Dec 16, 2021, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.