ETV Bharat / city

జగన్​కు ఆప్షన్ లేదు.. అమరావతి నిర్మాణమే శరణ్యం : కోదండరామ్

author img

By

Published : Jun 4, 2022, 11:41 AM IST

Updated : Jun 4, 2022, 12:22 PM IST

MANDADAM: రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రముఖులు.. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులో పోరాటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని నేతలు తేల్చిచెప్పారు.

MANDADAM:
అమరావతి ఉద్యమానికి 900 రోజులు.. పాల్గొన్న ప్రముఖులు

రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం.. 900 రోజులకు చేరుకున్న వేళ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీపీఐ నేత నారాయణ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తేల్చిచెప్పారు. ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు.. ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

అమరావతి ఉద్యమానికి 900 రోజులు.. పాల్గొన్న ప్రముఖులు

ప్రొఫెసర్ కోదండరామ్‌: రైతులు తమ భూములను రాజధానికి ఇచ్చారని.. రాజధాని నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందేనని కోదండరామ్ అన్నారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం పాటించాల్సిందేనని.. రైతుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఆందోళన తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్‌ హరగోపాల్‌: గత ప్రభుత్వ హామీని కొత్త ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని.. పార్టీ మారినప్పుడల్లా రాజధాని మార్చడం మంచిది కాదని హితవు పలికారు. న్యాయం కోసం ఉద్యమాలతో ముందుకెళ్లాల్సిందేనని.. ప్రజా ఉద్యమాలు తప్ప వేరే మార్గం లేదని తేల్చిచెప్పారు. హైకోర్టు తీర్పును ప్రభుత్వం పాటించాలన్నారు. సంఘటిత ఉద్యమంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమానికి 900 రోజులు.. పాల్గొన్న ప్రముఖులు

సీపీఐ నేత నారాయణ: వైకాపా ప్రభుత్వం ఎక్కడా లేని రాజకీయాలు చేస్తోందని సీపీఐ నారాయణ మండిపడ్డారు. ఆత్మకూరులో తెదేపా పోటీచేయట్లేదు కానీ.. వైకాపా నేతలు మాత్రం సవాల్ విసురుతున్నారన్నారు. వైకాపాకు ధైర్యం ఉంటే క్యాబినెట్‌ మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్​ చేశారు. జగన్ సీఎం కాగానే తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు. ఆంధ్రా ప్రజలను ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేకాటలో మూడు ముక్కలాట జగన్‌లో జీర్ణించుకుపోయిందని.. అందుకే మూడు రాజధానులంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిలో మిగిలిన భూములు అభివృద్ధి చేసి ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు కొనసాగించాలని.. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా అవసరం భాజపాకు ఉందని స్పష్టం చేశారు. హోదా, స్టీల్‌ప్లాంట్‌, పోలవరంపై ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి తేవచ్చని చెప్పారు.

లంకా దినకర్: 900 రోజులుగా అమరావతి నుంచే పాలన సాగుతోందని లంకా దినకర్ అన్నారు. జగన్ మనస్సులో మాత్రం అమరావతి నిర్వీర్యమైందని.. ఉద్యమంలో మహిళలు, రైతుల అణచివేతే జగన్‌ ప్రాధాన్యత అని మండిపడ్డారు. అమరావతిపై కోర్టు తీర్పు అమలు చేయట్లేదని.. అమరావతి రైతుల వేదన రాష్ట్రం మొత్తం విస్తరించిందని తెలిపారు.

తెనాలి శ్రావణ్‌: అమరావతి నిర్మాణంపై హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని తెనాలి శ్రావణ్‌ అన్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లో రైతులపై నెపం మోపేలా ప్రభుత్వ వ్యవహారం ఉందని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులు రావట్లేదని ప్రచారం చేస్తున్నారని.. ప్లాట్లు పొందిన రైతులు ఐకాస ఆధ్వర్యంలో వాస్తవాలు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు పింఛన్‌ రూ.5 వేలు చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ఆగిపోయి కూలీలు పనులు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 12:22 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.