ETV Bharat / city

తప్పుడు లెక్కల అధికారులపై చర్యలు...రాష్ట్రాలకు ఆర్థిక శాఖ లేఖ..?

author img

By

Published : May 5, 2022, 10:01 AM IST

Actions: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చిన అఖిలభారత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ఆర్థికశాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ తాజాగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో హెచ్చరించినట్లు సమాచారం.

Central Finance Ministry
రాష్ట్రాలకు ఆర్థిక శాఖ లేఖ

Actions: కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించినట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని లేఖలో ఉన్నట్లు పలు వర్గాలు చెప్పుకొంటున్నాయి. "నిర్లక్ష్యంతోనో, ఉద్దేశపూర్వకంగానో ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఒక ప్రభుత్వ హయాంలో అర్హతకు మించి అప్పులు చేస్తే, ఆ మొత్తాన్ని తదుపరి ప్రభుత్వ హయాంలో మినహాయించాల్సి వస్తుంది. అది ఇబ్బందులకు దారితీస్తుంది. నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితుల గురించి అబద్ధాలు చెప్పినా, తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించినా కేంద్ర ఆర్థికశాఖ అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటుంది. ఇందుకు బాధ్యులైన వారు అఖిల భారత సర్వీసు అధికారులైతే వారి పేర్లను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు పంపి కేంద్ర డిప్యుటేషన్‌ సహా వివిధ సమయాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరతాం. సమాచారం తప్పు అని తెలిసీ ధ్రువీకరించి పంపిన అధికారుల వివరాలను ఈ కేటగిరీలోకి తీసుకుంటాం. అలాగే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికీ తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెబుతాం. కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులు రాష్ట్రంలో డిప్యుటేషన్‌ మీద పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే వారిని వెనక్కి పిలిపించమని కోరతాం. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అడుగుతాం. అప్రయత్నంగా జరిగిన చిన్నచిన్న తప్పులను పరిగణనలోకి తీసుకోం’’ అని కేంద్ర ఆర్థికశాఖ ఈ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం అందించిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: జగన్‌ పాలనలో ఆస్తులకు, ఆడబిడ్డలకు, ప్రాణాలకు రక్షణ లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.