sexual harrasements: అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో అత్యధికులు వారే !

author img

By

Published : Oct 19, 2021, 7:07 AM IST

sexual harrasements

పరిచయస్తులే కదా.. అనే నమ్మకంతో ఉంటే అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. స్నేహితులే కదా అని చనువిస్తే కామాంధుల్లా మారి కాటేస్తున్నారు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కుటుంబసభ్యులూ కీచకుల్లా మారిపోతున్నారు. ఇలా రాష్ట్రంలో గతేడాది జరిగిన అత్యాచార కేసుల్లో 99.4 శాతం మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు.

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాాచారాల కేసులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. వారితో అత్యధిక శాతం మంది బాధితులకు తెలిసిన వారే.. ఈ ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 99.4 శాతం మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. వీరిలో బాధితుల ఇరుగుపొరుగు వ్యక్తులు, ఆన్‌లైన్‌ వేదికల్లో పరిచయమైన స్నేహితులు కుటుంబ స్నేహితులు, ఉద్యోగమిచ్చిన యజమాని తదితరులే అధికం. చాలా మంది బాధితులు లైంగిక వేధింపులకు గురైనా ఎవరికీ చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతున్నారు. కుటుంబసభ్యులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు వారి గురించి ఇంట్లో చెప్పినా ఎవరూ నమ్మరేమోనని మరికొందరు బయటకు వెల్లడించడం లేదు. ఒకవేళ చెప్పినా కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులూ బయటకు రాకుండా చేసేస్తున్నారు. దీంతో తామేం చేసినా బాధితులు ఎవరికి చెప్పరులే అనే ఉద్దేశంతో వారు దారుణాలకు ఒడిగడుతున్నారు.

1,088 కేసుల్లో తెలిసినవారే నిందితులు

  • 2020లో రాష్ట్రంలో నమోదైన మొత్తం అత్యాచార కేసులు: 1,095
  • తెలిసినవారే అత్యాచారానికి పాల్పడిన కేసులు: 1,088 (99.4 శాతం)

కొన్ని తార్కాణాలు

  • పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై బావ వరుసయ్యే యువకుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
  • కుమార్తెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కీచక తండ్రి. బాలిక తల్లి ఫిర్యాదుతో విజయవాడలో రెండు నెలల కిందట కేసు నమోదైంది.
  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ మహిళ పరిచయస్తుడి ఆటో ఎక్కారు. అతడు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
  • విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై చిన్నాన్న వరుసయ్యే వ్యక్తే అత్యాచారం చేశాడు.

ఏం చేయాలి?

  • కుటుంబసభ్యులు, బంధువులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు బాధితులు ఆ విషయాన్ని తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి.
  • అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నవారిని గట్టిగా ఎదిరించాలి. వారికి ఒంటరిగా చిక్కకుండా ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడపాలి.
  • పనిచేసే చోట యజమాని, సహోద్యోగులు తప్పుగా ప్రవర్తిస్తుంటే ప్రారంభంలోనే వారిని గట్టిగా హెచ్చరించాలి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి.
  • ఒంటరిగా ఉన్నప్పుడు ద్వందార్థాలతో మాట్లాడటం, ప్రవర్తనలో తేడాలు, పదే పదే తాకటానికి ప్రయత్నిస్తుంటే వారిని ముందే హెచ్చరించాలి.
  • తమ ప్రవర్తన కూడా ఎలాంటి అనుమానాలకు, అపార్థాలకు తావిచ్చేదిగా ఉండకుండా హుందాగా వ్యవహరించాలి.
....

ఇదీ చదవండి

Sexual Harassment: పాఠాలు చెప్పాల్సిన గురువే.. పాడు పని చేశాడు !

murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.