ETV Bharat / city

అక్కడ ధరలు పెరిగితే.. ఇక్కడున్న అన్నదాతపై అదనపు భారం!

author img

By

Published : Sep 6, 2021, 7:32 AM IST

30-percent-additional-burden-on-indian-farmers-with-increased-raw-material-prices-internationally
అక్కడ ధరలు పెరిగితే.. ఇక్కడున్న అన్నదాతపై అదనపు భారం!

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి సరకుల ధరలు పెరగడంతో... దేశీయ రైతులపై అదనంగా 30 శాతం భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీ భరించకుంటే... ఎరువుల ధరలు మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు.

ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి సరకుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగాయి. ఫాస్ఫారిక్‌ ఆమ్లం ధర ఏడాదిలో 80% పైగా పెరిగింది. ఈ ప్రభావం దేశీయంగా ఎరువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఖరీఫ్‌ (సెప్టెంబరు వరకు)లో ఎరువుల ధరలు పెరగబోవని కేంద్రం హామీ ఇచ్చినా... కొన్ని రకాల కాంప్లెక్స్‌ రకాల ఎమ్మార్పీ ఇప్పటికే రూ.1,550 వరకు చేరింది. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా మరింత పెంచేందుకు తయారీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువులపై కేంద్రం రాయితీ పెంచకుంటే బస్తాకు రూ.200 వరకు పెరగొచ్చని తయారీ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డీఏపీపై కేంద్రం రాయితీ ఇస్తున్నా... పెరుగుతున్న వ్యయం కారణంగా సంస్థలు దిగుమతిని, ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా సరఫరా క్రమంగా నెమ్మదిస్తోంది. కేంద్రం ఉపశమన చర్యలు తీసుకోకుంటే.. ఖరీఫ్‌, రబీల్లో రైతులు ఎరువులపై పెట్టే పెట్టుబడి 30% వరకు పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

మారిన విధానంతో రైతులపై భారం

2008 సంవత్సరంలోనూ ఫాస్ఫారిక్‌ ఆమ్లం ధర గరిష్ఠ స్థాయికి చేరింది. అప్పట్లో ఎరువుల ఎమ్మార్పీ ధరలు స్థిరంగా ఉండేవి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రాయితీ నిర్ణయించేవారు. తర్వాత రాయితీ విధానంలో మార్పు వచ్చింది. సబ్సిడీని స్థిరంగా ఉంచడంతో... ఎరువుల ఎమ్మార్పీ ధరలు పెరుగుతున్నాయి. ఈ భారాన్ని రైతులే మోయాల్సి వస్తోంది.

నీటిమూటగా కేంద్రం హామీ

ఖరీఫ్‌ వరకు ఎరువుల ధరలు పెరగబోవని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే... డీఏపీ మినహా మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 20-20-0-13 రకం ఎరువుల బస్తా (50కిలోలు) ధర ఏప్రిల్‌లో రూ.975 ఉండగా... ప్రస్తుతం రూ.1,325 అయింది. ఇఫ్‌కో మాత్రం ఈ రకం ఎరువుల బస్తాను ఇప్పటికీ రూ.975పైనే విక్రయిస్తోంది. వాస్తవానికి రసాయన ఎరువుల్లో.. అన్నింటికంటే డీఏపీ ఖరీదే ఎక్కువ. కేంద్రం రాయితీ ఇస్తుండటంతో డీఏపీ ధర 50 కిలోల బస్తా రూ.1,200 వద్ద ఆగింది. 28-28-0, 14-35-14 తదితర ఎరువుల బస్తాల ధరలు రూ.1,550 అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పెంచితే... మున్ముందు ఇది రూ.1,700 వరకు చేరొచ్చని చెబుతున్నారు. సల్ఫ్యూరిక్‌, ఫాస్పారిక్‌ ఆమ్లాల ధరలు తగ్గనంతవరకూ ఎరువుల ధరల్లో పెరుగుదల ఆగకపోవచ్చు. ‘నత్రజని, పొటాషియం, సల్ఫర్‌పై రాయితీ పెంచాలి. దీన్ని అక్టోబరు వరకు కేంద్రం భరించాలి. భాస్వరంపై రాయితీని కుదించుకోవడం ద్వారా సమతుల్యం సాధించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అక్టోబరు, నవంబరు నాటికి తగ్గుతాయి. అప్పుడు రాయితీపై నిర్ణయం తీసుకోవచ్చు. కనీసం ఆరు నెలలపాటు చేయూత అందిస్తే ఎరువుల ధరలు పెరగకుండా ఉంటాయి’ అని ఎరువుల రంగ నిపుణులు డాక్టరు రవిప్రసాద్‌ సూచించారు.

అంతర్జాతీయంగా ఎగిసిపడుతున్న ముడి సరకుల వెల

చైనాలో తగ్గిన ఉత్పత్తి

ఒక టన్ను డీఏపీ తయారీకి 460 కిలోల ఫాస్ఫారిక్‌ ఆమ్లం, 220 కిలోల అమ్మోనియా అవసరం. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది జులైతో పోలిస్తే.. జులై నాటికి అమ్మోనియా, డీఏపీల ధరలు వరుసగా 185%, 90% పెరిగాయి. ఆగస్టులో మరింత పెరిగాయి. కాలుష్యం కారణంగా ఎరువుల తయారీ, ఎగుమతిని చైనా తగ్గించుకుంది. గతంలో అక్కడి నుంచి ఏడాదికి 30 లక్షల టన్నుల యూరియా, 10 లక్షల టన్నుల డీఏపీ వచ్చేది. ఈసారి 10 లక్షల టన్నుల యూరియా కూడా రాలేదు. అదేసమయంలో దేశీయ తయారీ సంస్థలు నష్టభయంతో ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.

  • ఇటీవల పంజాబ్‌ మార్క్‌ఫెడ్‌ 3 లక్షల టన్నుల డీఏపీ కోసం టెండర్లు పిలిస్తే.. ఒక్క తయారీ సంస్థ కూడా స్పందించలేదు.
  • జులైకి సంబంధించి దేశీయంగా 3.83 లక్షల టన్నుల డీఏపీ ఉత్పత్తి లక్ష్యముండగా... 3.01 లక్షల టన్నులే వచ్చింది. 6.56 లక్షల టన్నుల్ని దిగుమతి చేసుకున్నారు.

ఇదీ చూడండి: మద్య నిషేధం హామీ గాలికి... ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు యత్నాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.