ETV Bharat / business

'పన్ను ఎగవేతకు 'వివో' పక్కా కుట్ర.. చైనాకు రూ.62వేల కోట్లు!'

author img

By

Published : Jul 7, 2022, 7:12 PM IST

VIVO ED News: మనీలాండరింగ్​ కేసులో భాగంగా చైనా మొబైల్​ తయారీ సంస్థ వివోపై ఎన్​ఫోర్స్​మెంట్​ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ టర్నోవర్​లో దాదాపు 50 శాతం ఇప్పటికే చైనాకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మొత్తం సుమారు రూ. 62 వేల 466 కోట్లు అని వెల్లడించింది. భారత్​లో పన్ను ఎగ్గొట్టేందుకు చైనా కంపెనీ ఇలా చేసినట్లు పేర్కొంది.

Vivo remitted almost 50 pc of turnover to China to avoid getting taxed in India, says ED
Vivo remitted almost 50 pc of turnover to China to avoid getting taxed in India, says ED

VIVO ED News: చైనా మొబైల్‌ తయారీ సంస్థ వివో ఆర్థిక అక్రమాల డొంక కదులుతోంది. వివో మొబైల్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, 23 దాని అనుబంధ కంపెనీలపై ఈ నెల 5న దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కీలక విషయాలను గుర్తించింది. భారత్‌లో పన్ను ఎగవేసేందుకు వివో తమ టర్నోవర్‌లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం 62వేల 476కోట్లు అని వెల్లడించింది. 119 బ్యాంకు ఖాతాల్లో ఉన్న 465 కోట్ల రూపాయల వివో నిధులను స్తంభింపజేసినట్లు వివరించింది. మరో 73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలను కూడా సీజ్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.

వివో మాజీ డైరెక్టర్‌ బిన్‌ లౌ అనేక కంపెనీలను విలీనం చేసిన తర్వాత 2018లో భారత్‌ విడిచి వెళ్లినట్లు ఈడీ వెల్లడించింది. ఆ కంపెనీలన్నీ తమ దర్యాప్తు పరిధిలో ఉన్నట్లు వివరించింది. వివోకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు జెంగ్‌షెన్‌ ఔ, చాంగ్‌ చియా ఈనెల 5న సోదాలు జరిగిన తర్వాత చైనా పారిపోయినట్లు ప్రచారం జరిగినా.. 2021లోనే వెళ్లిపోయినట్లు ఈడీ అధికారి ఒకరు చెప్పారు. ఇదే ఆరోపణలపై సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. సోదాల సందర్భంగా పలువురు చైనా దేశస్థులు సహా వివో ఉద్యోగులు తమకు సహకరించలేదని ఈడీ ఆరోపించింది. దర్యాప్తు బృందాలు గుర్తించిన డిజిటల్ సామగ్రిని దాచడం, అందులోని సమాచారాన్ని తొలగించడం వంటివి చేశారని విమర్శించింది. కొందరు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.

చైనా సంస్థల ఆర్థిక ‌అవకతవకలపై విచారణలో భాగంగానే వివోపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఐటీ విభాగం, కేంద్ర వాణిజ్య శాఖ సైతం వివో సంస్థ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. వివో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు అంశాన్ని దగ్గరగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ కూడా తెలిపింది. భారత దర్యాప్తు సంస్థలు చట్టాలకు లోబడి చైనా సంస్థలపై పారదర్శకంగా దర్యాప్తు చేస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. చైనా కంపెనీలనే లక్ష్యంగా చేసుకొని ఇలాంటి దాడులు నిర్వహించడం వల్ల భారత్‌పై పెట్టుబడి దారుల్లో విశ్వాసం దెబ్బతింటుందని చైనా పేర్కొంది. చైనా సహా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తాయని హెచ్చరించింది. మరోవైపు వివో వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. భారత్‌లో నడిచే కంపెనీలు ఇక్కడి చట్టాలకు లోబడే పని చేయాలని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: 'వివో కంపెనీ'పై ఈడీ దాడులు.. 44ప్రాంతాల్లో సోదాలు

ఈడీ దాడులతో 'వివో' హడల్.. చైనాకు డైరెక్టర్లు పరార్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.